10 రోజుల్లో 500 కోట్లు దోచేశారు

ABN , First Publish Date - 2021-06-19T05:01:42+05:30 IST

ఇసుక మాఫియా కేవలం పదిరోజుల్లో రూ.500 కోట్లు దోచేసిందని, కలెక్టర్‌ తక్షణం చర్యలు తీసుకోకపోతే హైకోర్టులో తేల్చుకుంటామని టీడీపీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ హెచ్చరించారు.

10 రోజుల్లో 500 కోట్లు దోచేశారు
కలెక్టర్‌కు వినతిపత్రం అందచేస్తున్న అబ్దుల్‌ అజీజ్‌

కలెక్టర్‌ స్పందించకుంటే హైకోర్టుకే...

ఇసుక మాఫియాపై టీడీపీ నేత అజీజ్‌ ధ్వజం


నెల్లూరు(హరనాథపురం), జూన్‌ 18 : ఇసుక మాఫియా కేవలం పదిరోజుల్లో రూ.500 కోట్లు దోచేసిందని, కలెక్టర్‌ తక్షణం చర్యలు తీసుకోకపోతే హైకోర్టులో తేల్చుకుంటామని టీడీపీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ హెచ్చరించారు. ఇసుక మాఫియాపై ఆయన శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ చక్రధర్‌బాబుకు వినతిపత్రం అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గొల్లకందుకూరు రీచ్‌లో ఇసుక మాఫియా నిబంధనలను ఉల్లంఘించి తవ్వకాలు జరిపిందని ఆరోపించారు. అక్కడ 25 ఎకరాల్లో మాత్రమే తవ్వకాలకు అనుమతి ఉండగా 10 రోజుల్లోనే 48 వేల టన్నుల ఇసుకను తవ్వేశారని ఆరోపించారు. స్టాక్‌యార్టులో ఒక్క రికార్డు కూడా లేదన్నారు. ఆ ఇసుకకు సంబంధించి ప్రభుత్వానికి కట్టాల్సిన మొత్తం రూ.225 కోట్లని, అదే మార్కెట్‌ విలువ రూ.500 కోట్లని వివరించారు. ఒక్క రీచ్‌లోనే ఇంత అవినీతి జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఎంత జరుగుతోందో ప్రజలే ఆలోచించాలన్నారు. అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల అండదండలతో ఇసుక మాఫియా దోచేస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమం లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జన్ని రమణయ్య, జలదంకి సుధాకర్‌, సాబీర్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు. 

మైనింగ్‌ అధికారుల మొద్దునిద్ర

నెల్లూరు(వెంకటేశ్వరపురం): ఇసుక రీచ్‌లను జేపీ సంస్థకు అప్పగించినప్పటి నుంచి మైనింగ్‌ అధికారులు మొద్దునిద్రపోతూ పర్యవేక్షణ మరిచిపోయారని అజీజ్‌ ధ్వజమెత్తారు. ఇసుక అక్రమ తవ్వకాలపై ఆయన శుక్రవారం మైనింగ్‌శాఖ కార్యాలయంలో డీడీ ప్రసాద్‌ని ప్రశ్నించారు. భారీ స్థాయిలో అక్రమ తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం ఏమిటన్నారు. దీనికి డీడీ స్పందిస్తూ రీచ్‌లలో తవ్వకాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. 

Updated Date - 2021-06-19T05:01:42+05:30 IST