‘అడుగు’ నుంచి ఆరా..బోట్లన్నీ బయటకు తీయండి

ABN , First Publish Date - 2020-02-23T06:23:20+05:30 IST

గోదావరిలో విహారానికి బోట్లకు అనుమతులిచ్చే ప్రక్రియ ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. రాయల్‌ వశిష్ట ప్రమాదం తర్వాత

‘అడుగు’ నుంచి ఆరా..బోట్లన్నీ బయటకు తీయండి

జిల్లాలో ప్రైవేటు, ఏపీటీడీసీ బోట్లకు కాకినాడ పోర్టు ఆదేశాలు 

వీటన్నింటి అడుగుభాగాలు క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని నిర్ణయం 

తక్షణం నది, సముద్రంలోంచి   డ్రైడాక్‌ చేయాలని ఉత్తర్వులు

అడుగు నుంచి ఆరు అడుగుల మేర నాణ్యత, సామర్థ్యంపై నిశిత పరిశీలన

నెల రోజుల వరకు సాగనున్న ప్రక్రియ,  ఆ తర్వాతే ఫిట్‌నెస్‌ సర్టిఫిట్లు

గోదారొడ్డున కంట్రోల్‌రూమ్‌లు రెడీ


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-కాకినాడ)

గోదావరిలో విహారానికి బోట్లకు అనుమతులిచ్చే ప్రక్రియ ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. రాయల్‌ వశిష్ట ప్రమాదం తర్వాత ఎక్కడికక్కడ బోట్లను నిలిపివేసి దాదాపు ఆరు నెలలవుతున్నా తిరిగి నదిలోకి వెళ్లేందుకు అనుమ తులిచ్చే ప్రక్రియ ఇంకా కార్యరూపం దాల్చలేదు. అటు కాకినాడ పోర్టు సైతం రోజుకో కొత్త విధానాన్ని తెరపైకి తెస్తోంది. దీంతో అసలు విహారం ఎప్పుడు ప్రారంభమవుతుందో అంతుచిక్కడం లేదు. తాజాగా జిల్లాలోని ప్రైవేటు,   పర్యాటక అభివృద్ధి సంస్థ బోట్లన్నిటినీ నది, సముద్రంలోంచి బయటకు తీసి ఒడ్డున ఉంచాలని ఆదేశించింది. డ్రైడాక్‌ చేస్తే బోట్ల అడుగు భాగాలన్నింటిని    తనిఖీ చేసి పనికి వస్తాయో? రావో తేల్చుతామని స్పష్టం చేసింది. అటు ఇవేవీ తేలకపోయినా కంట్రోల్‌రూమ్‌ల ప్రారంభానికి సన్నాహలు జరుగుతున్నాయి.  గత సెప్టెంబర్‌ 15న పాపికొండల పర్యాటకానికి 77 మందితో బయలు దేరిన రాయల్‌వశిష్ట బోటు గోదావరిలో మునగడంతో 46 మంది మృతిచెందారు.


ఈ ఘోర ప్రమాదం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బోటు ప్రయాణాలపై నిషేధం విధించింది. పాపికొండల పర్యాటకాన్ని రద్దుచేసింది. బోట్ల లైసెన్స్‌లన్నింటినీ    రద్దు చేసింది. ఇకపై పాపికొండల పర్యాటకానికి అనుమతులిచ్చే విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. మరోపక్క ప్రతి బోటును తనిఖీ చేసి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలని కాకినాడ పోర్టుకు సర్వాధికారాలు ఇచ్చింది. దీంతో బోట్లకు కొత్తగా అనుమతులు ఇవ్వడానికి అనేకరకాల కొత్త నిబంధనలను కాకినాడ పోర్టు తయారుచేసింది. దీనికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. దాని ప్రకారం బోటు డ్రైవర్‌, యజమానికి లైసెన్స్‌ల కోసం ప్రత్యేక పరీక్షలతోపాటు నిపుణులతో శిక్షణ ఇప్పిస్తున్నారు. మరోపక్క 12మంది ప్రయాణించగలిగే చిన్నబోట్లకు కూడా ప్రత్యేక షరతులు కాకినాడ పోర్టు విధించింది. వాటిని పాటించిన ఎనిమిది బోట్లకు గోదావరిలో రెండు కిలోమీటర్ల మేర ప్రయాణించడానికి అనుమతిచ్చింది.


ఈసారి వాటి వంతు...

