వ్యాక్సిన్‌పై వివక్షా?

ABN , First Publish Date - 2021-06-03T08:58:10+05:30 IST

కేంద్ర ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ విధానాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. 45 ఏళ్లకుపైబడినవారికి ఉచితంగా టీకా వేస్తామని.. 18-44 ఏళ్లలోపు వారు కొనుక్కొని వేయించుకోవాలనడం వివక్షతో కూడుకున్నదని.. హేతుబద్ధత లేని విధానమని ఘాటుగా ఆక్షేపించింది.

వ్యాక్సిన్‌పై వివక్షా?

45 ఏళ్లకు పైబడినవారికే ఉచితమా?.. ఆలోపు వారైతే కొనుక్కోవాలా?

మీ వ్యాక్సిన్‌ విధానం సహేతుకం కాదు.. కేంద్రంపై సుప్రీం ఫైర్‌

18-44 ఏళ్ల వయస్కులకూ కొవిడ్‌ వైరస్‌ సోకుతోంది

దురదృష్టవశాత్తూ వారిలో కొందరు చనిపోతున్నారు

పౌర హక్కుల ఉల్లంఘనను కోర్టు చూస్తూ ఊరుకోదు

కార్యనిర్వాహక పాలసీలో మేం జోక్యం చేసుకుంటాం

మీ విధానాన్ని సమీక్షించండి ఇంతవరకు ఎన్ని వ్యాక్సిన్‌

డోసులకు ఆర్డరిచ్చారు?

తేదీలతో సహా వివరాలన్నీ  మా ముందుంచండి

ఫైల్‌ నోటింగ్స్‌ సమర్పించండి

డిసెంబరు 31దాకా వ్యాక్సిన్ల అందుబాటుపై

రోడ్‌మ్యాప్‌ సమర్పించండి

కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం

విచారణ 30కి వాయిదా


కార్యనిర్వాహక విధానం వల్ల పౌరుల రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే కోర్టులు మౌన ప్రేక్షకుల్లా కూర్చోవాలని రాజ్యాంగం చెప్పలేదు.


18-44 ఏళ్ల వయస్కులు టీకాలు కొనుగోలు చేసి వేయించుకోవాలన్న కేంద్ర వైఖరి వివక్షాపూరితం. ఆ వయసు వారికి కూడా కొవిడ్‌ సోకుతోంది. చికిత్స కోసం వారు చాలా కాలం ఆస్పత్రుల్లో ఉండాల్సి వస్తోంది. కొందరైతే చనిపోతున్నారు కూడా.


44 ఏళ్లలోపువారు రికార్డు ధరలకు వ్యాక్సిన్లు కొంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. చాలా దేశాల్లో ప్రభుత్వాలే వ్యాక్సిన్లు కొని ఉచితంగా వేస్తున్నాయి. 

సుప్రీంకోర్టు


న్యూఢిల్లీ, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ విధానాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. 45 ఏళ్లకుపైబడినవారికి ఉచితంగా టీకా వేస్తామని.. 18-44 ఏళ్లలోపు వారు కొనుక్కొని వేయించుకోవాలనడం వివక్షతో కూడుకున్నదని.. హేతుబద్ధత లేని విధానమని ఘాటుగా ఆక్షేపించింది. కొవిడ్‌ నిర్వహణ తీరు, వ్యాక్సినేషన్‌పై జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ రవీంద్ర భట్‌తో కూడిన ప్రత్యేక ధర్మాసనం సుమోటోగా విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. సోమవారం విస్తృత స్థాయిలో జరిపిన విచారణ అనంతరం.. దానికి సంబంధించిన ఆదేశాలను బుధవారం కోర్టు వెబ్‌సైట్‌లో ఉంచారు. వ్యాక్సినేషన్‌లో వయోభేదాలు చూపడాన్ని ధర్మాసనం విమర్శించింది. తన విధానాన్ని సమీక్షించాలని కేంద్రానికి సూచించింది. డిసెంబరు 31 వరకు వ్యాక్సిన్ల అందుబాటుపై రోడ్‌మ్యాప్‌ సమర్పించాలని ఆదేశించింది. 18-44 ఏళ్ల వయస్కులకు ఉచితంగా వ్యాక్సిన్‌ వేయించాలని నిర్ణయం తీసుకున్నదీ లేనిదీ తెలియజేయాలని రాష్ట్రప్రభుత్వాలను కూడా ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. కార్యనిర్వాహక నిర్ణయాల్లో కోర్టు జోక్యం చేసుకోరాదని కేంద్రం చేసిన వాదనను తోసిపుచ్చింది. పౌరుల రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే కోర్టులు మౌన ప్రేక్షకుల్లా కూర్చోవాలని మన రాజ్యాంగం చెప్పలేదని తేల్చిచెప్పింది.


