మారటోరియం అంటూ వడ్డీ వసూలా?

ABN , First Publish Date - 2020-06-05T07:01:35+05:30 IST

బ్యాంకు రుణ వాయిదాలపై మారటోరియం విధించిన కాలానికి వడ్డీని మాఫీ చేసే అవకాశాలపై సుప్రీంకోర్టు ఆర్థిక శాఖ అభిప్రాయాన్ని కోరింది. మారటోరియం కాలానికి వడ్డీ మాఫీ లేదా వడ్డీపై వడ్డీ మాఫీ అనే రెండు అంశాలు తమ పరిశీలనకు వచ్చినట్లు తెలిపింది...

మారటోరియం అంటూ వడ్డీ వసూలా?

  • రిజర్వు బ్యాంకుపై సుప్రీం ఆగ్రహం
  • వడ్డీ మాఫీపై మీ వైఖరేంటి?
  • ఆర్థిక శాఖ వివరణకు ఆదేశం
  • వడ్డీ మాఫీ విలువ 2 లక్షల కోట్లు
  • బలవంతపు మాఫీతో ముప్పే
  • సుప్రీం కోర్టులో ఆర్బీఐ అఫిడవిట్‌ 


న్యూఢిల్లీ, జూన్‌ 4: బ్యాంకు రుణ వాయిదాలపై మారటోరియం విధించిన కాలానికి వడ్డీని మాఫీ చేసే అవకాశాలపై సుప్రీంకోర్టు ఆర్థిక శాఖ అభిప్రాయాన్ని కోరింది. మారటోరియం కాలానికి వడ్డీ మాఫీ లేదా వడ్డీపై వడ్డీ మాఫీ అనే రెండు అంశాలు తమ పరిశీలనకు వచ్చినట్లు తెలిపింది. ఒక పక్క మారటోరియం  ప్రకటించి, వడ్డీ వసూలు చేయడం తీవ్రమైన విషయమని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. మార్చి 27న ఆర్‌బీఐ ప్రకటించిన మారటోరియంలో రుణ మొత్తంపై వడ్డీని వసూలు చేయడం మారటోరియానికేవిరుద్ధమని పిటిషనర్‌ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు సూచించిన వడ్డీ మాఫీ/వడ్డీపై వడ్డీ మాఫీ అంశాలను ఆర్థిక శాఖ దృష్టికి తీసుకువెళ్తామని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు తెలిపారు. 12వ తేదీ కల్లా ఆర్థిక శాఖ అభిప్రాయంతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అత్యున్నత న్యాయస్థానంలో కేసు విచారణలో ఉండగా, వడ్డీ మాఫీకి వ్యతిరేకమంటూ రిజర్వు బ్యాంకు మీడియా ద్వారా లీకులు ఇవ్వడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పద్ధతులు పునరావృతం కానివ్వొద్దని హెచ్చరించింది. బలవంతంగా వడ్డీలను మాఫీ చేయించడం సరికాదని, బ్యాంకుల మనుగడ ప్రమాదంలో పడుతుందని రిజర్వు బ్యాంకు అఫిడవిట్‌లో పేర్కొంది. వడ్డీ మాఫీ భారం రూ.2.1 లక్షల కోట్లు ఉంటుందని వెల్లడించింది. 


కేసులు భారీగా పెరగబోతున్నాయి: కేంద్రం

కరోనా కేసులు భారీగా పెరగబోతున్నాయని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఎదుట అంగీకరించింది. భవిష్యత్తులో కొవిడ్‌ రోగులకు చికిత్స అందించడానికి తాత్కాలిక ఆసుపత్రులను ఏర్పాటు చేయాల్సి వస్తుందని అఫిడవిట్‌లో పేర్కొంది. అదే సమయంలో డాక్టర్లకు, హెల్త్‌ వర్కర్లను మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేయరాదని విజ్ఞప్తి చేసింది. కరోనా విపత్తు ఎన్నడూ ఊహించని పరిణామమని, సార్వత్రిక నిర్వహణ నియమాలేవీ ఉండబోవని చెప్పింది. నిపుణులు సేకరించిన సమాచారాన్ని విశ్లేషించుకొని, నిర్వహణ నియమాలను నిరంతరం అప్‌డేట్‌ చేసుకుంటూ ఉండాలని తెలిపింది. వైద్య సిబ్బంది రక్షణ విషయంలో ఏ మాత్రం రాజీ పడటం లేదని, 99 లక్షల పీపీఈ కిట్లు సరఫరా చేశామని వెల్లడించింది.  



వేతనాలివ్వని కంపెనీలపై 12 వరకు చర్యలొద్దు!

కంపెనీలు, కార్మికులు కూర్చొని చర్చించుకోవాలి

సుప్రీంకోర్టు స్పష్టీకరణ


లాక్‌డౌన్‌ సమయంలో పూర్తి వేతనాలు చెల్లించలేని కంపెనీలకు, యజమానులకు వ్యతిరేకంగా జూన్‌ 12 వరకు ఎలాంటి చర్యలు తీసుకోరాదని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. లాక్‌డౌన్‌ సమయంలో మూసివేతకు గురైన పరిశ్రమలు పూర్తి వేతనాలు చెల్లించాలని మార్చి 29న కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ కొన్ని కంపెనీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ పిటిషన్‌పై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ జరిపింది. వంద శాతం జీతాలు చెల్లించని యజమానులపై చర్యలుంటాయని హోంశాఖ ఉత్తర్వుల్లో పేర్కొనడంపై న్యాయమూర్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఈ ఆదేశాల మీద మాకు అభ్యంతరాలు ఉన్నాయి. యాజమాన్యాలు, కార్మికులు చర్చలతో దీన్ని పరిష్కరించుకోవాలి. ఉద్యోగుల వేతనాలను కాపాడుతూనే పరిశ్రమ మనుగడను దృష్టిలో పెట్టుకోవాలి’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కార్మికులు సొంత రాష్ట్రాలకు వలస పోతున్న నేపథ్యంలో వారికి భరోసా కల్పించడానికి ఈ ఉత్తర్వులు ఇచ్చినట్లు అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ తెలిపారు. మూడు రోజుల్లో ఇరు పక్షాలు తమ వాదననను లిఖితపూర్వకంగా సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. మార్చి 29 నాటి ఉత్తర్వు చట్టబద్ధతపై లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని అటార్నీ జనరల్‌ను కోరింది. జీతాలు చెల్లించలేని కంపెనీలు ఆడిట్‌ చేసిన బ్యాలెన్స్‌ షీట్లను, ఖాతా పూస్తకాలను సమర్పించాలని ఆదేశించాలని కేంద్రం కోరింది. 

Updated Date - 2020-06-05T07:01:35+05:30 IST