నల్గొండ : ‘ఠాగూర్‌’ తరహాలో డబ్బుల కోసం ఓ డాక్టర్‌ ప్లాన్‌!

ABN , First Publish Date - 2021-04-04T17:00:08+05:30 IST

ఠాగూర్‌ సినిమాలో అమాయక రోగులను ప్రైవేటు ఆస్పత్రి డాక్టర్లు ఎలా మోసం చేశారో, అదే తరహాలో

నల్గొండ : ‘ఠాగూర్‌’ తరహాలో డబ్బుల కోసం ఓ డాక్టర్‌ ప్లాన్‌!

  • సాధారణ కడుపునొప్పికి ఆపరేషన్‌ చేయాలని నాటకం
  • డీఎంహెచ్‌వో, పోలీసులకు బాధితుల ఫిర్యాదు

హైదరాబాద్/నల్గొండ/చౌటుప్పల్‌ రూరల్‌ : ఠాగూర్‌ సినిమాలో అమాయక రోగులను ప్రైవేటు ఆస్పత్రి డాక్టర్లు ఎలా మోసం చేశారో, అదే తరహాలో చౌటుప్పల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యురాలు రోగి నుంచి డబ్బులు కాజేయడానికి ప్లాన్‌వేసింది. డబ్బులకోసం సాధారణ కడపునొప్పితో వచ్చిన మహిళకు ఆపరేషన్‌ చేయాలని భయపెట్టింది. విషయం గ్రహించిన కుటుంబసభ్యులు సదరు ఆస్పత్రిపై పోలీసులు, డీఎంహెచ్‌ఓకు ఫిర్యాదు చేశారు. రోగి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. చౌటుప్పల్‌ మండలం సైదాబాద్‌ గ్రామానికి చెందిన శ్యామలపావని కడుపునొప్పితో బాధపడుతూ, గత నెల25న మండల కేంద్రంలోని మాధవరెడ్డి ఆస్పత్రికి వెళ్లింది. మాధవరెడ్డి ఆస్పత్రిని కొంత కాలంగా లావణ్య, రాజగోపాల్‌ అనే వైద్యులు లీజుకు తీసుకొని నడిపిస్తున్నారు. ఆస్పత్రిలో పావనికి స్కానింగ్‌ చేశారు.


అపెండిక్స్‌గా నిర్ధారించి ఆపరేషన్‌ చేయాలని డాక్టర్‌ లావణ్య సూచించారు. అందుకు రూ.40వేలు ఖర్చవుతుందని తెలిపారు. మూడు రోజుల్లో ఆపరేషన్‌ చేయాలని, లేదంటే పావని ప్రాణానికి ప్రమాదం ఉందని డాక్టర్‌ భయపెట్టారు. మూడు రోజుల కోసం మందులు రాశారు. మూడు రోజుల అనంతరం మళ్లీ కడుపునొప్పి రాగా పావని ఆస్పత్రికి వెళ్లింది. తక్షణమే ఆపరేషన్‌ చేయాలని, లేందటే తాము ఏమి చేయలేమని డాక్టర్లు మరింత భయపెట్టారు. దీంతో పావని కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. పావనికి సపర్యలు చేయడానికి తల్లి అందుబాటులో లేదు. దీంతో అదే రోజు తల్లి గారి గ్రామమైన హైదరాబాద్‌లోని బొడుప్పల్‌కు ఆమె వెళ్లింది. తల్లి పావనిని తీసుకొని అక్కడ ఓ ప్రైవేటు ఆస్పత్రికి ఆపరేషన్‌ కోసం వెళ్లింది. పావనిని పరీక్షించిన అక్కడి వైద్యులు అపెండిక్స్‌ సమస్య లేదని సాధారణ కడుపునొప్పిగా నిర్ధారించారు. ఆపరేషన్‌ అవసరం లేదని తెలిపారు.


చౌటుప్పల్‌ డాక్టర్‌ తమను మోసం చేసేందుకే అపెండిక్స్‌ నాటకం ఆడారని గ్రహించారు. తాము కూడా డాక్టర్‌కు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకొని పావనిని తీసుకొని కుటుంబసభ్యులు మాధవరెడ్డి ఆస్పత్రికి వెళ్లారు. పావనికి మళ్లీ కడుపునొప్పి వస్తుందని డాక్టర్‌కు తెలిపారు. ఆపరేషన్‌ ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, ఆమెకు చాలా ప్రమాదం ఉంది, ఇప్పటికే ఆలస్యం అయింది, ఆపరేషన్‌ తక్షణమే చేయాలని డాక్టర్లు మళ్లీ భయపెట్టారు. ఆపరేషన్‌కు సిద్ధమని పావని కుటుంబసభ్యులు తెలిపారు. పావనిని మళ్లీ వైద్య సిబ్బంది పరీక్షించారు. ఆపరేషన్‌కు డబ్బులు చెల్లించాలన్నారు. డాక్టర్లు ఆడుతున్న నాటకాన్ని గ్రహించిన కుటుంబసభ్యులు వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ కడుపునొప్పితో వస్తే ఆపరేషన్‌ ఎలా చేస్తారని ప్రశ్నించారు. హైదరాబాద్‌ ఆస్పత్రి రిపోర్టును చూపించారు. కంగుతిన్న ఆస్పత్రి వైద్యులు కాళ్లబేరానికి వచ్చారు. తమకు జరిగిన అన్యాయంపై బాధిత కుటుంబసభ్యులు స్థానిక పోలీ్‌సస్టేషన్‌, డీఎంహెచ్‌ఓకు ఫిర్యాదు చేశారు. ప్రజలను మోసం చేస్తున్న డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు.


ఆపరేషన్‌ కోసం ఒత్తిడి తేలేదు.. 

సైదాబాద్‌కు చెందిన పావని అనే మహిళ కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చింది. మందులు రాశాను. అపెండిక్స్‌ ఆపరేషన్‌ కోసం ఒత్తిడి తేలేదు. అపెండిక్స్‌ ఉండొచ్చు, సీటీ స్కాన్‌ చేస్తే తెలుస్తుంద ని చెప్పాను. కానీ, పావని భర్త బ్లాక్‌ మెయిల్‌ చేశాడు. అర్ధరాత్రి ఫోన్లు చేసి బెదిరిస్తున్నాడు.- డాక్టర్‌ లావణ్య.

Updated Date - 2021-04-04T17:00:08+05:30 IST