Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొత్త మున్సిపాలిటీల్లో పన్నుల మోత

ఇప్పటి వరకు పంచాయతీ నిబంధనల మేరకు పన్నులు 

ఇకపై మున్సిపల్‌ చట్టం ప్రకారం వసూలు

నర్సాపూర్‌, రామాయంపేట, తూప్రాన్‌ పట్టణవాసులపై భారం

మున్సిపాలిటీలకు భారీగా పెరగనున్న ఆదాయం


నర్సాపూర్‌, డిసెంబరు 2: నూతన మున్సిపాలిటీల్లో పన్నుల మోత మోగనున్నది. ఇప్పటి వరకు పంచాయతీ చట్టం ప్రకారం పన్నులను వసూలు చేయగా.. ఇకపై మున్సిపల్‌ చట్టం ప్రకారం పన్నులు విధించనున్నారు. మెదక్‌ జిల్లాలో కొత్తగా నర్సాపూర్‌, తూప్రాన్‌, రామాయంపేట పట్టణాలు మేజర్‌ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ అయ్యాయి. అయితే ఇప్పటి వరకు పాత పంచాయతీ చట్ట ప్రకారమే పన్నులు వసులు చేశారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగియనుండటంతో కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం పన్నులు చెల్లించాలని పట్టణవాసులకు నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో మున్సిపాలిటీలకు ఆధాయం పెరగనుండగా ప్రజలపై మాత్రం భారం పడుతుందన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. 


పూర్తయిన మూడేళ్ల గడువు

15 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న పట్టణాలను మేజర్‌ పంచాయతీ నుంచి మున్సిపాలిటీలుగా మార్చుతూ ప్రభుత్వం మూడేళ్ల క్రితం నిర్ణయం తీసుకున్నది. మెదక్‌ జిల్లాలో నర్సాపూర్‌, తూప్రాన్‌, రామాయంపేట మున్సిపాలిటీలుగా ఏర్పడ్డాయి. మున్సిపాలిటీగా ఏర్పడినా మూడేళ్ల వరకు పంచాయతీ చట్ట ప్రకారమే పన్నులు వసులు చేయనున్నట్టు అప్పట్లో వెల్లడించారు. గడువు ముగియ నుండటంతో ఇకపై మున్సిపల్‌ చట్టం ప్రకారం పన్నులు వసులు చేయనున్నారు. మున్సిపల్‌ సిబ్బంది పెరిగిన పన్నులకు సంబంధించిన నోటీసులను ఇంటింటికి తిరిగి  అందజేస్తున్నారు. గడువులోపు పన్నులు కట్టాలని పేర్కొంటున్నారు. పన్నులు కట్టడం ఆలస్యం చేస్తే అదనపు భారం పడుతుందని పేర్కొంటుడటంతో పట్టణ ప్రజలు అయోమయానికి లోనవుతున్నారు. 


పెరగనున్న భారం

పంచాయతీలుగా ఉన్నప్పుడు స్థానిక ప్రజాప్రతినిధుల సూచనమేరకు ఇంటి నిర్మాణాన్ని పరిశీలించి అంచనావేసి పన్ను వసులు చేసేవారు. నర్సాపూర్‌ పట్టణంలో 60 శాతం ఇళ్లకు పన్ను వేయి రూపాయలు కూడా దాటలేదు. మున్సిపల్‌ చట్టం ప్రకారం ప్రతీ నిర్మాణంతో పాటు ఖాళీ స్థలాలను కొలిచి పన్ను అంచనాలు సిద్ధం చేశారు. దీనిప్రకారం ఇప్పటి వరకు చెల్లించిన దానితే పోల్చితే పన్ను ఐదింతలు పెరిగినట్టు ప్రజలు పేర్కొంటున్నారు. మొన్నటి వరకు రూ. 400 చెల్లించినవారికి  రెండువేల రూపాయలు చెల్లించాలని నోటీసులు వచ్చాయి. 


మున్సిపాలిటీలకు పెరిగిన ఆదాయం

పంచాయతీగా ఉన్నప్పుడు నర్సాపూర్‌లో రూ. 70 లక్షల వరకు పన్నులు వచ్చేవి. ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలో  రూ.2కోట్లకు పైగా పన్ను వస్తుందని అంచనా. మరోవైపు కొత్త ఇంటి నిర్మాణానికి రూ. 50వేలకు తక్కువకాకుండా ఛార్జిలు విధిస్తుండటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు బావురుమంటున్నారు. మున్సిపాలిటీగా మారితే తమ పట్టణంలో సౌకర్యాలు, సదుపాయలు పెరుగుతాయని, అభివృద్ధి వేగంగా జరుగుతుందనుకుంటే పన్నుల రూపంలో పెనుభారం పడుతుందన్నదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సదుపాయాలకు బదులు పన్నుల భారం పెరిగిందని వాపోతున్నారు.

Advertisement
Advertisement