రైతు ఉద్యమానికి సై

ABN , First Publish Date - 2021-10-20T07:07:37+05:30 IST

‘వైసీపీ రైతు వ్యతిరేక ప్రభుత్వం. ప్రజలను అష్టకష్టాలు పెడుతోంది. సంక్షేమం పట్టడం లేదు. వ్యవసాయ బడ్జెట్‌ అమలు చేయడం లేదు. నీటి సరఫరా కూడా సక్రమంగా లేదు. పండించిన ధాన్యాన్ని కొనేవాడులేడు. కొన్నవాడికి సకాలంలో డబ్బు ఇవ్వడం లేదు. అందుకే మేము అన్ని వర్గాల మద్దతుతో రైతుల తరపున పోరాటానికి సిద్ధమవుతున్నాం’ అని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి స్పష్టం చేశారు.

రైతు ఉద్యమానికి సై
సమావేశంలో మాట్లాడుతున్న బుచ్చయ్య చౌదరి

  • అన్ని వర్గాల మద్దతుతో రైతుల తరపున పోరాడతాం
  • టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి
  • ఈ నెల 25లోపు తెలుగు రైతు కమిటీలు పూర్తి చేయాలి
  • తెలుగు రైతు ఉభయ గోదావరి జిల్లాల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి

రాజమహేంద్రవరం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ రైతు వ్యతిరేక ప్రభుత్వం. ప్రజలను అష్టకష్టాలు పెడుతోంది. సంక్షేమం పట్టడం లేదు. వ్యవసాయ బడ్జెట్‌ అమలు చేయడం లేదు. నీటి సరఫరా కూడా సక్రమంగా లేదు. పండించిన ధాన్యాన్ని కొనేవాడులేడు. కొన్నవాడికి సకాలంలో డబ్బు ఇవ్వడం లేదు. అందుకే మేము అన్ని వర్గాల మద్దతుతో రైతుల తరపున పోరాటానికి సిద్ధమవుతున్నాం’ అని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి స్పష్టం చేశారు. తెలుగు రైతు విభాగం ఉభయ గోదావరి జిల్లాల నేతలతో నగరంలోని ప్రియాంక హోటల్‌లో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘వ్యవసాయ పనిముట్లు కూడా ఇవ్వడం లేదు. డీజిలు ధర దారుణంగా పెరిగింది. ఈ ప్రభుత్వం విద్యుత్‌ రంగంలో కూడా విఫలమైంది. అప్రకటిత కోతలతో వేధిస్తోంది. వ్యవసాయ రంగానికి సంబంధించి స్వామినాథ్‌ కమిటీ సిఫార్సులను బుట్టదాఖలా చేశారు. మద్దతు ధర కూడా నిర్ణయించలేదని స్థితిలో ఉంది’ అని విమర్శించారు. పట్టిసీమను విమర్శించిన వైసీపీ ప్రభుత్వం పోలవరం ఎగువ భాగంలోని డెడ్‌ వాటర్‌లో ఎత్తిపోతల పథకం నిర్మించాలని ప్రయత్నిస్తోందని, ఇది జరిగితే డెల్టా ఎండిపోతుందని గోరంట్ల ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్‌ రాక్షస పాలన చేస్తున్నాడన్నారు. దుర్మార్గుడు, సైకో మెంటాలటీ, ఆయనో రాజు, విజయసాయి సామంతరాజు, వీరికి కొందరు సంపద దోచిపెడుతున్నారని విమర్శించారు. వ్యవసాయానికి, రైతులకు కష్టాలు లేకుండా రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని ప్రకటించిన జగన్‌ ఏమయ్యారని ప్రశ్నించారు. ఎరువులు అందుబాటులో లేవు, పొటాష్‌ అసలు లేదు. అన్ని విధాలుగా రైతులు నష్టపోతున్నారని, ఈ నేపథ్యంలో గ్రామ స్థాయి నుంచీ రైతు ఉద్యమాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు పిలుపుమేరకు  నియోజకవర్గానికి 18 మంది, మండలానికి  10 మంది, గ్రామానికి ఇద్దరు చొప్పున రైతు కమిటీలు వేసి, ఎక్కడికక్కడ రైతుల తరపున పోరాటాలు చేస్తామన్నారు. ఈ నెల 25లోపు అన్ని కమిటీలు పూర్తవుతాయన్నారు. తాడేపల్లి గూడెంలో పాతూరి రాంప్రసాద్‌ చౌదరి అన్ని కమిటీలు వేశారని, ఆయన స్ఫూర్తితో అందరూ కమిటీలను వెంటనే పూర్తి చేయాలని కోరారు. సమావేశంలో మాజీ మంత్రి, టీడీపీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ అధ్యక్షుడు కేఎస్‌ జవహర్‌, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నేతలు వెలుగుబంటి ప్రసాద్‌, మార్గాని సత్యనారాయణ, గంగిన హనుమంతరావు, సిరసపల్లి నాగేశ్వరరావు, గోవింద్‌, మార్ని వాసు, ప్రత్తిపాటి రామారావు, మట్టా శ్రీను, బొప్పన శ్రీను, పడాల ఆదినారాయణరెడ్డి, వరగోగుల వెంకటేశ్వరరావు, పులగం అచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T07:07:37+05:30 IST