మరోసారి ఆలోచించండి.. నాలుగు రాష్ట్రాల సీఎంలను కోరిన స్టాలిన్

ABN , First Publish Date - 2021-10-16T00:16:44+05:30 IST

బాణాసంచా‌పై విధించిన మూకుమ్మడి నిషేధంపై పునరాలోచించాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే

మరోసారి ఆలోచించండి.. నాలుగు రాష్ట్రాల సీఎంలను కోరిన స్టాలిన్

చెన్నై: బాణాసంచా‌పై విధించిన మూకుమ్మడి నిషేధంపై పునరాలోచించాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. బాణాసంచా విక్రయాలపై మూకుమ్మడి నిషేధం సహేతుకం కాదన్న ఆయన.. టపాసుల తయారీపై దాదాపు 8 లక్షల మంది ఆధారపడి ఉన్నారని, వారి పొట్ట కొట్టొద్దని ఢిల్లీ, ఒడిశా, రాజస్థాన్, హర్యానా ముఖ్యమంత్రులను కోరారు. సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్ నిర్దేశించిన మార్గదర్శకాలకు లోబడి టపాసులను విక్రయించవచ్చన్నారు. 


కరోనా మహమ్మారి దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగాన్ని దారుణంగా దెబ్బతీసిందని, తమిళనాడు ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపించిందని అన్నారు. శివకాశిలోని బాణసంచా పరిశ్రమ రాష్ట్రంలోని ముఖ్యమైన పరిశ్రమల్లో ఒకటని, దానిపై ఆధారపడి సుమారు 8 లక్షల మంది జీవిస్తున్నారని తెలిపారు. ఇంతమంది ఆధారపడుతున్న దేశంలోనే అతిపెద్ద పరిశ్రమ ఇదేనని గుర్తు చేశారు. 


వాయుకాలుష్య కారణంతో ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని తనకు తెలుసని, కానీ సుప్రీంకోర్టు కొన్ని ప్రత్యేకమైన బాణసంచాపైనే నిషేధం విధించిందని, గ్రీన్ క్రాకర్స్ ఇప్పుడు తయారు చేస్తున్నారని, అవి తక్కువ ఉద్గారాలను విడుదల చేస్తాయని స్టాల్ పేర్కొన్నారు. కాబట్టి టపాసులపై నిషేధం సహేతుకం కాదని, ఇతర దేశాల్లోనూ ఎక్కడా నిషేధం లేదని వివరించారు.


ఇలాంటి నిషేధాన్నే ఇతర రాష్ట్రాలు కూడా విధించాయంటే మొత్తం పరిశ్రమనే మూసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే జరిగితే 8 లక్షల మంది జీవనాధారం కోల్పోతారన్నారు. కాబట్టి మూకుమ్మడి నిషేధంపై పునారాలోచించాలని మనస్పూర్తిగా కోరుతున్నట్టు స్టాలిన్ తెలిపారు. 

Updated Date - 2021-10-16T00:16:44+05:30 IST