తప్పంతా రెవెన్యూదే!

ABN , First Publish Date - 2022-01-29T06:29:55+05:30 IST

సత్తివానిపాలెం ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు తొలగించడానికి వెళ్లిన రెవెన్యూ సిబ్బందిపై దాడి చేసిన వైసీపీ వార్డు ఇన్‌చార్జి దొడ్డి కిరణ్‌ను మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్‌ సమర్థిస్తూ మాట్లాడారు.

తప్పంతా రెవెన్యూదే!

‘నరవ’ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే

మళ్ల విజయప్రసాద్‌ ఆరోపణలు

నోటీసులు ఇవ్వకుండా ఆక్రమిత భూముల స్వాధీనానికి ఎలా వెళతారంటూ ప్రశ్నలు

నిబంధనలు పాటించలేదని విమర్శలు

అక్కడ జరిగింది వాగ్వాదమే...ఎవరిపైనా దాడి చేయలేదంటూ వ్యాఖ్యలు

 సిబ్బందిపై తిరిగి కేసు పెట్టినట్టు వెల్లడి



విశాఖపట్నం, జనవరి 28 (ఆంధ్రజ్యోతి):

సత్తివానిపాలెం ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు తొలగించడానికి వెళ్లిన రెవెన్యూ సిబ్బందిపై దాడి చేసిన వైసీపీ వార్డు ఇన్‌చార్జి దొడ్డి కిరణ్‌ను మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్‌ సమర్థిస్తూ మాట్లాడారు. అక్కడ వారు ఏమీ తప్పు చేయలేదని, రెవెన్యూ సిబ్బందే ప్రొసీజర్‌ ఫాలో కాలేదని, అందుకని వారిపైనే చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ఎదురు కేసు పెట్టామని వెల్లడించారు. ప్రభుత్వ అతిథి గృహంలో శుక్రవారం సాయంత్రం మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు నిర్వహించిన సమావేశంలో మళ్ల విజయప్రసాద్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దొడ్డి కిరణ్‌ను పోలీసులు ఎప్పుడు పట్టుకుంటారని విలేఖరులు ప్రశ్నించగా, మళ్ల తాను చెబుతానంటూ మైక్‌ అందుకున్నారు. సత్తివానిపాలెంలో అసలు గొడవే జరగలేదని, ఎవరూ దాడి చేయలేదని, వాగ్వాదం జరిగితే విడిపించారే తప్ప అంతకు మించి ఏమీ లేదని పేర్కొన్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రెవెన్యూ సిబ్బందే తప్పులు చేశారని, వారు నిబంధనలు పాటించలేదని చెప్పుకొచ్చారు. ఆక్రమిత ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలంటే ముందుగా నోటీసు ఇవ్వాలని, కానీ వారు ఇవ్వలేదన్నారు. అలాగే భూ స్వాధీనానికి వెళితే సంబంధిత పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని, వారికి కూడా చెప్పలేదని వెల్లడించారు. అయినా అదంతా ప్రభుత్వ భూమి కాదని, అందులో ఎక్కువ ప్రైవేటు భూమి వుందని మళ్ల పేర్కొన్నారు. నిబంధనలు పాటించనందుకు ఆర్‌ఐ, వీఆర్‌ఓలపై కేసు పెట్టామని, వారిపై చర్యలకు డిమాండ్‌ చేస్తున్నామని చెప్పారు. ‘మీరు దొడ్డి కిరణ్‌ని సమర్థిస్తున్నారా?’ అని విలేఖరులు ప్రశ్నించగా, తాను తప్పు చేయనని, తప్పులు చేసే వారిని సమర్థించనని చెప్పారు. గత 13 ఏళ్లుగా నియోజకవర్గంలో ఇదే పాటిస్తున్నానన్నారు.

వీఆర్‌ఓ ఏం చేస్తున్నారు?

