గిరిజన బాలిక ముందు తలొంచిన పేదరికం!

ABN , First Publish Date - 2021-11-03T23:10:44+05:30 IST

డాక్టర్ కావాలన్న ఆ గిరిజన బాలిక లక్ష్యం ముందు పేదరికం, కష్టాల పప్పులు ఉడకలేదు. ‘నీట్’లో 202 మార్కులు సాధించి

గిరిజన బాలిక ముందు తలొంచిన పేదరికం!

కోయంబత్తూరు: డాక్టర్ కావాలన్న ఆ గిరిజన బాలిక లక్ష్యం ముందు పేదరికం, కష్టాల పప్పులు ఉడకలేదు. ‘నీట్’లో 202 మార్కులు సాధించి లక్ష్య సాధనలో ముందడుగు వేసింది. ఆ బాలిక పేరు ఎం.సంఘవి. కోయంబత్తూరు జిల్లాలోని ఎం నంజప్పనూర్‌ అనే కుగ్రామం ఆమెది. గూగుల్‌లో సెర్చ్‌ చేసినా కనిపించని ఊరు అది. కాయకష్టం చేసుకుని బతికే మలాసర్ సామాజిక వర్గానికి చెందిన మునియప్పన్-వసంతమణి దంపతుల కుమార్తె సంఘవి. అనారోగ్యం బారిన పడిన ఆమె తండ్రి గతేడాది మరణించాడు. మునియప్పన్ కూడా తన కుమార్తెను డాక్టర్‌గా చూడాలని కలలు కనేవాడు. 


తండ్రి మరణం తర్వాత సంఘవి కుటుంబం మరిన్ని కష్టాల్లోకి జారుకుంది. పాక్షిక అంధురాలైన ఆమె తల్లికి కంటి ఆపరేషన్ కావడంతో ఆమె పనులకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటోంది. కరోనా నేపథ్యంలో ఎం నంజప్పనూర్‌లోని గిరిజనులకు నిత్యవసరాలు అందించే ఉద్దేశంతో ఆర్.సిలంబరసన్ సారథ్యంలోని న్యాయవాదుల బృందం ఆ గ్రామానికి సందర్శించింది. ఈ క్రమంలో సంఘవి ఇంటికి కూడా వచ్చారు. మాటల మధ్యలో సంఘవి రెండేళ్ల క్రితం ‘నీట్’ రాసిందని, పాస్ కాలేకపోయిందని తెలుసుకున్నారు. 

 

ఆ తర్వాత ఏడాది పరీక్ష రాయలేకపోయింది. దీంతో సిలంబరసన్, ఆయన బృందంతోపాటు స్థానిక మీడియా ప్రతినిధులు ఆమెకు సాయం చేయాలని నిర్ణయించారు. సంఘవి, ఆమె తల్లి ఓ చిన్న గుడిసెలో నివసిస్తున్నారని, వర్షం పడితే అందులో ఉండడం సాధ్యం కాదని సిలంబరసన్ తెలిపారు. ఆ గ్రామంలో 12వ తరగతి పాసైన తొలి బాలిక సంఘవియేనని, ఈ ఏడాది ‘నీట్’ కూడా పాసైందని ఆయన వివరించారు. 


2017-18లో తాను ‘నీట్’కు హాజరయ్యానని, కానీ పాస్ కాలేకపోయానని సంఘవి తెలిపింది. వైద్యురాలినై ప్రజలకు సేవ చేయాలనేది తన కోరిక అని, కానీ నీట్ రాయాలంటే ఏం చేయాలో కూడా తనకు తెలియదని, దీంతో నిరాశలోకి వెళ్లిపోయానని తెలిపింది. ఆ తర్వాత సంఘవి పాలిటెక్నిక్‌లో జాయిన్ అయినా కమ్యూనిటీ సర్టిఫికెట్ లేకపోవడంతో పది రోజులకే ఆ చదువుకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. గతేడాది ఆమెకు కమ్యూనిటీ సర్టిఫికెట్ వచ్చింది.


 ఆ తర్వాత  సిలంబరసన్, ఆయన బృందంతోపాటు మరికొంతమంది సాయంతో సంఘవి ప్రైవేట్ నీట్ కోచింగ్ సెంటర్‌లో చేరింది. రెండో ప్రయత్నంలో ఈ ఏడాది 202 మార్కులతో పాసైంది. గిరిజనులకు తమిళనాడు ప్రభుత్వం 7.5 శాతం రిజర్వేషన్ కల్పించడంతో ఆమెకు తప్పకుండా మెడిసిన్‌లో సీటు వస్తుందని ‘టైమ్’ కోచింగ్ సెంటర్‌కు చెందిన కె.శివకుమార్ తెలిపారు. అయితే, ఇక్కడితోనే ఆమె కష్టాలు తీరిపోలేదు. ఎంబీబీఎస్ చదవాలంటే ఆర్థిక సాయం చాలా అవసరం. దీంతో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సాయం కోసం ఎదురుచూస్తోంది.  

Updated Date - 2021-11-03T23:10:44+05:30 IST