ఉద్యోగుల మెడపై కత్తి!

ABN , First Publish Date - 2022-01-20T06:03:37+05:30 IST

కొత్త వేతన సవరణను బలవంతంగా ఉద్యోగులపై రుద్దాలని రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తోంది.

ఉద్యోగుల మెడపై కత్తి!

పీఆర్‌సీకి సమ్మతి తెలిపేలా ప్రభుత్వం ఎత్తుగడ

పది రోజులుగా ట్రెజరీ వెబ్‌సైట్‌ మూసివేత

వేతన సవరణపై జీవో విడుదలైన తరువాత అందుబాటులోకి వచ్చిన వెబ్‌సైట్‌

28లోగా కొత్త జీతం బిల్లులను అప్‌లోడ్‌ చేయాలని డీడీఓలకు ఆదేశం

అదే జరిగితే...కొత్త పీఆర్‌సీకి ఉద్యోగులు ఆమోదం తెలిపినట్టే

కొత్త జీవో వచ్చేంత వరకూ బిల్లు పెట్టొద్దంటున్న యూనియన్‌ నేతలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

కొత్త వేతన సవరణను బలవంతంగా ఉద్యోగులపై రుద్దాలని రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తోంది. ఇటీవల ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు వ్యక్తం చేస్తున్న అసంతృప్తిని పరిగణనలోకి తీసుకోవడం లేదు సరికదా...దాని ప్రకారమే జనవరి నెల జీతాలను అందించాలని మొండిపట్టుదలతో ముందుకువెళుతోంది. అందులో భాగంగానే పీఆర్‌సీపై జీవో జారీచేసేంత వరకూ ఉద్యోగుల జీతాల బిల్లులను అప్‌లోడ్‌ చేసే ట్రెజరీ వెబ్‌సైట్‌ను మరమ్మతు పేరుతో గత పది రోజులుగా నిలిపివేసింది. జీవో జారీ చేసిన అనంతరం ఉద్యోగులకు లింక్‌ ఆప్షన్‌ను ఇవ్వడంతోపాటు...దీనికి సంబంధించిన బిల్లులను వెంటనే అప్రూవ్‌ చేయాలని డ్రాయింగ్‌ ఆఫీసర్లు, ట్రెజరీలోని డీడీఓలను ఆదేశించింది.


సాధారణంగా ఉద్యోగుల జీతాలకు సంబంధించిన బిల్లులను ప్రతి నెలా 18 నుంచి 26 మధ్య ట్రెజరీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తుంటారు. ప్రతి ఉద్యోగి తన జీతం బిల్లును తయారుచేసి దానిని డ్రాయింగ్‌ ఆఫీసర్‌ ద్వారా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. అయితే జనవరి జీతం విషయానికి వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పీఆర్‌సీ ప్రకారం చెల్లించాలని నిర్ణయించింది. కొత్త పీఆర్‌సీ 2018 జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రావడంతో ప్రతి ఉద్యోగి అప్పటి నుంచి తాను తీసుకుంటున్న వేతనంతోపాటు కొత్త పీఆర్‌సీ ప్రకారం కలిగే ప్రయోజనాలతో కూడిన వివరాలను జత చేసి తమ డ్రాయింగ్‌ ఆఫీసర్‌లకు అందజేయాలి. డ్రాయింగ్‌ ఆఫీసర్లు తన పరిధిలోని ఉద్యోగుల జీతాల బిల్లులను తయారుచేసి, తిరిగి వారికి తెలియజేసి సమ్మతి తీసుకుంటారు. అనంతరం బిల్లులను ట్రెజరీలోని డీడీఓలకు అందజేస్తారు. అలాగే వేతన సవరణ జరిగినప్పుడు ప్రతి ఉద్యోగికి అప్పటివరకూ పొందుతున్న పాత జీతమే కొనసాగించాలా? లేక కొత్తగా సవరించిన ప్రకారం వేతనం తీసుకుంటారా? అనే ఆప్షన్‌ ఉంటుంది. ఉద్యోగి తన ఆప్షన్‌ తెలిపేంత వరకూ ట్రెజరీలో బిల్లు పెండింగ్‌లో ఉంటుంది. ప్రస్తుత పీఆర్‌సీ ప్రకారం జీతాలు గతంలో కంటే తగ్గిపోతున్నందున ఉద్యోగులు కొత్త జీతం తీసుకునేందుకు సమ్మతించరు. దీనిని గుర్తించిన ప్రభుత్వం ఉద్యోగులందరితోనూ జీతం బిల్లు అప్‌లోడ్‌ చేయించాలంటూ డ్రాయింగ్‌ అధికారులకు ఆదేశాలు జారీచేసింది. ఈ ప్రకియ్రను 28లోగా పూర్తిచేయాలని సూచించింది. ఒకవేళ అప్పటికీ జీతాల బిల్లును అప్‌లోడ్‌ చేయకపోతే జిల్లా ట్రెజరీ అధికారికి నిర్ణయం తీసుకునే హక్కు వుంటుందని ఉద్యోగులు చెబుతున్నారు. వేతన సవరణపై అసంతృప్తితో వున్న తమపై ఒత్తిడి తెచ్చి కొత్త జీతం బిల్లు పెట్టాలని బలవంతపెట్టడం సమంజసం కాదని ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంటున్నారు. ఒకవైపు పీఆర్‌సీపై పునరాలోచన చేయాలని ఒత్తిడి చేస్తున్నందున, సవరణ జీవో జారీ అయ్యేంత వరకూ జీతాల బిల్లులను డ్రాయింగ్‌ అధికారులకు ఇవ్వొద్దని ఉద్యోగులకు ఆయా సంఘాల నేతలు సూచిస్తున్నారు.


నేడే కలెక్టరేట్‌ ముట్టడి

ప్రతి పాఠశాల నుంచి ఉపాధ్యాయులు హాజరుకావాలని ఫ్యాప్టో చైర్మన్‌ పిలుపు

భీమునిపట్నం-రూరల్‌, జనవరి 19: పీఆర్‌సీపై ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ గురువారం నిర్వహించనున్న కలెక్టరేట్‌ ముట్టడికి జిల్లాలో ప్రతి పాఠశాల నుంచి ఉపాధ్యాయులు హాజరు కావాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) చైర్మన్‌ కృష్ణకుమార్‌ ఒక ప్రకటనలో కోరారు. పాఠశాలలు మూతపడకుండా పనిచేస్తున్న వారిలో సగం మంది ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. కలెక్టరు కార్యాలయానికి ఉదయం తొమ్మిది గంటలకు చేరుకోవాలన్నారు.  


ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మద్దతు

మహారాణిపేట, జనవరి 19: పీఆర్‌సీ జీవోలకు వ్యతిరేకంగా ఉపాధ్యాయ సంఘాలు ఈనెల 20 నుంచి చేపట్ట తలపెట్టిన ఆందోళనకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు జిల్లా అధ్యక్షుడు ఎస్‌.వి.రమణ, కార్యదర్శి రవిశంకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిరసనకు ఏపీ ఉద్యోగుల సంఘం మద్దతు ఇస్తోందని, ఆందోళనలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా పాల్గొని విజయవంతం చేయాలని వీరు  పిలుపునిచ్చారు.

Updated Date - 2022-01-20T06:03:37+05:30 IST