Abn logo
Jun 13 2021 @ 16:53PM

కోవిడ్ వేళ మనోస్థైర్యాన్ని పెంచుతోన్న స్వామి శితికంఠానంద మాటలు

హైదరాబాద్: కోవిడ్ వేళ అయినవాళ్లను, ఆప్తులను కోల్పోతున్నవారు తీవ్ర దుఃఖానికి లోనవుతున్నారు. కళ్లముందే కానరానిలోకాలకు పయనమవుతుంటే గతించిన వారిని తలచుకుని తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో రామకృష్ణమఠం స్వామిజీ స్వామి శితికంఠానంద మహారాజ్ మనోస్థైర్యాన్ని పెంచే మాటలు చెప్పారు. మరణించిన వ్యక్తులను మర్చిపోలేక మదనపడుతున్న ఆయా కుటుంబాలకు, స్నేహితులకు ఉపశమనం కల్పించడమేకాకుండా.. వారిలో నూతన ఆశావహ దృక్పథాన్ని కల్పించారు. 


స్వామి శితికంఠానంద మాటల్లోనే.. ‘‘అతి క్లిష్టపరిస్థితుల్లోనూ శ్రీరాముడు చిత్త ప్రశాంతతను వదిలిపెట్టలేదు. అడవికి వెళ్లవలసి వచ్చినా.. స్థితప్రజ్ఞత ప్రదర్శించాడు. కైకేయిని భరతుడు దూషిస్తుంటే.. అది కూడదని వారించాడు. కైకేయితో సహా అందరూ విధి చేతిలో కీలుబొమ్మలని చెబుతాడు. ఏదైనా జరిగితే దానికి కారణం మనమో... లేదా ఇతరులో కాదు. విధి అనే అంశం ఒకటి ఉంటుంది. గొప్ప మార్పులు రావాలంటే ముందుగా తీవ్ర దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది. ఏదో మహాత్కార్యానికి ఇది సూచికగా భావించాలి. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు కూడా అలాంటివే. అంతా దైవేచ్ఛ.. విధి లిఖితం’’ అనుకోవాలి.


పాత వస్త్రాలను వదిలి... మనం కొత్త వస్త్రాలను ఎలా ధరిస్తామో.. అలానే ఆత్మ పాత శరీరాన్ని వదిలి.. కొత్త శరీరాన్ని స్వీకరిస్తోందని గీతలో ఉందని స్వామి శితికంఠానంద తెలిపారు. గతించినవారి కోసం చింతించడం అవివేకమని, నీటి బుడగలను పోలిన శరీరాల కోసం ఇంత ఆరాటం ఎందుకన్నారు. శరీర క్షణభంగురత్వమనే సత్యాన్ని.. మహోన్నత రహస్యాలను మన రుషులు ఆవిష్కరించి ఇచ్చారన్నారు. శరీరం నశ్వరము... నశించునదని తెలియజేశారు.  లౌకికవాద పుణ్యాన జీవితం గురించి లోతుగా తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. గీత, రామాయణ, భాగవతం పఠనీయ గ్రంథాలుగా మన ఇళ్లలో లేవు. ఏ సమాజం అయితే ఆధ్యాత్మిక పురోభివృద్ధి సాధిస్తుందో ... ఆ దేశాన్ని సమాజాన్ని నాగరక సమాజంగా పేర్కొనవచ్చని వివేకానందుల వారన్న మాటలను ఉటంకించారు. పారమార్థిక జీవనాన్ని అవలంభించాలని సూచించారు. విద్యావ్యవస్థ కారణంగా పనికిరాని బోధనలే పాఠ్యాంశాలయ్యాయని స్వామి శితికంఠానంద అన్నారు. ధర్మస్పృహ లేని చదువు చదువే కాదన్నారు. ధర్మార్థకామమోక్షాలలో ధర్మం, మోక్షం పనికిరాకుండా పోయాయని.. అర్థం, కామం మధ్య జనం ఊగిసలాడుతున్నారని వాపోయారు. సంపద పెరుగుతుంటే రోగం, అశాంతి పెరిగాయన్న విషయాన్ని గ్రహించడం లేదన్నారు. జీవితాలు అగమ్యగోచరమైనప్పుడు మహమ్మారి రూపంలో జగన్మాత ప్రత్యక్షమవుతుందేమోనన్న విషయాన్ని తెలిపారు. ఇది ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది వాస్తవమేనని చాలా మంది యోగులు ధ్రువీకరించారన్నారు. 


ఇదిలా ఉంటే, అంతిమ క్షణాలతో.. మరణశయ్యపై ఆస్పత్రులలో ఉన్నవారికి కాస్త భగవదనుభూతిని కల్పించకపోవడం దురదృష్టకరమని  స్వామి శితికంఠానంద అన్నారు. పూర్వకాలంలో ఎవరైనా అవసానదశలో ఉంటే వారికి పుణ్యగతులు కల్పించడానికి దైవనామస్మరణ చేసేవారని... లౌకికవాద వ్యవస్థ కారణంగా... ప్రస్తుతం అది లేకుండా పోయిందన్నారు. ఐసీయూలో కాస్త లలితా సహస్రనామమో, విష్ణు సహస్ర నామమో వినిపిస్తే బాగుంటుందంటున్నారు. మరణం అంటే భయాన్ని విడనాడి.. నిర్భయులుగా జీవించాలని సూచించారు.