శశికళ దూకుడు.. ఎడప్పాడి కళ్లెం..!

ABN , First Publish Date - 2020-09-30T13:54:46+05:30 IST

అక్రమార్జన కేసులో అరెస్టై బెంగళూరు పరప్పన అగ్రహారం జైలులో శిక్ష అను భవిస్తున్న మాజీ ముఖ్యమంత్రి జయ లలిత సన్నిహితురాలు శశికళ వచ్చే యేడాది జనవరి 27న విడుదల

శశికళ దూకుడు.. ఎడప్పాడి కళ్లెం..!

చెన్నై : అక్రమార్జన కేసులో అరెస్టై బెంగళూరు పరప్పన అగ్రహారం జైలులో శిక్ష అను భవిస్తున్న మాజీ ముఖ్యమంత్రి జయ లలిత సన్నిహితురాలు శశికళ వచ్చే యేడాది జనవరి 27న విడుదల అవుతారని కర్ణాటక జైళ్ల శాఖ అధికారులు ప్రకటించినప్పటి నుంచి అన్నా డీఎంకే పాలకుల గుండెల్లో రైళ్లు పరు గెడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు 3 నెలల ముందు శశికళ రాష్ట్రంలో అడుగుపెడితే అన్నాడీఎంకేలో పెను మార్పులు సంభవిస్తాయని అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం నేత వెట్రి మారన్‌ ఘంటాపథంగా చెబుతున్నారు. ఇప్పటి వరకు అన్నాడీఎంకేలో అందరూ అనుకున్నట్లుగా ఎడప్పాడి, పన్నీర్‌సెల్వం వర్గాల మాత్రమే కాకుండా గత మూడేళ్లుగా వారి ద్వారా ఎలాంటి ప్రయోజనాలు, పదవులు పొందని శాసనసభ్యులు కొందరు అసంతృప్తవర్గంగా కొనసాగుతున్నారు. వీరంతా శశికళ వర్గంలోకి దూకితే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఫలితాలు తారుమారవుతాయని ఎడప్పాడి, పన్నీర్‌సెల్వం అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో శశికళ జైలు నుంచి విడుదలై అన్నాడీఎంకేలో చీలిక తెచ్చే ప్రయత్నాలను ముందుగానే అడ్డుకోవడానికి అనువుగా ఎడప్పాడి పావులు కదపనున్నారు.


ఆమె దూకుడుకు కళ్లెం వేయడానికే జస్టిస్‌ ఆరుముగసామి కమిటీని తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నాలను అప్పుడే ప్రారంభించారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్‌ ఆరుముగసామి కమిటీని నియమించి మూడేళ్లు గడిచింది. జయ మృతిపై అనుమానాలున్నాయంటూ మాజీ ముఖ్య మంత్రి పన్నీర్‌సెల్వం అన్నాడీఎంకేలో చీలిక తెచ్చి మౌనయుద్ధం ప్రారంభించడంతో ముఖ్యమంత్రి ఎడప్పాడి జయ మృతిపై విచారణకు కమిటీ ఏర్పాటు చేశారు. తన పంతం నెగ్గిందంటూ పన్నీర్‌సెల్వం అన్నాడీఎంకే పార్టీలో మళ్లీ చేరారు. అనంతరం జస్టిస్‌ ఆరుముగసామి కమిటీ విచారణ వేగం పుంజుకుంది. రోజుకు పది, పదిహేను మంది చొప్పున సాక్షులను విచారించడం, జయలలితకు వైద్యం చేసిన డాక్టర్లందరినీ పిలిపించి వారిని కూడా విచారించిన ఆ కమిటీ తీవ్ర కలకలం సృష్టించింది. అపోలో ఆస్పత్రి నిర్వాహకులు జయలలితకు అందించిన చికిత్స, వాటికి అయిన ఖర్చుల వివరాలు మూడు నాలుగు ట్రావెల్‌ బ్యాగుల నిండుగా ఆంగ్లంలో ఉన్న రికార్డులను అప్పగించడం కూడా జరిగింది. జయ చికిత్సల నివేదికలను తమిళంలోకి తర్జుమా చేయడంలో తప్పులు దొర్లడం, అపోలో వైద్యులు, సిబ్బందిని పిలిపించి విచారణ జరిపి జస్టిస్‌ ఆరుముగసామి హడావుడి సృష్టించారు. జయ మృతిపై అనుమానాలన్నింటినీ ఆ కమిటీ త్వరలో పటాపంచాలు చేస్తుందనకుంటున్న సమయంలో విచారణకు బ్రేక్‌ పడింది.