సత్తివానిపాలెంలో భూ వివాదం ఆరు నెలలుగా ఉందని మళ్ల పేర్కొన్నారు. తాను దీనిపై పెందుర్తి సీఐకి చెబితే....ఆయన గొడవలు జరగకుండా, సరిహద్దులు నిర్ణయించాలని తహసీల్దార్‌కు సూచించగా...అప్పుడే అక్కడ హద్దులు నిర్ణయించారని మళ్ల పేర్కొన్నారు. ఆ వెంటనే దొడ్డి కిరణ్‌ ప్రహరీ నిర్మించాడని, అది ప్రభుత్వ భూమిలో ఉంటే...స్థానిక వీఆర్‌ఓ ఇంతకాలం ఏమి చేస్తున్నట్టు? అధికారులు అతడిపై ఎందుకు చర్యలు తీసుకోరు? అని ప్రశ్నించారు.

వాళ్లే రెచ్చగొట్టారు

సత్తివానిపాలెం వెళ్లిన రెవెన్యూ సిబ్బంది...ఆక్రమణలు తొలగించాలంటూ తమను తహసీల్దార్‌ పంపించారని, దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ రెచ్చగొడుతూ మాట్లాడారని మళ్ల ఆరోపించారు. వాళ్లు అలా చేసి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చారని, అందుకే వారిపై చర్యలకు ఫిర్యాదు చేశామన్నారు. 

అర్ధరాత్రి వరకు వెదికాం

పెందుర్తి సీఐ, ఎస్‌ఐ, తాను కలిసి దొడ్డి కిరణ్‌ కోసం గురువారం అర్ధరాత్రి 12 గంటల వరకు వెదికామని, ఇవన్నీ ఎవరికి తెలుసు? అంటూ ఆయన ప్రశ్నించారు. అక్కడ సరిహద్దుల నిర్ణయంలోను, ఆక్రమణల తొలగింపులోను రెవెన్యూ సిబ్బందిదే తప్పు అన్నట్టుగా మాట్లాడారు. సిబ్బందికి చిన్న గాయం కూడా కాలేదని, అయినా తప్పుడు ప్రచారం చేశారని, తాము ఊరుకోబోమని స్పష్టంచేశారు. 




మళ్ల వ్యాఖ్యలపై అధికారుల ఆగ్రహం


నెల క్రితమే సర్వే...ప్రభుత్వ భూమిగా నిర్ధారణ

అభ్యంతరాలుంటే అప్పీల్‌కు వెళ్లాలి

సిబ్బందిపై దాడి చేయడం ఏమిటంటూ ప్రశ్న

 

విశాఖపట్నం, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): పెందుర్తి మండలం నరవలో  ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన సిబ్బందిపై వైసీపీ నేత దొడ్డి కిరణ్‌ దాడి చేయడాన్ని రెవెన్యూ వర్గాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. దాడికి పాల్పడిన కిరణ్‌కు వత్తాసుగా మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్‌ మాట్లాడడాన్ని అధికారులు తప్పుబడుతున్నారు. ఆ ప్రాంతంలో నెల రోజుల క్రితం సర్వే నిర్వహించిన అధికారులు...ప్రభుత్వ భూమిని కలుపుకుని ప్రహరీ నిర్మించారని సంబంధిత వ్యక్తులకు స్పష్టంగా తేల్చిచెప్పారన్నారు. దీనిపై అభ్యంతరాలు వుంటే జేసీ, ఆర్డీవో, సర్వే ఏడీకి అప్పీల్‌ చేసుకోవచ్చునని, కానీ అలాంటిదేమీ చేయకుండా...ఇప్పుడు ఆక్రమణలు తొలగించేందుకు వెళ్లిన సిబ్బందిపై దాడికి పాల్పడడమేమిటని ఒక అధికారి ప్రశ్నించారు. ‘ఆక్రమణ తొలగింపుపై అభ్యంతరాలుంటే కోర్టుకు వెళ్లాలే తప్ప సిబ్బందిపై దాడి చేస్తారా?...అని ప్రశ్నించారు. 

ఉద్యోగులకు అండగా ఉంటాం: కలెక్టర్‌

ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని కలెక్టర్‌ మల్లికార్జున తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ విఽధులు సక్రమంగా నిర్వర్తించే విషయంలో జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. కాగా నరవ ఘటనకు సంబంధించి దొడ్డి కిరణ్‌పై కేసు నమోదు చేశారరన్నారు. 






Updated Date - 2022-01-29T06:29:55+05:30 IST