ఆర్టీసీలో రాయితీలపై సర్వే

ABN , First Publish Date - 2022-01-24T05:54:15+05:30 IST

బస్సుల్లో ప్రయాణికుల ఓఆర్‌ (ఆక్యుపెన్సీ రేషియో) శాతాన్ని పెంచడమే లక్ష్యంగా కొత్త రాయితీ పథకాల అమలుకు అభిప్రాయ సేకరణ పేరిట ఆర్టీసీ సర్వే ప్రారంభించింది.

ఆర్టీసీలో రాయితీలపై సర్వే
అభిప్రాయాలు సేకరిస్తున్న ఉద్యోగి

పథకాల పునరుద్ధరణకు సర్వే ప్రారంభం 

14 అంశాలతో ప్రశ్నావళి

ఆసరా లబ్ధిదారుల నుంచే అభిప్రాయ సేకరణ

ఈ నెల 27 లోగా సర్వే పూర్తికి మార్గదర్శకాలు 

 

నార్కట్‌పల్లి, జనవరి 23: బస్సుల్లో ప్రయాణికుల ఓఆర్‌ (ఆక్యుపెన్సీ రేషియో) శాతాన్ని పెంచడమే లక్ష్యంగా కొత్త రాయితీ పథకాల అమలుకు అభిప్రాయ సేకరణ పేరిట ఆర్టీసీ సర్వే ప్రారంభించింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీగా, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సజ్జనార్‌ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి సంస్థ పురోభివృద్ధే ధ్యే యంగా వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఆయన స్వయంగా ఆర్టీసీ బస్సుల్లో సాధారణ ప్రయాణికుడిలా వెళుతూ, బస్సులు, రోడ్ల పరిస్థితి, ట్రాఫిక్‌, ఉద్యోగు ల విధి నిర్వహణ, ప్రయాణికుల నుంచి స్పందనను ప్రత్యక్షంగా గమనిస్తున్నారు. ప్రతీ గురువారం బస్‌డేను పాటిస్తూ డీఎంలను బస్సుల్లో ఊర్ల బాట పట్టిస్తున్నారు. సంస్థ సేవలపై ప్రజల్లో మరింత విశ్వాసం, ఆసక్తి పెంచేలా ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. జనవరి 1వ తేదీన 12 సంవత్సరాలలోపు పిల్లలకు ఉచిత ప్రయాణా న్ని ప్రవేశపెట్టి తల్లిదండ్రులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వినూత్న పథకాన్ని తీసుకొచ్చారు. తద్వారా బస్సుల్లో ఓఆర్‌ శాతాన్ని పెంచాలని సంకల్పించారు. ఇందులో భాగంగా నే రాష్ట్రంలో ఆసరా పథకం కింద పెన్షన్ల లబ్ధిదారుల ప్రయాణ అవసరాల పేరిట తాజా గా మరో సర్వేకు శ్రీకారం చుట్టారు. కొవిడ్‌ నేపథ్యంలో రద్దయిన అన్ని రకాల రాయితీ పథకాల స్థానంలో అవే తరహాలో కొత్త ఆకర్షణీయ పథకాల పునరుద్దరణ, రూపకల్పనకు ప్రజల నుంచే అభిప్రాయం తెలుసుకునేలా ఈ సర్వే ఉపకరిస్తుందని భావించారు. సంపన్న వర్గాలు ఎటూ సొంత వాహనాల్లో ప్రయాణిస్తుండగా పేద, మధ్య తరగతి వర్గా లు మాత్రమే ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకుంటున్నారు. 


అభిప్రాయ సేకరణ ఇలా.. 

పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ఆసరా పెన్షన్‌ లబ్ధిదారుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. ఇందులో భాగంగా వృద్ధాప్య, వితంతు, ఒంటరి, చేనేత, కల్లుగీత, బీడి కార్మికులు, కళాకారులు, అంగన్‌వాడీ, ఆశా వర్కర్లనుంచి అభిప్రాయ సేకరణ కు ప్రశ్నావళిని రూపొందించారు. వీటిలో సంక్షేమ పథకం పేరు, లబ్ధిదారుని పేరు, పథ కం గుర్తింపు సంఖ్య, ఆధార్‌ సంఖ్య, వయస్సు, లింగం, వృత్తి, చిరునామా, లబ్ధిదారుని కుటుంబ సభ్యుల సంఖ్య, ప్రయాణ అవసరం (రోజు/వారం/పక్షం/నెలకోసారి/ఎప్పుడై నా) ప్రయాణ అవసరాలు (రూటు) ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మొత్తం కి.మీలు, ప్రయాణ సాధనం (ద్విచక్రవాహనం, బస్సు/ఆటో/జీపు/రైలు) వంటి అంశాలపై సర్వే చేస్తున్నారు. అదేవిధంగా మీ ఊరికి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉందా? లేదా? ఆర్టీసీ రాయి తీ కార్డు ఇస్తే వినియోగించుకుంటారా? లేదా? అనే 14 అంశాలకు సంబంధించిన ప్రశ్నావళితో సర్వే చేస్తున్నారు. సంస్థ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 20వ తేదీ నుంచి ప్రారంభమైన అభిప్రాయ సేకరణ ఈనెల 27వరకు కొనసాగనుంది. డిపో పరిధి స్థాయిని బట్టి ప్రతీ డిపో పరిధిలో కనీసం 200 సర్వే ఫాంలకు తగ్గకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్న లబ్ధిదారులను కలిసి సర్వేచేసి వాటిని సమర్పించేలా సిబ్బందికి విధులు కేటాయించారు. డిపోవారీగా క్రోడీకరించిన సర్వే నివేది క ఆధారంగా ఆర్టీసీలో కొత్త ఆకర్షణీయ రాయితీ పథకాలు ప్రవేశపెట్టేందుకు సంస్థ ఎండీ సజ్జనార్‌ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2022-01-24T05:54:15+05:30 IST