ఎనిమిదిసార్లు పొడిగింపు

జస్టిస్‌ ఆరుముగసామి కమిటీ పదవీ కాలాన్ని అన్నాడీఎంకే ప్రభుత్వం ఇప్పటివరకూ ఎనిమిది సార్లు పొడిగించింది. ఆ కమిటీ ఇప్పటి వరకు 154 మంది సాక్షులను విచారించింది. జయకు 75 రోజులపాటు చికిత్స అందించిన అపోలో ఆస్పత్రికి చెందిన 54 మంది వైద్యులు, ఐదుగురు ఎయిమ్స్‌ వైద్యులు, 12 మంది ప్రభుత్వ వైద్యులు, 22మంది వైద్య సిబ్బందిని ఆరుముగసామి విచారణ జరిపి వాంగ్మూలాలను నమోదు చేశారు. వీరితోపాటు 59 మంది ఇతర సాక్షులను కూడా విచారించారు. జయలలిత మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ ఆరోపణలు చేసిన పన్నీర్‌సెల్వం ఇప్పటి వరకు ఆరుముగసామి కమిటీ ఎదుట హాజరుకానేలేదు.


‘స్టే’ తెచ్చుకున్న అపోలో ఆస్పత్రి

జస్టిస్‌ ఆరుముగసామి కమిటీ తమను తప్పుబట్టే రీతిలో కొనసాగుతోందని ఆరోపిస్తూ అపోలో ఆస్పత్రి నిర్వాహకులు విచారణపై స్టే తెచ్చుకునేందుకు ప్రయత్నించింది. మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చేసిన చికిత్సపై 21 మంది వైద్యుల నిపుణుల కమిటీతో విచారణ జరిపించాలని అపోలో ఆస్పత్రి మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. గతేడాది ఏప్రిల్‌ 4న హైకోర్టు ఆ పిటిషన్‌ తోసిపుచ్చడంతో అపోలో ఆస్పత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు గతేడాది ఏప్రిల్‌ 26న జస్టిస్‌ ఆరుముగసామి కమిటీ విచారణపై స్టే విధించింది. ఆ స్టేను తొలగించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పిటిషన్‌ దాఖలు చేసింది. అంతే అప్పటి నుంచి ఏడాదిన్నర కాలంగా ఆరుముగసామి కమిటీ ఎలాంటి విచారణ జరుపలేకపోయింది.


నెలకు రూ.4.26 లక్షల ఖర్చు...

ఈ నేపథ్యంలో ఈ నెల 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏఎం కన్విల్కర్‌, సంజీవ్‌ఖన్నాలతో కూడిన ధర్మాసనం ఎదుట అపోలో ఆస్పత్రి అప్పీలు పిటిషన్‌ విచారణకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఓ అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఆ అఫిడవిట్‌లో జస్టిస్‌ ఆరుముగసామి కమిటీలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి ప్రతి నెలా రూ.4.26లక్షలు ఖర్చుపెడుతున్నామని, సుప్రీంకోర్టు విధించిన స్టే కారణంగా ఏడాదిన్నర కాలంగా కమిటీ విచారణ నిలుపుదల చేయడం వల్ల ప్రజాధనం అనవసరంగా వృథా అవుతోందని, ఆరంభంలో విచారణకు అన్ని విధాలా సహకరించిన అపోలో ఆస్పత్రి, కమిటీ తుది నివేదిక వెల్లడించే తరుణంలో విచారణ జాప్యం అయ్యేలా అప్పీలు పిటిషన్‌ దాఖలు చేసిందని పేర్కొన్నారు. ఇకనైనా ప్రభుత్వ ధనం వృథా కాకుండా జస్టిస్‌ ఆరుముగసామి కమిటీ విచారణ పూర్తయేందుకు వీలుగా స్టే తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ప్రభుత్వ తరఫు వాదనలకు కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయమంటూ అపోలో ఆస్పత్రి యాజమాన్యానికి సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను అక్టోబర్‌ 12కు వాయిదా వేసింది.


స్టే తొలగింపునకు తొందరెందుకు?

జస్టిస్‌ ఆరుముగసామి కమిటీ విచారణపై విధించిన స్టే తొలగించాలని ఇదివరకే ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం సుప్రీంకోర్టులో దాఖలైంది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్టే రద్దు చేయాలని తాజాగా పిటిషన్‌ దాఖలు చేసింది. ఏడాదిన్నర కాలంగా స్టేను తొలగించడానికి ఎలాంటి ప్రయత్నం చేయని అన్నాడీఎంకే ప్రభుత్వం హఠాత్తుగా స్టే తొలగించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేయడానికి కారణాల ఏమిటని అన్నాడీఎంకే వర్గాల్లో ఆరా తీయగా ఆసక్తికరమైన విషయాలు వెలుగు లోకి వచ్చాయి.


