నిద్రపోవడం మానీ...కేసీఆర్‌కు ఫోన్ చేయండి: లోకేష్

ABN , First Publish Date - 2021-05-14T17:52:54+05:30 IST

పీలో కోవిడ్ బాధితులకు అందుతున్న వైద్యం పట్ల ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

నిద్రపోవడం మానీ...కేసీఆర్‌కు ఫోన్ చేయండి: లోకేష్

అమరావతి: ఏపీలో కోవిడ్ బాధితులకు అందుతున్న వైద్యం పట్ల ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీ అంబులెన్స్‌లు తెలంగాణలోకి వెళ్లేందుకు అనుమతి వచ్చేలా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రజల ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేశారు.  ‘‘ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిగారూ! మ‌న‌ రాష్ట్రంలో వైద్యం దొరికితే ప్ర‌జ‌లు తెలంగాణ‌కి ఎందుకు వెళ‌తారు? ఇక్క‌డుంటే ప్రాణాలు నిల‌వ‌వు, ప‌క్క రాష్ట్రానికి వైద్యానికి కూడా వెళ్లే అవకాశం లేదు. మీ మంత్రులు, ఎమ్మెల్యేల‌కు కోవిడ్ వ‌స్తే ఆగ‌మేఘాల‌పై హైద‌రాబాద్ పోయి అక్క‌డి ఆస్ప‌త్రుల్లో చేర‌తారు.  ప్ర‌జ‌లు త‌మ ప్రాణాలు కాపాడుకునేందుకు హైద‌రాబాద్ వెళ్లే అవ‌కాశం మాత్రం ఇప్పించ‌లేరా? ఇంత చేత‌గాని, ద‌ద్ద‌మ్మ ముఖ్య‌మంత్రి ఏ రాష్ట్రానికీ ఉండకూడ‌దు. తాడేప‌ల్లి కొంప‌లో ఎన్ని గంట‌లు నిద్ర‌పోతారు గానీ, లేచి కేసీఆర్ గారికి ఫోన్‌చేసి  అనుమ‌తులు తెప్పించండి. తెలంగాణ ప్ర‌భుత్వం మాన‌వ‌తా ధృక్ప‌థంతో అత్య‌వ‌స‌రంగా ప‌రిగ‌ణించి కోవిడ్ పేషెంట్ల అంబులెన్సుల‌ను అనుమ‌తించాలి. ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించిన వారికి మెరుగైన వైద్యం కోసం మాత్ర‌మే హైద‌రాబాద్ త‌ర‌లిస్తారు. తెలంగాణ ప్ర‌భుత్వం దీనిని దృష్టిలో వుంచుకుని కోవిడ్ పేషెంట్ల అంబులెన్సుల‌ను ఆప‌కుండా స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇవ్వాలి. గోల్డెన్ అవ‌ర్స్‌లోగా వారు ఆస్ప‌త్రికి చేర‌గ‌లిగితే కొన ఊపిరితో ఉన్న ప్రాణాలు నిలబడతాయి’’ అని లోకేష్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-05-14T17:52:54+05:30 IST