నిర్బంధ చిత్రం!

ABN , First Publish Date - 2021-10-22T06:43:00+05:30 IST

అరెస్టు చేసింది నిత్యం ప్రజల మధ్య ఉండే ఒక రాజకీయ నాయకుడిని..

నిర్బంధ చిత్రం!
కట్టుదిట్టమైన భద్రత నడుమ విజయవాడ ప్రభుత్వాసుపత్రికి పట్టాభి

పట్టాభిని జైలుకు తరలించే వరకూ అడుగడుగునా పోలీసుల అతి

బుధవారం రాత్రంతా తోట్లవల్లూరు స్టేషన్లో..

గ్రామంలో పోలీసు ఆంక్షలు

విజయవాడకు తరలిస్తూ ఓవరాక్షన్‌

పట్టాభి ప్రయాణించిన కారు అద్దాలకు తెరలు

టీడీపీ నేతలు కలిసేందుకూ అనుమతించని వైనం


అరెస్టు చేసింది నిత్యం ప్రజల మధ్య ఉండే ఒక రాజకీయ నాయకుడిని.. కానీ పోలీసుల వైఖరి అలా లేదు.. టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిని బుధవారం అరెస్టు చేయడం దగ్గర నుంచి గురువారం రిమాండ్‌ విధించి, మచిలీపట్నం సబ్‌జైల్‌కు తరలించడం వరకూ పోలీసులు అతిగానే వ్యవహరించారు. పట్టాభిని ఉంచిన తోట్లవల్లూరు స్టేషన్‌కు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గ్రామంలో అడుగడుగునా ఆంక్షలు విధించారు. అక్కడి నుంచి విజయవాడ తరలించే సమయంలో కారు అద్దాలకు తెరకట్టేశారు. పట్టాభిని కలిసేందుకు వచ్చిన టీడీపీ ముఖ్యనేతలను సైతం అడ్డుకున్నారు. 


విజయవాడ, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి అరెస్టు మాదిరిగానే ఆయనను న్యాయస్థానంలో హాజరు పరచడంలోనూ హైడ్రామా సాగింది. బుధవారం రాత్రి నుంచి పట్టాభిని తోట్లవల్లూరు స్టేషన్‌లో ఉంచిన పోలీసులు గురువారం ఉదయం ఆయనను భారీ బందోబస్తు మధ్య కరకట్ట మార్గంలో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పట్టాభి ఎవరికీ కనిపించకుండా ఆయనను తరలించిన కారు అద్దాలకు తెరలు కట్టారు. ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మూడో ఏసీఎంఎం కోర్టుకు తరలించారు. ఆ సమయంలో కోర్టు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. పట్టాభిని కోర్టుకు తీసుకువస్తున్నారన్న సమాచారం తెలియడంతో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులు కార్యకర్తలతో అక్కడికి చేరుకున్నారు. కార్యకర్తలను పోలీసులు బయటకు పంపే ప్రయత్నం చేయగా, పట్టాభి తరపున న్యాయవాది లక్ష్మీనారాయణ వాగ్వాదానికి దిగి, వారిని కోర్టు హాలు వద్దకు తీసుకెళ్లారు. కోర్టులో పట్టాభితో ప్రత్యేకంగా మాట్లాడేందుకు న్యాయవాదులు ప్రయత్నించగా, పోలీసులు అంగీకరించలేదు. దీంతో వారి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. పట్టాభికి బెయిల్‌ వస్తుందని టీడీపీ శ్రేణులు భావించాయి. అయితే ఆయనకు రిమాండ్‌ విధించ డంతో మచిలీపట్నంలోని సబ్‌జైలుకు తరలించారు. అక్కడికి వెళ్లే సరికి చీకటి పడడంతో పోలీసులు దాదాపు నెట్టుకుంటూ తీసికెళ్లారు. పంపారు. 


స్టేషన్లో పట్టాభి.. గ్రామం చుట్టూ పోలీసులు.... తోట్లవల్లూరులో విచిత్ర స్థితి


తోట్లవల్లూరు, అక్టోబరు 21 : విజయవాడలో అరెస్ట్‌ చేసిన టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిని బుధవారం రాత్రి కట్టుదిట్టమైన భద్రత నడుమ తోట్లవల్లూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఇదే సమయంలో పోలీసులు గ్రామంలోకి వచ్చే అన్ని దారులనూ దిగ్బంధనం చేశారు. పొలాల నుంచి ఇళ్లకు వచ్చే రైతులను సైతం అడ్డుకున్నారు. మీడియాను సైతం అడ్డుకున్నారు. ఓ విలేకరి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లేందుకు ప్రయత్నించగా, కేసుపెట్టి లోనేస్తాం అంటు బెదిరింపులకు దిగారు. పట్టాభిని కలుసుకునేందుకు వచ్చిన మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమలను గ్రామంలోకి రానివ్వకుండా కరకట్టపైనే అడ్డుకున్నారు. 


టీడీపీ నేతల నిరసన

గుడివాడ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, స్థానిక టీడీపీ నేతలు వీరంకి వెంకట గురుమూర్తి, మురళి తదితరులు గురువారం ఉదయం నుంచి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లే రహదారిపై బైఠాయించారు. వీరి ఆందోళన కొనసాగుతుండగానే పట్టాభిని విజయవాడ తరలించారు. ఆయన కనిపించకుండా కారు అద్దాలకు తెర అడ్డుపెట్టారు. కారును అడ్డుకునేందుకు ప్రయత్నించిన నాయకులను పోలీసులు పక్కకు లాగిపడేశారు. 



Updated Date - 2021-10-22T06:43:00+05:30 IST