కేంద్ర బడ్జెట్‌లో వ్యాక్సిన్ల సేకరణకు రూ.35వేల కోట్లు కేటాయించారని.. అందులో ఇంతవరకు ఎంత ఖర్చుచేశారో చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది. ఆ మొత్తంతో 18-44 ఏళ్ల వయస్కులకు ఎందుకు వ్యాక్సిన్లు కొనలేరని ప్రశ్నించింది. వ్యాక్సిన్‌పై పోటీ ధరల విధానాన్ని కేంద్రం సమర్థించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ప్రైవేటు ఉత్పత్తిదారులకు ప్రోత్సాహకాలు కల్పించేందుకు ఈ విధానాన్ని అవలంబించినట్లు చెప్పడంపై ప్రశ్నలు గుప్పించింది. ముందుగా నిర్ణయించిన ధరలపై సంప్రదింపులు జరిపేందుకు కేవలం ఇద్దరే ఉత్పత్తిదారులు ఉండగా.. ఈ సమర్థన ఎలా హేతుబద్ధమవుతుందని ప్రశ్నించింది. అత్యధిక కొనుగోలు ఆర్డర్లను ఇస్తున్నందువల్ల తాము తక్కువ ధరలకు కొనుగోలు చేయగలుగుతున్నామని కేంద్రం చె బుతోందని.. అలాంటప్పుడు మొత్తం ఆర్డర్లు ఇదే పద్ధతిలో ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించింది. రాష్ట్రాలు ఇప్పటికే ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాయని.. ఈ విధానం వాటిపై తీవ్ర భారం మోపుతుందని పేర్కొంది.


కేంద్ర ప్రభుత్వం ఏకైక గుత్త కొనుగోలుదారుగా తన అధికారాన్ని ఉపయోగించి దేశంలో ప్రజలందరికీ ఆ ప్రయోజనాలను అందించేలా చూడాలని స్పష్టం చేసింది. వ్యాక్సిన్ల అభివృద్ధి, పంపిణీలో కేంద్రం, ప్రైవేటు ఉత్పత్తిదారుల కృషిని ధర్మాసనం అభినందించింది. అయితే వ్యాక్సిన్‌ ఉత్పత్తి పెంపు, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రైవేటు ఆస్పత్రులకు వేర్వేరు ధరలు ఎందుకు, ఎలా నిర్ణయించారో తెలుసుకోగోరుతున్నామని తెలిపింది. ‘‘దేశ జనాభాలో ఇప్పటివరకు ఎంత మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు.. ఒక డోసు, రెండు డోసులు వేయించుకున్నవారు ఎందరో వారి డేటా మాకు సమర్పించండి. ఈ ఏడాది చివరికల్లా అర్హులైనవారందరికీ వ్యాక్సిన్‌ వేస్తామని కేంద్రం చెప్పింది. మిగతా జనాభాకు ఏయే దశల్లో టీకా ఇస్తారో రోడ్‌మ్యాప్‌ మాకు అందించండి’’ అని నిర్దేశించింది.


