పేదల ఇళ్లను పంపిణీ చేయాలి

ABN , First Publish Date - 2020-07-07T09:56:16+05:30 IST

టీడీపీ హయాంలో పేదల కోసం నిర్మించిన ఎన్టీఆర్‌ గృహ సముదాయాల్లోని ఇళ్లను వెంటనే పంపిణీ చేయాలంటూ సోమవారం పలు ప్రాంతాల్లో

పేదల ఇళ్లను పంపిణీ చేయాలి

జిల్లాలో పలు ప్రాంతాల్లో టీడీపీ ధర్నాలు

పట్టణవాసులను పల్లె ఓటర్లుగా మార్చేందుకు బొల్లా వ్యూహం : జీవీ


వినుకొండ టౌన్‌, జూలై 6: టీడీపీ హయాంలో పేదల కోసం నిర్మించిన ఎన్టీఆర్‌ గృహ సముదాయాల్లోని ఇళ్లను వెంటనే పంపిణీ చేయాలంటూ సోమవారం పలు ప్రాంతాల్లో టీడీపీ నాయకులు ధర్నాలు చేశారు. ఇందులో భాగంగా వినుకొండలోని వెల్లటూరు రోడ్డులో ఎన్‌టీఆర్‌ గృహనిర్మాణ సముదాయంను నాయకులతో కలిసి టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో 4096 ఇళ్లను నిర్మించామని, వైసీపీ అధికారంలోకి రావడంతో వాటిని నిలిపివేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్బన్‌ హౌస్‌లను పూర్తి చేసి పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు.


గత ప్రభుత్వ హయాంలో సింగరచెరువు అభివృద్ధి కోసం రూ.159 కోట్లు నిధులు మంజూరైనప్పటికీ ఇప్పటి వరకు టెండర్లు ఎందుకు పిలవలేదన్నారు.  పట్టణవాసులను పల్లె ఓటర్లుగా మార్చేందుకే ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వెంకుపాలెం సమీపంలోని తన భూమిలో పట్టాలు ఇచ్చేందుకు పథక రచన చేశారని తెలిపారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లను పేదలకు ఇస్తే తమకు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని లబ్ధిదారులకు డీడీలు వెనక్కి ఇస్తున్నారన్నారు. అర్బన్‌ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను వైసీపీకి చెందిన కార్యకర్తలకు ఇచ్చేందుకు కుట్ర జరుగుతుందని తెలిపారు.  


గత ప్రభుత్వం పేదలకు కోసం నిర్మించిన వెంటనే పంపిణీ చేయాలని ఎమ్మెల్సీ డాక్టర్‌ ఏఎస్‌ రామకృష్ణ, పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కోవెలమూడి రవీంద్రలు డిమాండ్‌ చేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం నిరసన తెలిపారు. రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో భారీ కుంభకోణానికి వైసీపీ నేతలు తెరలేపారన్నారు. టీడీపీ హయాంలో నిర్మించిన గృహాల లబ్ధిదారుల ఎంపికలో ఏదో జరిగిందంటూ అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు   మన్నవ సుబ్బారావు, మానుకొండ శివప్రసాద్‌, కనపర్తి శ్రీనివాసరావు, రావిపాటి సాయి, లాల్‌వజీర్‌, ధారునాయక్‌, కసుకుర్తి హనుమంతరావు, ముత్తినేని రాజేష్‌, బెల్లంకొండ సురేష్‌, వేగుంట రాణి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-07T09:56:16+05:30 IST