ఇప్పుడు పెద్దబోట్ల సంగతి తేల్చడానికి సిద్ధమైంది. అందులోభాగంగా 12 మందికి మించి పర్యాటకుల సామర్థ్యం ఉన్న జిల్లాలో అన్ని పెద్దబోట్లను నది, సముద్రం లోపల నుంచి ఒడ్డుకు తేవాలని ఆదేశించింది. ఒక్కో బోటు ఒడ్డున కనీసం ఆరు అడుగులు కనిపించేలా డ్రైడాక్‌ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పుడు వీటన్నింటిని ఆయా యజమానులు ఒడ్డుకు తెచ్చే పనిలో పడ్డారు. వాస్తవానికి బోటు నదిలోకి దించిన అయిదేళ్ల వరకు తిరిగి డ్రైడాక్‌ చేయరు. కానీ ఇప్పుడు పోర్టు ఆదేశాలతో ఒడ్డుకు చేర్చుతు న్నారు. అటు ఏపీటీడీసీకి జిల్లాలో అమెరికన్‌ పాన్‌టూన్‌ అనే 24మంది సామర్థ్యం గల ఏడు టన్నుల బరువున్న బోటు రాజమహేంద్రవరంలో ఉంది. దిండిలో 22మంది ప్రయాణించే సామర్థ్యం గల గోదావరి పాంటూన్‌, వశిష్ట పెద్దబోట్లు, 16మంది సామర్థ్యంతో కలిగిన గౌతమీ, వైనతేయ హౌస్‌బోట్లు ఉన్నాయి. వీటన్నింటిని ఇప్పుడు కాకినాడ పోర్టు ఆదేశాలతో ఒడ్డుకు తెస్తున్నారు. ఈ మేరకు టెండర్లు కూడా పిలిచి ఏజన్సీని ఖరారు చేసింది. 


పనికివస్తాయా? రావా? 

ఇలా నది,సముద్రం ఒడ్డుకు తెచ్చిన బోట్లను కాకినాడ పోర్టుకు చెందిన సర్వేయర్ల నిపుణుల బృందం క్షుణ్ణంగా త్వరలో తనిఖీ చేయనుంది. అడుగు భాగం నిర్మాణం ఎలా ఉంది? ఎంత బరువును కాస్తుంది? నిర్థారిస్తుంది. వాస్తవానికి ఇప్పుడొస్తున్న బోట్ల అడుగు భాగాన్ని ప్లాట్‌గా డిజైన్‌ చేస్తున్నారు. దీనివల్ల ఎక్కువ బరువును తట్టుకుని ప్రమా దాలు తొందరగా జరగవు. కానీ పాత తరం బోట్లు అడుగు భాగం వీ ఆకారంలో ఉంటున్నాయి. ఇవి వేగంగా ప్రమాదానికి గురవుతాయి. గోదావరిలో మునిగిపోయిన రాయల్‌వశిష్ట బోటు అడుగు భాగం వీ ఆకారంలోనే ఉంది. ఈనేపథ్యంలో డ్రైడాక్‌ అయిన బోట్లు అడుగుభాగం ఏ ఆకారంలో ఉన్నాయి? వీటి సామర్థ్యం ఎంత? అనేది సర్వే యర్లు తేల్చనున్నారు. తద్వారా వాటి డిజైన్‌ను మార్చాలా? లేదా కొనసాగించాలా? అనేదానిపై అధ్యయనం చేస్తారు. అన్నీ సక్రమంగా ఉంటే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఇస్తారు. ఈ ప్రక్రియ ప్రారంభించిన తర్వాత ముగియడానికి నెల రోజుల వరకు పట్టనుంది. 


కంట్రోల్‌ రూమ్‌లు రెడీ

గోదావరిలో బోటు ప్రమాదం నేపథ్యంలో దీనిపై నియమించి అత్యున్నత కమిటీ సిఫార్సులకు అనుగుణంగా పాపికొండల పర్యాటకానికి వెళ్లే ప్రాంతాల్లో తొమ్మిది చోట్ల కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. వీటికి సీఎం జగన్‌ గతేడాది ఆఖర్లో ముమ్మిడివరం పర్యటనకు వచ్చినప్పుడు శంకుస్థాపన చేశారు. వీటి నిర్మాణ బాధ్యతను ఏపీటీడీసీ పర్యవేక్షిస్తోంది. గతేడాది డిసెంబరులో వీటికి టెండర్లు పిలవగా, ఎట్టకేలకు ఇవి ఇప్పుడు సిద్ధమ య్యాయి.


గండిపోచమ్మ, పోచవరం, సింగనాపల్లి వద్ద చెరో కంట్రోల్‌రూమ్‌కి రూ.13.35 లక్షలు, రాజమహేంద్రవరంలో కంట్రోల్‌రూమ్‌కు రూ.22.56 లక్షలు, పేరంటాలపల్లి వద్ద రూ.13.23 లక్షలతో వీటిని నిర్మించారు. వీటిని ఈనెల 20న ప్రారంభించాలని నిర్ణయించారు. తర్వాత 21కి మార్చారు. మళ్లీ ఇప్పుడు 26న ముహుర్తంగా నిర్ణయించారు. ఆరోజు సీఎం జగన్‌తో విజయవాడ నుంచి అయినా వీటిని ప్రారంభింప చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క ఒక్కో కంట్రోల్‌ రూమ్‌లో 13మంది సిబ్బంది చొప్పున ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులను పర్యవేక్షకులుగా నియమించారు. కానీ బోట్లకు అనుమతుల ప్రక్రియ ఏమాత్రం పూర్తి చేయకుండా కంట్రోల్‌రూమ్‌లు ప్రారంభించి ఏంచేస్తారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. 

Updated Date - 2020-02-23T06:23:20+05:30 IST