Advertisement
Advertisement
Abn logo
Advertisement

అప్పన్నకు వైభవంగా స్వర్ణ తులసీ దళార్చన

సింహాచలం, నవంబరు 30: సింహాద్రి అప్పన్న స్వామికి మంగళవారం వైభవంగా స్వర్ణ తులసీ దళార్చన నిర్వహించారు. ఆర్జిత సేవల్లో భాగంగా కార్తీకమాస కృష్ణపక్ష ఏకాదశిని పురస్కరించుకుని ప్రభాత సేవలు తర్వాత ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో కళ్యాణ మండపంలోని ప్రత్యేక వేదికపై అధిష్టింపజేశారు. ఇన్‌చార్జి ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో భక్తుల గోత్రనామాలతో పూజలు చేశారు. నృసింహ అష్టోత్తర శతనామావళిని పఠిస్తూ స్వామివారికి బంగారు తులసీ దళాలతో అర్చన చేశారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు వేదాశీర్వచనాలు, ప్రసాదాలను అందజేశారు.


ఆర్జిత సేవలకు విశేష ఆదరణ 

సింహాచలేశుని ఆర్జిత సేవలకు విశేష ఆదరణ లభించింది. ఇందులో భాగంగా మంగళవారం జరిగిన స్వర్ణ తులసీ దళార్చన, నిత్యకల్యాణం, గరుడసేవల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉదయం తొమ్మిదిన్నరకు జరిగిన నిత్య కళ్యాణంలో పలువురు భక్తులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొనగా, కళ్యాణాన్ని ఘనంగా జరిపారు. అనంతరం గోవిందరాజస్వామిని రజిత గరుడ వాహనంపై వుంచి భక్తుల గోత్రనామాలతో గరుడసేవ జరిపారు. 


అన్నప్రసాద పథకానికి రూ.2 లక్షల విరాళం

అప్పన్న స్వామి దేవస్థానంలో అమలు జరుగుతున్న నిత్యాన్న ప్రసాద పథకానికి ఇబ్రహీంపట్నానికి చెందిన దుప్పలపూడి శ్రీనివాసరావు రూ.లక్ష విరాళాన్ని డీడీ రూపంలో అందజేశారు. అలాగే విజయనగరానికి చెందిన ఎ.ఇందిరాంబ రూ.లక్షను చెక్కు రూపంలో అన్నప్రసాద విభాగం సిబ్బందికి అందజేశారు. 


Advertisement
Advertisement