మీ సమస్యలు తెలుసుకోవడానికి వచ్చా...రైతులతో లోకేష్

ABN , First Publish Date - 2020-12-05T19:37:48+05:30 IST

జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పర్యటన కొనసాగుతోంది.

మీ సమస్యలు తెలుసుకోవడానికి వచ్చా...రైతులతో లోకేష్

గుంటూరు: జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈతేరు గ్రామ రైతులతో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. ‘‘మీ సమస్యలు తెలుసుకోవడానికే వచ్చా’’నంటూ రైతులతో లోకేష్ అన్నారు. అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు రైతులకు సమస్యలు లేవు, రైతులంతా సంతోషంగా ఉన్నారు అని ప్రకటించారని అయితే... అందరూ సంతోషంగా ఉన్నారా? అని రైతులను లోకేష్ అడిగారు.


రైతులు మాట్లాడుతూ... వరుస తుఫాన్లు, వరదలతో నష్టపోయి, సహాయం అందక బ్రతకలేని పరిస్థితి ఉంది అంటూ లోకేష్‌‌కు రైతులు విన్నవించుకున్నారు. ఇంట్లో బంగారం పెట్టి అప్పు తీసుకొని పెట్టుబడి పెట్టామని... కౌలు రైతులు పూర్తిగా నష్టపోయామని... కనీసం రైతు భరోసా కూడా అందలేదని వాపోయారు. కౌలుకు వ్యవసాయం చేసేది ఎక్కువుగా ఎస్సీ, బీసీ రైతులే అని... కనీసం కౌలుదారు కార్డులు కూడా ఇవ్వడం లేదని తెలిపారు. ఈ-క్రాప్‌లో నమోదు చెయ్యడం లేదని తెలిపారు. మీటర్లు పెడితే ఒప్పుకునేది లేదని... మీటర్లు పెడితే బిల్లులు కట్టమని వేధిస్తారని చెప్పారు. సున్నా వడ్డీ అంటున్నారు కానీ వడ్డీ విపరీతంగా పెంచేశారని లోకేష్‌తో ఈతేరు గ్రామం రైతులు తమగోడును వెల్లబోసుకున్నారు. 


రైతులతో లోకేష్ మాట్లాడుతూ.... రైతులు సంతోషంగా ఉన్నారనే భ్రమలో ఉన్నారని... మంత్రులు రారు, సహాయం ఎంత ఇస్తారో ప్రకటించరని మండిపడ్డారు. జగన్ రెడ్డి గాల్లో తిరిగి, గాలి కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వరని, ఇన్స్యూరెన్స్ రాదన్నారు. తుఫానుతో వరి పూర్తిగా దెబ్బతిందని, వచ్చే రాబడి కంటే పంట తియ్యడానికి ఎక్కువ ఖర్చు అవుతుందని.. ఎటువంటి సహాయం ఇవ్వకపోగా రైతుల నెత్తిన మీటర్ల మోత పెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీటర్లు పెడితే ఊరుకోమని... మీటర్లు పగలగొట్టి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. 15 లక్షల మందికి రైతు భరోసా ఇస్తామని కనీసం లక్ష మందికి కూడా ఇవ్వలేదన్నారు.


రైతులంతా ధైర్యంగా ఉండాలని... తమ తరుపున న్యాయం జరిగే వరకూ పోరాడతామని స్పష్టం చేశారు. ఇది దున్నపోతు ప్రభుత్వం, రైతుల్ని ఆదుకోవాలని అసెంబ్లీ, మండలి లో నిలదీస్తే కనీసం స్పందించలేదన్నారు. జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలస్ నుండి బయటకు వస్తే రైతుల సమస్యలు తెలుస్తాయని తెలిపారు. ఖరీఫ్, రబీ ముందే గిట్టుబాటు ధరలు ప్రకటిస్తామని అన్నారని... ఇప్పుడు అసలు గిట్టుబాటు ధరే లేదని విమర్శించారు. హెక్టారుకు 30 వేలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని, రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇచ్చి కొనాలని లోకేష్ డిమాండ్ చేశారు. 




Updated Date - 2020-12-05T19:37:48+05:30 IST