మోదీకి సిట్ క్లీన్‌చిట్‌పై విచారణ వాయిదా

ABN , First Publish Date - 2021-04-13T19:48:56+05:30 IST

గుజరాత్ అల్లర్ల కేసులో 2002నాటి గుజరాత్ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి

మోదీకి సిట్ క్లీన్‌చిట్‌పై విచారణ వాయిదా

న్యూఢిల్లీ : గుజరాత్ అల్లర్ల కేసులో 2002నాటి గుజరాత్ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇచ్చిన క్లీన్ చిట్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు మరో రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన ఎంపీ ఎహసాన్ జాఫ్రీ సతీమణి జకియా జాఫ్రీ ఈ పిటిషన్ దాఖలు చేశారు.  


పిటిషనర్ జకియా జాఫ్రి ఈ కేసు విచారణను వాయిదా వేయాలని కోరినట్లు జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం తెలిపింది. మార్చి 16న ఈ కేసు విచారణను ఏప్రిల్ 13కు వాయిదా వేస్తూ, ఇకపై వాయిదాలను కోరితే అనుమతించబోమని ధర్మాసనం తెలిపింది. జకియా జాఫ్రి తరపున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ వాదిస్తున్నారు. 


2002 ఫిబ్రవరి 27న గుజరాత్‌లోని గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్-6 బోగీ దగ్ధమైంది. ఈ బోగీలోని 59 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో గుజరాత్‌లో అల్లర్లు చెలరేగాయి. ఫిబ్రవరి 28న అహ్మదాబాద్‌లోని గుల్బర్గ సొసైటీలో 68 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎహసాన్ జాఫ్రీ ఒకరు. ఈ కేసులో నరేంద్ర మోదీతోపాటు మరొక 63 మందిపై విచారించదగిన సాక్ష్యాధారాలు లేవని ప్రత్యేక దర్యాప్తు బృందం చెప్పింది. ఈ కేసు దర్యాప్తును ముగిస్తున్నట్లు క్లోజర్ నివేదికను 2012 ఫిబ్రవరి 8న సమర్పించింది.


సిట్ నిర్ణయాన్ని జకియా జాఫ్రీ గుజరాత్ హైకోర్టులో సవాల్ చేశారు. ఆమె పిటిషన్‌ను హైకోర్టు 2017 అక్టోబరు 5న తోసిపుచ్చింది. దీనిని సవాల్ చేస్తూ 2018లో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 


Updated Date - 2021-04-13T19:48:56+05:30 IST