నకిలీ విత్తనాలపై నిఘా

ABN , First Publish Date - 2022-06-04T06:18:33+05:30 IST

వానాకాలం పంటల సాగు సీజన్‌ ప్రార ంభమైంది. వర్షాలు సైతం కురుస్తుండడంతో జిల్లా రైతులు పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా మార్కెట్‌లలో ఆయా పంటల విత్తనాలను రైతులు కొనుగోలు చేస్తున్నారు.

నకిలీ విత్తనాలపై నిఘా
జుక్కల్‌లో ఫర్టిలైజర్స్‌ దుకాణంలో తనిఖీలు చేపడుతున్న అధికారులు

- జిల్లాలో టాస్క్‌ఫోర్స్‌ నియామకం

- వ్యవసాయ, పోలీసుశాఖల అధికారులతో బృందం

- విత్తన దుకాణాల్లో విస్తృత తనిఖీలు

- గుట్టుచప్పుడు కాకుండా నకిలీ పత్తి, సోయా, మొక్కజొన్న విత్తనాల విక్రయాలు

- గ్రామాల్లో మాటు వేసిన ప్రైవేట్‌ విత్తన కంపెనీలు

- పేరున్న బ్రాండ్లతో నాసి రకం విత్తనాల అమ్మకాలు

- దుకాణాల్లో అనుమతి లేని వెరైటీల విక్రయాలు


కామారెడ్డి, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): వానాకాలం పంటల సాగు సీజన్‌ ప్రార ంభమైంది. వర్షాలు సైతం కురుస్తుండడంతో జిల్లా రైతులు పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా మార్కెట్‌లలో ఆయా పంటల విత్తనాలను రైతులు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై ఎలాంటి విత్తనాలను అందించకపోవడంతో రైతులు ప్రైవేట్‌ దుకాణాలను, కంపెనీలను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేట్‌ కంపెనీల విత్తనాలతో రైతులు మోసపోయే అవకాశం ఉన్నందున నకిలీ విత్తనాల సరఫరాపై ప్రభుత్వం నిఘా పెట్టింది. నకిలీ విత్తనాలను విక్రయించే ప్రైవేట్‌ దుకాణాలు, డీలర్లు, కంపెనీలపై కొరడా ఝులిపించనుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాలను నియమించింది. జిల్లా కేంద్రాలతో పాటు పట్టణాల్లో, మండల కేంద్రాల్లో ఆయా గ్రామాల్లోని విత్తన దుకాణాలపై టాస్క్‌ఫోర్స్‌ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. పత్త్తి, సోయా, మొక్కజొన్న విత్తనాలకు చెందిన ఆయా కంపెనీలు నకిలీవి మార్కెట్‌లోకి తీసుకురావడంతో రైతులు మోసపోవడమే కాకుండా తీవ్రంగా నష్టపోనున్నారు. ఈ నేపథ్యంలో నకిలీలపై జిల్లా యంత్రాంగం నిఘా ఉంచింది.

రైతులకు నకిలీ విత్తనాల పరేషాన్‌

జిల్లాలో నకిలీ పత్తి, సోయా, మొక్కజొన్న విత్తనాలు రైతులను పరేషాన్‌ చేస్తున్నాయి. మార్కెట్‌లో ఉన్న ఈ విత్తనాలు అసలివా, నకిలీవా తెలియని పరిస్థితి నెలకొంది. విత్తనాలు మొలకెత్తి పూత కాసేదాకా నకిలీ విత్తనం తెలియకపోవడంతో పంటచేతికి వచ్చే సమయంలో పూత, కాత రాక రైతులు నట్టేట మునుగుతున్నారు. ప్రతీ ఏటా జిల్లాలో ఏదో ఒకచోట సోయా విత్తనాలు మొలకెత్తకపోవడం, పత్తి మొలకెత్తినా పూత రాకపోవడం, మొక్కజొన్న కంకుల స్థాయికి వచ్చినా గింజలు రాక దిగుబడులు రానటువంటి సంఘటనలు వెలుగు చూశాయి. గతంలో జిల్లాలో పెద్దఎత్తున నకిలీ విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రతిఏటా పంటలు సాగు చేసిన నకిలీ విత్తనాలతో దిగుబడులు రాక మొలకెత్తక రైతులు తీవ్రంగా నష్టపోయారు.