ఈ మహమ్మారి ఎప్పటికప్పుడు తీరు మార్చుకుంటోందని.. పరిస్థితులు చూస్తుంటే 18-44 ఏళ్ల వయస్కులకూ వ్యాక్సిన్‌ ఇవ్వడం తప్పనిసరిగా మారిందని వ్యాఖ్యానించింది. ‘‘50 శాతం వ్యాక్సిన్లను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు.. కేంద్రం కంటే ఎక్కువ ధరకు ఉత్పత్తిదారుల నుంచి కొనాల్సిన పరిస్థితి. ప్రైవేటు ఆస్పత్రులు ఇంకా అధిక ధర చెల్లించాల్సి వస్తోంది. ఇందులో సహేతుకత లేదు. పూర్తి వివక్షాపూరితం. చికిత్స అనంతరం ఏర్పడుతున్న రుగ్మతలను నిరోధించడానికి అవసరమైన మందుల సరఫరాకు తీసుకుంటున్న చర్యల వివరాలను మాకు తెలియజేయండి’ అని ధర్మాసనం పేర్కొంది. 


కేజ్రీ సర్కారుపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ, జూన్‌ 2: కరోనా వ్యాక్సిన్‌ కొవాగ్జిన్‌ తొలి డోసు తీసుకున్న ఆరు వారాల్లోపు రెండో డోసు ఇవ్వగలరా అని ఢిల్లీలోని అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. అలా ఇవ్వలేనప్పుడు ఆర్భాటంగా వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఎందుకు ఏర్పాటుచేశారని ఆగ్రహం వ్యక్తంచేసింది.


టీకా వద్దంటే.. జీతం రాదు!

ఫిరోజాబాద్‌ కలెక్టర్‌ ఆదేశం


ప్రభుత్వ ఉద్యోగుల్లో కరోనా టీకాపై ఉన్న భయాన్ని పోగొట్టి.. వారికి వ్యాక్సినేషన్‌ చేయాలనే ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్‌లోని ఓ జిల్లా యంత్రాంగం వినూత్నమైన నిర్ణయం తీసుకొంది. టీకా వేయించుకోవడానికి విముఖత వ్యక్తం చేసే ప్రభుత్వ ఉద్యోగులకు మే నెల జీతం నిలిపివేయాలంటూ ఫిరోజాబాద్‌ కలెక్టర్‌ చంద్ర విజయ్‌ సింగ్‌ ఆదేశాలు జారీ చేశారు. జీతం రాదనే భయంతోనైనా ఉద్యోగులు టీకా వేయించుకొంటారని ఆశిస్తున్నామని జిల్లా ముఖ్య అభివృద్ధి అధికారి చర్చిత్‌ గౌర్‌ అన్నారు.


75% వయోజనులు వ్యాక్సిన్‌ తీసుకుంటే కరోనా అదుపు

వయోజనుల్లో 75% మందికి వ్యాక్సిన్‌ రెండు డోసులు వేస్తే కరోనాను అదుపులో పెట్టొచ్చు. బ్రెజిల్‌ శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. 50 వేల జనాభా కలిగిన సెర్రనా పట్టణంలో జరిపిన పరిశోధన ప్రకారం.. 18 ఏళ్లకు పైబడిన వారిలో 95% మంది వ్యాక్సిన్‌ తీసుకుంటే కొవిడ్‌ మృతుల్లోనూ 95% తగ్గుదల కనిపించింది. ఆస్పత్రిలో చేరే వారు 86% తగ్గారు. కరోనా కేసులు కూడా 80% తగ్గుదల నమోదైంది. విశేషమేమిటంటే వ్యాక్సిన్‌ వేసుకోకున్నా 20 ఏళ్లలోపు యువతలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. అంటే 18 ఏళ్లకు పైబడిన వారంతా వ్యాక్సిన్‌ వేసుకుంటే స్కూలుకు వెళ్లే చిన్నారులకు వ్యాక్సిన్‌ వేయకున్నా సురక్షితమే.

Updated Date - 2021-06-03T08:58:10+05:30 IST