Advertisement
Advertisement
Abn logo
Advertisement

సన్నాలకు మద్దతేదీ

సన్నధాన్యం కొనని ప్రభుత్వం, ప్రైవేటు వ్యాపారులు

ప్రభుత్వ నియంత్రిత సాగు విధానంతో పెరిగిన సన్నాల సాగు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు ఐదు లక్షల ఎకరాల్లో సాగు

ఖిన్నులవుతున్న ‘సన్న’ రైతులు


సన్నరకం ధాన్యాన్ని కొనే నాథుడు లేక రైతులు బిత్తర చూపులుచూస్తున్నారు. ఇటు మద్దతు ధర లేక, అటు పెట్టుబడి ఖర్చు భారం పెరి గి ఏమి చేయాలో పాలుపోనిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. దొడ్డు రకం ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం ఏటా మద్దతు ధర ప్రకటిస్తూ, సన్న రకాలను మాత్రం పట్టించుకోకపోవడంతో రైతుల్లో గందరగోళం నెలకొంది. ప్రభుత్వం, ప్రైవేట్‌ వ్యాపారులు సైతం కొనుగోలు చేసేందుకు ముందుకు రాకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. 


మోత్కూరు, నవంబరు 24: గత సంవత్సరం నుంచి ప్రభుత్వం నియంత్రిత సాగు విధానం (60 శాతం సన్నరకం, 40శాతం దొడ్డురకం వరి సాగు) అమలు చేస్తుండటంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సన్న వరిసా గు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. నవంబరు మొదటి వారం నుంచి సన్న వరి పంటకోతలు ప్రారంభమయ్యాయి. కేంద్రప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిన పంటల జాబితాలో సన్నరకం లేదు. కేంద్రప్రభుత్వ నిబంధనల ప్రకారం సన్న రకాలు సాధారణ రకం ధాన్యం కిందికి వస్తాయి. సన్న రకం వరి సాగు ఖర్చు, దిగుబడి కాలపరిమితి ఎక్కువ, దిగుబడి తక్కువ. మద్దతు ధరకు కొంత బోనస్‌ ఇస్తేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది. బోనస్‌ మాట అలా ఉంచి ధాన్యం కొనేవారు లేక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కె ట్లు, ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం రాశులు పోసి రైతులు కొనుగోళ్లకోసం రోజుల తరబడి నిరీక్షిస్తూనే ఉన్నారు. 


సన్నరకానికి డిమాండ్‌ ఎక్కువ

ఉన్నత, మధ్య తరగతి కుటుంబా లు ఎక్కువగా సోనామసూరి, బీపీటీ బియ్యానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. విద్యార్థులు దొడ్డు బియ్యం అన్నం తిన లేకపోతున్నారనే ప్రభుత్వం పాఠశాలలు, హాస్టళ్లలో సన్నబియ్యంతో భోజనం పెడుతోంది. అంగన్‌వాడీలు, రేషన్‌ దుకాణాల్లోనూ సన్న బియ్యం ఇవ్వాలన్న డిమాండ్‌ చాలా కాలంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ సన్న బియ్యం భోజనం పెడుతామ ని ప్రకటించింది. గత యేడాది సన్న వరి సాగును ప్రోత్సహించిన సీఎం కేసీఆర్‌ రేషన్‌ దుకాణాల్లోనూ పేదలకు సన్నబియ్యం ఇస్తామని ప్రకటించారు. అంతటి ప్రాధా న్యం కలిగిన సన్నరకాలను రైతులు సాగుచేస్తే ఆ ధాన్యం కొనేవారులేక రైతులు బిక్కుబిక్కుమంటున్నారు. 


