చీకటి దందాలపై ఉక్కుపాదం

ABN , First Publish Date - 2020-09-24T07:03:53+05:30 IST

జిల్లాలో అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అక్రమంగా రేషన్‌ బియ్యం తరలింపు, బొగ్గు దొంగతనాలు, బెల్ట్‌

చీకటి దందాలపై ఉక్కుపాదం

సీపీ పర్యవేక్షణలో టాస్క్‌ఫోర్స

రేషన్‌ బియ్యం తరలింపు, పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై నిఘా

బెల్టు షాపులు, పేకాట స్థావరాలపై దాడులు


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలో అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అక్రమంగా రేషన్‌ బియ్యం తరలింపు, బొగ్గు దొంగతనాలు, బెల్ట్‌ షాపులపై, గుట్కాలు, ఇతర పొగాగు ఉత్పత్తులపై, పేకాట స్థావరాలపై ఓ కన్నేసిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వారంలో కనీసం నాలుగైదు కేసులు నమోదు చేస్తూ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా ప్రభుత్వం 33 జిల్లాలను ఏర్పాటు చేయగా, కొత్తగా కమిషనరేట్‌లను కూడా ఏర్పాటు చేసింది. అందులో భాగంగా పెద్దపల్లి, మంచిర్యాలకు కలిపి ప్రభుత్వం జిల్లాలోని రామగుండలో పోలీస్‌ కమిషనరేట్‌ను ఏర్పాటు చేసింది. అక్రమ దందాలు, చీకటి వ్యాపారాలను వెలికి తీసేందుకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో పలువురు సీఐలు, ఎస్‌ఐలు, కొంత మంది పోలీసు సిబ్బందిని నియమించారు. కమిషనర్‌ వి సత్యనారాయణ పర్యవేక్షణలో టాస్క్‌ఫోర్స్‌ పని చేస్తున్నది.


ప్రభుత్వం రేషన్‌ వినియోగదారులకు సబ్సిడీపై ఇస్తున్న బియ్యాన్ని కొందరు రాష్ట్ర సరిహద్దులు దాటిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రేషన్‌ వినియోగదారుల నుంచి కిలోకు 8 నుంచి 10 రూపాయల చొప్పున కొనుగోలు చేసి సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలకు తరలించి కిలోకు 20 నుంచి 25 రూపాయలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందాను అరికట్టడం పౌరసరఫరాల శాఖ అధికారులతో సాధ్యంకాకపోవడంతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అక్రమ వ్యాపారం చేస్తున్న వారిని గుర్తించి బియ్యాన్ని పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు. ఇటీవల అంతర్గాం మండలం ఎల్లంపల్లికి చెందిన ఇద్దరు వ్యక్తులు  1,62,000 రూపాయల విలువైన బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు. ఇలా అనేక కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తులు, గుట్కాల అమ్మకాలపై నిషేధం ఉండడాన్ని కొందరు వ్యాపారులు ఆసరా తీసుకుని మహారాష్ట్ర ప్రాంతం నుంచి సరఫరా చేసుకుని గుట్టుచప్పుడుగా విక్రయిస్తున్నారు.


సదరు వ్యాపారులు జిల్లాలోనే కాకుండా కరీంనగర్‌, జగిత్యాల జిల్లాలకు కూడా సరఫరా చేస్తున్నారు. దీనిని పసిగట్టిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించి పట్టుకుంటున్నారు. ఇటీవల మంచిర్యాల పట్టణంలో 6,50,000 రూపాయల విలువైన పొగాకు ఉత్పత్తులు, గుట్కాలను పట్టుకున్నారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో సింగరేణి విస్తరించి ఉండడంతో బొగ్గు దొంగతనాలు కూడా బాగానే జరుగుతుండడంతో వాటిని అరికడుతున్నారు. జిల్లాలో అనేక మంది పేకాడుతూ ఇల్లును గుల్ల చేసుకుంటున్నారు. ఆ స్థావరాలను గుర్తించి దాడులు నిర్వహిస్తున్నారు. పీడీ యాక్టు పెడతామని హెచ్చరిస్తున్నా కూడా ఆగడం లేదు. దీంతో మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలానికి చెందిన అన్నాల తిరుపతి (42)పై ఇటీవల పీడీ యాక్టు పెట్టారు. పేకాటరాయుళ్లపై ఇది తొలి పీడీ యాక్టు కావడం గమనార్హం. 


బెల్టుషాపులను మూసివేయించాలి..

అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా గ్రామాల్లో నిర్వహిస్తున్న బెల్ట్‌ షాపులపై కూడా దాడులు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితం మంథని మండలం నాగారం గ్రామంలో ఒక బెల్టుషాపుపై దాడి చేసి నిల్వ చేసిన మద్యాన్ని పట్టుకున్నారు. ఇలా చీకటి వ్యాపారాలు చేసే వారిపై నిఘా పెట్టిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కేసులు నమోదు చేస్తుండడంతో అక్కమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కమిషనరేట్‌ ఏర్పాటైన నాటి నుంచి టాస్క్‌ఫోర్స్‌ కొనసాగుతున్నది. స్థానికంగా ఉండే పోలీసులు కూడా వీటిపై దృష్టి సారించి కేసులు నమోదు చేస్తున్నారు. టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు సత్ఫలితాలను ఇస్తుండడంతో అక్రమ వ్యాపారాలు కొంత మేరకు అదుపులోకి వస్తున్నాయి. ఊరూరా నడుస్తున్న బెల్టు షాపులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి వాటిని మూసి వేయించాలని ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2020-09-24T07:03:53+05:30 IST