శశికళే టార్గెట్‌

జస్టిస్‌ ఆరుముగసామి కమిటీ విచారణ గతంలో మాదిరిగా చురుకుగా సాగాలని ముఖ్యమంత్రి పళనిస్వామి భావిస్తున్నారని, దీనికి కారణం జైలు నుంచి విడుదల కానున్న శశికళేనని అన్నాడీఎంకే నేతలు చెబుతున్నారు. శశికళ విడుదలకు ఆరుముగసామి కమిటీ విచారణకు సంబంధం ఏమిటని ప్రశ్నించగా అంతా చిన్నమ్మ దూకుడుకు కళ్ళెం వేయడానికేనని బదులిచ్చారు. అక్రమార్జన కేసులో  జైలుశిక్ష అనుభవిస్తున్న శశికళ జనవరి 27న విడుదలయ్యే అవకాశం ఉందని కర్ణాటక జైళ్లశాఖ అధికారులు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ శశికళ జైలు విడుదలై తమిళనాట అడుగుపెట్టబోతున్నారు. ఎన్నికల ముందు శశికళ విడుదలై వస్తే అన్నాడీఎంకేలో తప్పకుండా ఊహించిన మార్పులు జరుగుతాయని ఎడప్పాడి అనుమానిస్తున్నారు. ప్రత్యేకించి ఇటు ఎడప్పాడి వర్గానికి, అటు పన్నీర్‌ సెల్వం వర్గానికి దూరంగా ఉంటున్న శాసనసభ్యులు ఇప్పటికే శశికళ ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఎడప్పాడి, పన్నీర్‌సెల్వం ద్వారా తమకు ఎలాంటి రాజకీయపరమైన, ఆర్థికపరమైన ప్రయోజనాలు కలగక పోవడం వల్లే వీరంతా గోడమీది పిల్లుల్లా ప్రవర్తిస్తున్నారు. శశికళ ఎప్పుడు విడుదలైతే అప్పుడు ఆమె వర్గంలో అంటే టీటీవీ దినకరన్‌ వర్గంలో చేరి ఎన్నికల్లో పోటీ చేయాలన్నది ఈ అసంతృప్త అధికార పార్టీ శాసనసభ్యుల వ్యూహరచన. ఈ విషయాన్ని పసిగట్టిన అన్నాడీఎంకే ఉప సమన్వయకర్త, ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి జస్టిస్‌ ఆరుముగసామి కమిటీ విచారణను మళ్లీ తెరమీదికి తెచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.


ఒక్క పాయింట్‌ లభిస్తే చాలు...

జస్టిస్‌ ఆరుముగసామి కమిటి నివేదికలో మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతికి సంబంధించి శశికళను తప్పుబట్టే విధంగా ఒకే ఒక పాయింట్‌ లభిస్తేచాలు ఆ ఆరోపణాస్త్రాన్ని సంధించేందుకు ఎడప్పాడి సిద్ధంగా ఉన్నారు. ‘ఇదిగో చూడండి ఆరుముగసామి కమిటీ శశికళను తప్పుబట్టింది’ అంటూ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆమె దూకుడుకు కళ్ళెం వేయాలని ఎడప్పాడి భావిస్తున్నారు. జయ మృతికి శశికళే ప్రధానకారణమంటూ ప్రచారంచేస్తే తన శిబిరంలోని అసంతృప్త ఎమ్మెల్యేలు ఆమె వర్గంలో చేరకుండా అడ్డుకోవచ్చునని ఎడప్పాడి ఆలోచనగా ఉంటోంది. ఒక వేళ తాను శశికళపై చేసే ప్రచారాన్ని అడ్డుకునేందుకు ఆమె స్టే తెచ్చుకునేందుకు ప్రయత్నించినా స్టే వచ్చేలోపు ఎన్నికల పుణ్యకాలం కాస్తా అయిపోతుందని ఆ తర్వాత ఎలాంటి సమస్య ఉండదని ఆయన అంచనా వేస్తున్నారు. తన మదిలోని ఈ వ్యూహ రచనలకు కార్యరూపం కల్పించేందుకు ఎడప్పాడి ప్రస్తుతం జస్టిస్‌ ఆరుముగసామి కమిటీపై సుప్రీంకోర్టు విధించిన స్టేను వీలైనంత త్వరగా తొలగించేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికల సమయంలో జస్టిస్‌ ఆరుముగ సామి కమిటీ నివేదిక తప్పకుండా తీవ్ర దుమా రాన్ని కలిగించటం ఖాయమని అన్నాడీఎంకే వర్గీయు లు భావిస్తున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ అన్నాడీఎంకే కు గట్టి మద్దతునిచ్చేది మహిళలేనని, వారికి శశికళపై సానుభూతి కలగకుండా చేయాలన్నదే ఎడప్పాడి ప్రధాన వ్యూహ రచన అనీ తెలుస్తోంది. ఆ దిశగానే ప్రస్తుతం ఆయన పావులు కదు పుతున్నారు. వచ్చే యేడాది జనవరి 27 తర్వాత ఎడ ప్పాడి వ్యూహరచ న లు ఫలిస్తాయో లే దో వేచి చూడా ల్సిందే!

Updated Date - 2020-09-30T13:54:46+05:30 IST