పంట కాలం, ఖర్చూ ఎక్కువ.. దిగుబడి తక్కువ

దొడ్డు రకం వరి పంట కాలపరిమితి నాలుగు నెలలు కాగా, సన్న రకం వరి కాలపరిమితి ఐదు నెలలు. దొడ్డురకం వరికి ఎకరాకు రూ.25వేలు ఖర్చు వస్తుండగా, సన్న వరికి రూ.30వేలు ఖర్చవుతుంది. దొడ్డురకం పంట ఎకరాకు సుమారు 40 బస్తాల దిగుబడి వస్తే సన్న రకం 30బస్తాలే వస్తుంది. సుమారు 10 బస్తాల ధాన్యం తక్కువ వస్తుంది. గతంలో దొడ్డురకం కన్నా బహిరంగ మార్కెట్లో సన్న ధాన్యానికి రేటు ఎక్కువగా ఉండేది. గత యేడాది నుంచి అలా ఉండటంలేదు. ప్రైవేటు వ్యాపారు లు దొడ్డు రకం ధాన్యం ధర కన్నా సన్న ధాన్యాన్ని తక్కు వ రేటుకు అడుగుతున్నారు. సన్న బియ్యం క్వింటాల్‌ రూ.3వేల నుంచి రూ.3500 అమ్ముతున్న వ్యాపారులు వడ్లను మాత్రం క్వింటాల్‌ రూ.1400 నుంచి 1500లోపే కొంటున్నారు. దీంతో గత యేడాది ప్రభుత్వమే మద్దతు ధరకు సన్న ధాన్యం కూడా కొనుగోలు చేసింది. ఈ సంవత్సరం సన్నరకం ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నుంచి తమకు ఆదేశాలు రాలేదంటూ మార్కెట్లు, ఐకేపీ కేంద్రాల్లో సన్న ధాన్యం కొనుగోలు చేయడంలేదు. దొడ్డురకం ధాన్యం మాత్రమే కొంటున్నారు. మోత్కూరులో ప్రైవేట్‌ వ్యాపారులు సన్నధాన్యం కొనడంలేదు. అనాజిపు రం, అమ్మనబోలు, తదితర గ్రామాల్లో ప్రైవేటు వ్యాపారు లు క్వింటాకు రూ.1450 ధర చెప్పి తీరా ధాన్యం అక్కడకు తీసుకెళ్లాక ధాన్యం నల్లగా ఉంది, నూక అవుతున్నదంటూ మెలిక పెట్టి ధర తగ్గిస్తున్నారు. అంత దూరం తీసుకెళ్లాక తిరిగి వాపసు తెచ్చుకోలేక వారు అడిగిన ధరకు ఇచ్చి వెనుదిరుగుతున్నారు. జిల్లాలో 59,625 ఎకరాల్లో, సూర్యాపేట జిల్లాలో 2.42 లక్షల ఎకరాల్లో, నల్లగొండలో రెండు లక్షల ఎకరాల చొప్పున ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈసీజన్‌లో  5,01,625 ఎకరాల్లో రైతులు సన్న వరి సాగు చేశారు. సుమారు తొమ్మిదిన్నర లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అధికారుల అంచనా.


తేమ పేరుతో మిల్లర్ల కొర్రీలు

భూదాన్‌పోచంపల్లి : జిల్లావ్యాప్తంగా సుమారు 37 రైసుమిల్లులు మాత్రమే ఉన్నాయి. మిల్లులు తక్కువగా ఉండటంతో వరి ధాన్యం కొనుగోలుతోపాటు సీఎంఆర్‌ విషయంలోనూ వాళ్ల మాటే చెల్లుతోంది. గత సీజన్‌లో అక్రమాలు జరిగినట్లు తేలడంతో కొన్ని మిల్లులను సీజ్‌చేశారు. వానాకాలంనుంచి ఆమిల్లులకు కూడా ధాన్యం పంపుతున్నారు. అయితే మిల్లులకు వచ్చిన ధాన్యంలో మాయిశ్చర్‌ (తేమ) పేరుతో 40కిలోల బస్తాకు 4కిలోల చొప్పున కోత పెట్టేందుకు ఒప్పుకుంటేనే వరి ధాన్యం లోడు దింపుకుంటామని, లేదంటే పక్కన పెట్టేస్తామని చెబుతున్నారు. పీఏసీఎస్‌, ఐకేసీ సెంటర్ల నిర్వాహకులు కూడా మిల్లు యజమానులకే మద్దతు పలుకుతూ రైతులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అధికారు లు, మిల్లర్లు కుమ్మక్కై రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. 


క్వింటాల్‌కు ఎనిమిది కిలోల కోత 

వరి ధాన్యంలో తేమశాతం ఎక్కువగా ఉందని, క్వింటాకు ఎనిమిది కిలోల కోతకు ఒప్పుకుంటేనే లోడు దించుకుంటామని భూదాన్‌పోచంపల్లి మండలం రాంలింగంపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటైన కన్యకాపరమేశ్వరి రైసుమిల్లు యజమానులు పేర్కొంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పిలాయిపల్లిలోని సాయిబాలాజీ రైసు మిల్లర్‌ మూసీ కింద పండించన ధాన్యం కొనుగోలు చేయబోమని, ధాన్యం కోతకు ఒప్పుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూసీ పరివాహకంలోని ధాన్యాన్ని తీసుకోమని ఆ మిల్లు యజమాని దూరంగా ఉన్న మోత్కూరు, ఆత్మకూరు మండలాల రైతుల నుంచి ధాన్యం దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో ఇక్కడి రైతులు జేఏసీగా ఏర్పడి నాలుగు రోజులుగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. 


సన్న ధాన్యం కొనడం లేదు : పోతరబోయిన రామలింగయ్య, రైతు, మోత్కూరు

మూడు ఎకరాలు సన్న వరి సాగు చేశా. వరి కోసి ధా న్యం తెచ్చి మోత్కూరు మార్కెట్లో పోశా. సుమారు 150బస్తాలు (60 క్వింటాళ్లు) అవుతాయి. ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుందామన్నా కొనడం లేదు. ధాన్యం మార్కెట్లో పోసి 15రోజులు అవుతుంది. మార్కెట్లో దొడ్డు రకం ధాన్యం కొంటున్నారే తప్ప సన్న ధాన్యం కొనడం లేదు.


Advertisement
Advertisement