ఇప్పటికీ ముంపులోనే..కాలనీలు, బస్తీలను వీడని వరద

ABN , First Publish Date - 2020-10-21T11:01:37+05:30 IST

వారం రోజులుగా ముంపు ప్రాంతాల్లో వరద పారుతూనే ఉంది. మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

ఇప్పటికీ ముంపులోనే..కాలనీలు, బస్తీలను వీడని వరద

సకాలంలో అందని సహాయక చర్యలు

వర్షాలు సాధారణంగా ఉన్నా.. అదే ఆలస్యం

జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, ఇతర ప్రభుత్వ విభాగాల తీరుపై విమర్శలు

కావల్సిన యంత్రాలు, సిబ్బంది లేకపోవడమూ కారణం

ఇప్పుడిప్పుడే అదనపు ఏర్పాట్లు

కరోనా భయంతో పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు బాధితుల అనాసక్తత

ఇంకా 80 కాలనీలు నీటిలోనే ఉన్నాయి 

సోమవారం విలేకరులతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌


మంగళవారం మధ్యాహ్నం కురిసిన  వర్షానికి మరో 20 నుంచి 30 కాలనీలు  నీట మునిగాయి. వానలు మొదలై వారం దాటింది. 13వ తేదీన అత్యధికంగా 32 సెం.మీల వర్షపాతం నమోదైంది. ఇది 112 ఏళ్లలో రెండో అత్యధిక వర్షపాతం. అనంతరమూ ఆ స్థాయిలో కాకున్నా... భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ కాలనీలు, బస్తీలు నీట మునుగుతున్నాయి. 


హైదరాబాద్‌ సిటీ, అక్టోబర్‌ 20(ఆంధ్రజ్యోతి): వారం రోజులుగా ముంపు ప్రాంతాల్లో వరద పారుతూనే ఉంది. మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో నీట మునిగిన ప్రాంతవాసులకు కంటి మీద కునుకు ఉండడం లేదు. మబ్బు వేసిందంటే చాలు వణికిపోతున్నారు. ఇప్పటికే నగరంలోని చాలా చెరువులు నిండుకుండలా మారాయి. కొన్ని చెరువులు తెగాయి. భారీ వర్షాలు పడితే మరిన్ని చెరువులకూ ముప్పు ఉంది. పరిసర కాలనీలు, బస్తీలు నీట మునిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేశారు. అయితే అవసరమైన స్థాయిలో సిబ్బంది, మోటార్లు, ఇతర యంత్రాలు అందుబాటులో లేవని అధికారులు చెబుతున్నారు. కాలనీలో నీరు నిలిచిందని ఫోన్‌ చేస్తే.. వెంటనే స్పందించడం లేదని నదీం కాలనీకి చెందిన ఓ వ్యక్తి పేర్కొన్నాడు. 


సహాయక చర్యల్లో ఆలస్యం

‘మా కాలనీలోకి నీళ్లు వచ్చాయి. ఎన్ని ఫోన్లు చేసినా స్పందించ లేదు. మా పరిస్థితే ఇలా ఉంటే. సామాన్యులు ఎంత ఇబ్బంది పడుతున్నారో..?’ అని జీహెచ్‌ఎంసీ మాజీ అధికారొకరు అభిప్రాయపడ్డారు. కొన్ని రోజులుగా భారీ వర్షపాతం నమోదు కాకున్నా... సహాయక చర్యల్లో ఆలస్యమవుతోంది. ఫాక్స్‌సాగర్‌లోని ఉమా మహేశ్వరనగర్‌.. వారం దాటినా ఇప్పటికీ నీటిలోనే ఉంది. అక్కడి నుంచి వరద నీటిని తరలించేందుకు అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించలేకపోయారు. గడ్డి అన్నారంలోని సీసాల బస్తీ, నదీం కాలనీ, ఆల్‌ జుబెల్‌ కాలనీ, బీఎస్‌ మక్తా తదితర ప్రాంతాల్లోనూ ఇదే దుస్థితి. మొదటి రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మొదలైన వర్షం రాత్రికి ఉధృతరూపం దాల్చింది. ఏకధాటిగా కురిసిన కుంభవృష్టితో నాలాలు పొంగి, చెరువులు తెగి వందల సంఖ్యలో కాలనీల్లోకి నీరు చేరింది. అర్ధరాత్రి కావడంతో చాలా చోట్ల సహాయక చర్యలు అందలేదు. ఆ తరువాత కూడా దాదాపు అదే పరిస్థితి నెలకొంది. 


వరద నీటితో సహాయానికి ఇబ్బందులు

పలు ప్రాంతాల్లో 10-12 అడుగుల ఎత్తున నీరు ఉండడంతో జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్‌ బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొనలేకపోయాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ రంగంలోకి దిగినా సహాయక చర్యల్లో ఇబ్బందులు తలెత్తాయి. జీహెచ్‌ఎంసీ వద్ద 18 బోట్లు మాత్రమే ఉండగా.. కేవలం ఆరు పడవలు మాత్రమే వినియోగించారు. ముంపునకు గురైన కాలనీలు ఎక్కువగా ఉండడం.. బోట్లు అందుబాటులో లేక సహాయక చర్యల్లో జాప్యం జరుగుతోంది. 


కరోనా భయంతో....

ముంపు ప్రాంతాల్లో బాధితులను అధికారులు పునరావాస  కేంద్రాలకు తరలిస్తున్నారు. ఒక్కో చోట 20 నుంచి 100 అంతకంటే ఎక్కువ మందిని ఉంచుతుండడంతో ఆ కేంద్రాలకు వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు. కరోనా భయంతో పునరావాస కేంద్రాలకు వెళ్లకుండా.. భవనంలోని పై అంతస్తు/బంధువులు/స్నేహితుల ఇళ్లకు వెళ్తున్నారు. పునరావాస కేంద్రాల్లో కరోనా పరీక్షలు చేసే సదుపాయం ఉందని చెప్పినా.. జంకుతున్నారు. సెల్లార్లలో రోజుల తరబడి వరద నీరు నిలిచి ఉన్న దృష్ట్యా.. విద్యుత్‌ షాక్‌ వచ్చే ప్రమాదంతో పాటు భవనమూ బలహీనపడే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. 


సహాయక చర్యలు ఇలా..

డీఆర్‌ఎఫ్‌ బృందాలు - 6


నీటిని తోడేందుకు వినియోగించిన 

యంత్రాలు, బృందాలు - 192

మాన్యువల్‌ డీ వాటరింగ్‌ బృందాలు - 170

వినియోగించిన పడవలు - 6

ప్రొక్లెయినర్‌/బాబ్‌కాట్‌లు - 20 

Updated Date - 2020-10-21T11:01:37+05:30 IST