అన్నదాతకు ‘పన్ను’పోటు

ABN , First Publish Date - 2021-04-14T06:30:57+05:30 IST

వ్యవసాయం వ్యయసాయంగా మారింది. పెట్టుబడి ఖర్చులు ఏటికేడు పెరిగిపోతుండగా అందుకు అనుగుణంగా దిగుబడులు, ధరలు లభించని దుస్థితి నెలకొంది.

అన్నదాతకు ‘పన్ను’పోటు

వ్యవసాయ ఉపకరణాలపై జీఎస్టీ

పురుగుమందులు, ఎరువులపైనా ఒడ్డన 

నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి 

ఏడాదికి రూ.90కోట్ల మేర భారం 

పెరిగిపోతున్న పెట్టుబడి ఖర్చులు

మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి

పట్టించుకోని జీఎస్టీ కౌన్సిల్‌

ఒంగోలు (జడ్పీ), ఏప్రిల్‌ 13: వ్యవసాయం వ్యయసాయంగా మారింది. పెట్టుబడి ఖర్చులు ఏటికేడు పెరిగిపోతుండగా అందుకు అనుగుణంగా దిగుబడులు, ధరలు లభించని దుస్థితి నెలకొంది. దీంతో అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఆత్మస్థయిర్యం కోల్పోయి కొందరు ఆత్మహత్యల బాట పడుతుండగా, మరికొందరు సాగుకు దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి అండగా ఉండాల్సిన ప్రభుత్వాలు పన్నుల పేరుతో ఎడాపెడా బాదేస్తున్నాయి. ముఖ్యంగా కేంద్రం వ్యవసాయ పనిముట్లు, ఎరువులు, పురుగుమందులపై విధిస్తున్న జీఎస్టీ (వస్తు సేవల పన్ను) కర్షకులను కుంగదీస్తోంది. జిల్లాలో 80శాతం మేర చిన్న, సన్నకారు రైతాంగమే కావడంతో వారు ఈ అదనపు భారం మోయలేక అల్లాడిపోతున్నారు. అదేసమయంలో రాయితీ యంత్ర పరికరాలపై రాష్ట్ర ప్రభుత్వం నాన్చుడు ధోరణి కూడా పరోక్షంగా సాగుదారులపై భారానికి కారణమవుతోంది. 


2017 నుంచి అమలు 

కేంద్రప్రభుత్వం 2017 నుంచి జీఎస్టీని అమల్లోకి తెచ్చింది.  అప్పటి నుంచి క్రిమిసంహారక మందులపై 18 శాతం, యంత్ర పరికరాలపై 12 నుంచి 18 శాతం జీఎస్టీని వసూలు చేస్తోంది. ఎరువులపై పన్నును 5 శాతానికి పరిమితం చేసి, విత్తనాలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. మందులు, యంత్ర పరికరాలపై విధిస్తున్న పన్ను శాతంతో పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతున్నాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా రబీ, ఖరీఫ్‌లో కలిపి పురుగు ముందుల లావాదేవీలు రూ.400 నుంచి రూ.450 కోట్ల వరకూ జరుగుతుంటాయి. వ్యవసాయ ఉపకరణాలను ఏడాదికి రూ.110 కోట్ల వరకూ కొనుగోలు చేస్తుంటారు. వీటిపై కేంద్రం అధిక శాతం జీఎస్టీ విధించడం వలన ఏడాదికి జిల్లాలోని రైతులకు రూ.90 కోట్ల మేర భారం పడుతోంది. 


పెరిగిన రసాయన ఎరువుల వాడకం

గతంలో రుతువులు కాలానుగుణంగా నడిచేవి. దానికి తగ్గట్టుగానే పంటలకు చీడపీడల బెడద తక్కువగా ఉండేది. కాలగమనంలో రుతువులు కూడా గతి తప్పడం ప్రారంభమైంది. రకరకాల కొత్త తెగుళ్లు, చీడపీడలు పంటలకు ఆశించడం అధికమైంది. వీటి నివారణకు అనివార్యంగా రైతులు క్రిమిసంహారక మందులను పెద్దఎత్తున పిచికారీ చేయడం మొదలుపెట్టారు. దీంతో పెట్టుబడి ఖర్చులు పెరగడంతోపాటు, దిగుబడుల్లో నాణ్యత లోపిస్తోంది. ఈ సమయంలో ‘గోరుచుట్టుపై రోకటి పోటు’ అన్న చందంగా జీఎస్టీ వారిని మరింత బాధిస్తోంది. 


కరోనాతో కూలీల కొరత

కరోనాతో వ్యవసాయ పనులకు కూలీలు దొరక్క రైతులు నానాఅగచాట్లు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాయితీ యంత్రాలను అయినా సకాలంలో ఇస్తే వారికి కొంత మేర పన్ను పోటు తగ్గేది. ఆ విషయంలో ప్రభుత్వం మొండిచేయి చూపుతూనే ఉంది. దీంతో రైతులు అప్పోసొప్పో చేసి యంత్రాలను కొనుగోలు చేస్తున్నారు. వారికి ప్రధానంగా ఉపయోగపడే ఉపకరణాలైన స్ర్పేయర్లు, ట్రాక్టర్లపై ప్రభుత్వం 12 నుంచి 18 శాతం వరకూ జీఎస్టీ విధిస్తోంది. ఒకవైపు అప్పులపై వడ్డీలు, మరోవైపు జీఎస్టీ పేరిట ప్రభుత్వాల బాదుడు వీటన్నింటితో పెట్టుబడి ఖర్చు అంచనా కన్నా రెట్టింపవడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. 


పట్టించుకోని జీఎస్టీ కౌన్సిల్‌

జీఎస్టీ పరిధి నుంచి వ్యవసాయాధారిత ఉపకరణాలను, పురుగు మందులను మినహాయించాలని రైతులు, రైతు సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రతిసారీ జీఎస్టీ కౌన్సిల్‌ పన్నులు విధించే వస్తువులపై సమీక్ష చేస్తున్నా రైతుల వినతిని మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా తమ  కష్టాలను పరిగణనలోకి తీసుకుని పురుగుమందులను, ఎరువులను 5శాతం జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే  ఉపయుక్తంగా ఉంటుందని రైతులు కోరుతున్నారు. 


Updated Date - 2021-04-14T06:30:57+05:30 IST