టైలర్‌ను దారుణంగా అంతం చేసి.. ఫ్రిడ్జిలో దాచి..

ABN , First Publish Date - 2021-04-02T17:49:12+05:30 IST

టైలర్‌ దారుణ..

టైలర్‌ను దారుణంగా అంతం చేసి.. ఫ్రిడ్జిలో దాచి..

టైలర్‌ దారుణ హత్య.. ఫ్రిడ్జిలో శవం..


బంజారాహిల్స్(హైదరాబాద్): టైలర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తి అతని ఇంట్లోకి చొరబడి కత్తితో కడుపులో పొడిచి చంపేశాడు. విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు మృతదేహాన్ని కర్టెన్‌లో చుట్టి బయటకు తరలించేందుకు ప్రయత్నించాడు. ఫ్రిడ్జిలో పెట్టేందుకు కూడా చూశాడు. కుదరకపోవడంతో అక్కడే వదిలేసి బయటి నుంచి తాళం వేసి పారిపోయాడు. జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో కలకలం సృష్టించిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కర్నాటక జిల్లా కొహిర్‌కు చెందిన మహ్మద్‌ సిద్దిఖ్‌ అహ్మద్‌ (45) కూకట్‌పల్లిలో టైలర్‌గా పనిచేస్తున్నాడు. యూసుఫ్‌గూడ సమీపంలోని కార్మికనగర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌ మొదటి అంతస్థులో భార్య ముబీనీ బేగం, కుమార్తె రుకీయా, కుమారుడు సుభాన్‌తో కలిసి ఉంటున్నాడు. మార్చి 28న భార్య పిల్లలను తీసుకొని శ్రీరాంనగర్‌లో ఉంటున్న పుట్టింటికి వెళ్లింది. సిద్దిఖ్‌ రోజూ విధులకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే సమయంలో అత్తింట్లో వెళ్లి భోజనం చేసేవాడు. 


బుధవారం రాత్రి కూడా అక్కడ భోజనం చేసి ద్విచక్ర వాహనంపై అపార్ట్‌మెంట్‌కు చేరుకొని ఫ్లాట్‌లోకి వెళ్లాడు. గురువారం ఉదయం అతని ఫ్లాట్‌కు బయటి నుంచి తాళం వేసి ఉండటంతో విధుల్లోకి వెళ్లాడని అందరూ అనుకున్నారు. సాయంత్రం సమయంలో సిద్దిఖ్‌ ఫ్లాట్‌లో నుంచి దుర్వాసన వస్తుండటంతో అపార్ట్‌మెంట్‌ యజమాని, స్థానికులతో కలిసి జూబ్లీహిల్స్‌ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఫ్లాట్‌ తెరిచి చూడగా వంట గదిలోని ఫ్రిడ్జి వద్ద సిద్దిఖ్‌ మృత దేహం పడి ఉంది. అతని కడుపులో కత్తితో పొడవటంతో పాటు తల మీద బలమైన వస్తువుతో బాదినట్లు ఆనవాళ్లు లభించాయి. సిద్దిఖ్‌ను చంపిన తర్వాత కర్టెన్‌లో పెట్టి తరలించేందుకు ప్రయత్నించాడు కానీ సాధ్యం కాలేదు. ఫ్రిడ్జిలో పెట్టేందుకు ప్రయత్నించాడు. అతనిది భారీ శరీరం కావడంతో కుదరలేదు. దీంతో మృతదేహాన్ని అక్కడే వదిలేసి బయటి నుంచి తాళం వేసి నిందితుడు పారిపోయాడు. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఏసీపీ సుదర్శన్‌, జూబ్లీహిల్స్‌ సీఐ రాజశేఖర్‌రెడ్డి క్లూస్‌ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. 


సీసీ కెమెరాలో నిందితుడి ఫుటేజీ

సిద్దిఖీ ఫ్లాట్‌కు వచ్చాక కొద్ది సేపటికి గుర్తు తెలియని వ్యక్తి వచ్చినట్టు సీసీ కెమెరాలో రికార్డు అయింది. గురువారం తెల్లవారుజాము 4 గంటల వరకు ఉన్న నిందితుడు ఫ్లాట్‌కు తాళం వేసి హతుడి ద్విచక్ర వాహనం వేసుకొని పారిపోయాడు. సీసీ కెమెరాలో నిందితుడు చిత్రం ద్వారా అతన్ని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సిద్దిఖ్‌కు రోజూ భార్యతో గొడవ జరిగేదని స్థానికులు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం ఆమె భర్తతో గొడవ పడ్డాక ఇళ్లు వదిలి వెళ్లిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముబీనా బేగంను ప్రశ్నిస్తున్నారు. సిద్దిఖ్‌ హత్యకు ఆస్తి తగాదాలు లేక వివాహేతర సంబంధాలా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. తెలిసిన వ్యక్తి హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. మృత దేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. 

Updated Date - 2021-04-02T17:49:12+05:30 IST