బీటీ 3 పేరుతో మోసం 

ప్రభుత్వం మొక్కజొన్న, సోయా పంటలకు ప్రత్యామ్నాయంగా పత్తిపంటను సాగు చేయాలని రైతులు ఆ దిశగా దృష్టిపెట్టాలంటూ ప్రభుత్వంతో పాటు వ్యవసాయాధికారులు అవగాహన కల్పిస్తున్నారు. అయితే గత ఏడాది జిల్లాలో సోయా విస్తీర్ణాన్ని తగ్గించి పత్తిసాగుకు వ్యవసాయశాఖ ప్రాధాన్యత ఇచ్చింది. ఈ సీజన్‌లో సుమారు 60వేల ఎకరాలలో పత్తిసాగుచేసే విధంగా ప్రణాళిక రూపొందించారు. అయితే పత్తి రైతుకు సాగులో నిరంతరం ఎదురయ్యే సమస్యలకు విరుగుడుగా విత్తనాల తయారీ అంటూ అక్రమ వ్యాపారులు నకిలీ విత్తనాల సరఫరాకు దిగుతున్నారు. విదేశాల్లో, పక్క రాష్ట్రాల్లో మంచి ఫలితాలను ఇచ్చాయని మాయమాటలు చెబుతూ రైతులను మోసం చేస్తున్నారు. ఆంధ్ర, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి అక్రమంగా తీసుకువస్తున్న ఈ విత్తనాలను రైతులకు అంటగడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విత్తనం గులాబి రంగు పురుగును తట్టుకుంటుందని నమ్మి కొంతమంది రైతులు సాగుచేసి తీవ్రంగా నష్టపోతున్నారు. మరోవైపు గడ్డిమందును తట్టుకునే రకం అంటూ హెచ్‌టీ కాటన్‌ విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. బీటీ 3 పత్తి విత్తనాలు పర్యావరణానికి హాని కల్గిస్తోందని ప్రభుత్వం దీనికి అనుమతి ఇవ్వలేదు. ఈ పత్తి విత్తనాల ఉత్పత్తి కూడా లేదు. కానీ కొన్ని విత్తన కంపెనీలు లోకల్‌ బ్రాండ్ల పేరిట,బీటీ 3 విత్తనాలను మార్కెట్‌లోకి గుట్టుచప్పుడుకాకుండా తీసుకువచ్చి రైతులకు విక్రయిస్తున్నారు. రైతులు గుడ్డిగా మాయగాళ్ల మాటలను నమ్మి నకిలీ విత్తనాలను కొనుగోలు చేస్తూ పంట సాగయ్యాక దిగుబడి రాకమోసపోతున్నారు.

గ్రామాల్లో మాటువేసిన కంపెనీలు

గ్రామాలో ఓ వైపు సాగు సందడి మొదలైంది. మరోవైపు నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టేందుకు మోసగాళ్లు వివిధ కంపెనీల పేరిట గ్రామాల్లో మాటు వేశారు. జిల్లాలో పత్తి, సోయా, మొక్కజొన్న పంటలను రైతులు విస్తృతంగా సాగు చేస్తుంటారు. దీనిని ఆసరాగా చేసుకుంటున్న మాయగాళ్లు రైతులకు మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకుని నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దాడులు చేస్తున్నా నకిలీ విత్తనాల మాఫియా కొందరు విక్రయదారులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా నకిలీ విత్తనాల విక్రయాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విత్తనాల దుకాణాల్లో అనుమతి లేని చాలా వెరైటీలను దొంగచాటున విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం. 

టాస్క్‌ఫోర్స్‌ అధికారుల తనిఖీలు

జిల్లాలో పలు విత్తనాల దుకాణాల్లో నకిలీ విత్తనాలను విక్రయించే అవకాశాలు ఉండడంతో అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. వానాకాలం సీజన్‌ ప్రారంభం కావడం రైతులు పంటల సాగు కోసం విత్తనాలను కొనుగోలు చేస్తూ సిద్ధంగా ఉంచుకుంటున్నారు. అయితే నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై పీడీ యాక్ట్‌ కేసు నమోదు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. అదేవిధంగా నకిలీ విత్తనాలపై నిఘా పెట్టేందుకు తనిఖీలు చేసేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించింది. దీంతో వ్యవసాయశాఖ అధికారులతో పాటు పోలీసులు కలిసి జిల్లా, మండల, గ్రామస్థాయి టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టారు.

Updated Date - 2022-06-04T06:18:33+05:30 IST