నిగ్గు తేల్చేందుకే..

ABN , First Publish Date - 2021-07-31T05:52:00+05:30 IST

తెలుగు తమ్ముళ్లు పట్టువీడలేదు.

నిగ్గు తేల్చేందుకే..
కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేస్తున్న టీడీపీ నేతలు నెట్టెం రఘురామ్‌, కొనకళ్ల, కొల్లు రవీంద్ర తదితరులు

నేడు కొండపల్లికి తెలుగు తమ్ముళ్లు

ఫారెస్ట్‌లో అక్రమ తవ్వకాలపై టీడీపీ నిజనిర్థారణ కమిటీ 

మైనింగ్‌, అటవీశాఖ అధికారులను పంపాలని కలెక్టర్‌కు వినతి

బయటకు వస్తే అరెస్టు చేస్తాం..

నిజనిర్ధారణ కమిటీ సభ్యులకు పోలీసుల నోటీసులు

ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై టీడీపీ నేతల ఆగ్రహం 


తెలుగు తమ్ముళ్లు పట్టువీడలేదు. మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు రిమాండ్‌కు పంపిన నేపథ్యంలో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు.  కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్‌ వ్యహారాన్ని సాక్ష్యాధారాలతోసహా బయటపెట్టేందుకు ‘నిజ నిర్ధారణ’తో సన్నద్ధమయ్యారు.. బయటకు వస్తే అరెస్టు చేస్తామంటూ టీడీపీ నాయకులకు పోలీసులు ముందస్తుగా నోటీసులు జారీ చేసి, హౌస్‌ అరెస్టులు చేశారు. పోలీసు నిర్బంధాన్ని ఛేదించుకుని తాము కొండపల్లి వెళ్లి తీరతామని టీడీపీ నాయకులు ప్రకటించడంతో పరిస్థితి ఉత్కంఠ భరితంగా మారింది. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై దాడి,  అక్రమ అరెస్టుపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కొండపల్లి రిజర్వ్‌ ఫారెస్టు నుంచి వైసీపీ నాయకులు రూ. కోట్ల విలువైన గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తున్న తీరును పరిశీలించేందుకు వెళ్లిన దేవినేని ఉమాపై వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడితే.. బాధితుడైన దేవినేని ఉమాపైనే పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు పంపించిన విషయం తెలిసిందే. దేవినేనిపై దాడి నేపథ్యం, వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేయాలని టీడీపీ నిర్ణయించింది. కొండపల్లి అటవీ ప్రాంతంలో జరుగుతున్న గ్రావెల్‌ తవ్వకాలపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ సీనియర్‌ నాయకులతో నిజనిర్ధారణ కమిటీని నియమించారు. ఈ కమిటీ శనివారం ఉదయం 10 గంటలకు విజయవాడ నుంచి బయల్దేరి కొండపల్లి వెళ్లనుంది. కొండపల్లి ఫారెస్టులో పర్యటించి వాస్తవాలను తెలుసుకునేందుకు తమ పార్టీ నిజనిర్ధారణ కమిటీతోపాటు ప్రభుత్వం తరపున మైనింగ్‌, అటవీశాఖ అధికారులను పంపించాలని జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు శుక్రవారం కలెక్టర్‌ నివాస్‌ను కలిసి కోరారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు, మాజీ మంత్రి నెట్టెం రఘురామ్‌, మచిలీపట్నం పార్లమెంటు అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మరో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, పి.అశోక్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్‌, శ్రీరాం రాజగోపాల్‌ తాతయ్య, జయమంగళ వెంకటరమణ, నియోజకవర్గ ఇన్‌చార్జిలు కాగిత కృష్ణప్రసాద్‌, శావల దేవదత్‌ తదితర నాయకులు కలెక్టరును కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం నిరంకుశ వైఖరితో ముందుకు సాగుతోందంటూ ధ్వజమెత్తారు. వైసీపీ నాయకుల అక్రమాలను ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి జైలుకు పంపారని మండిపడ్డారు. ఇప్పుడు అధికారం చేతిలో ఉందని చెలరేగిపోతున్న వైసీపీ నాయకులు రేపు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకు రెట్టింపు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 


నిజనిర్ధారణ కమిటీ సభ్యుల గృహనిర్బంధం

కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ తవ్వకాల పరిశీలనకు వెళ్లనున్న టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. ఇంటి నుంచి బయటకు వస్తే అరెస్టు చేస్తామంటూ వారికి నోటీసులు జారీ చేశారు. పదిమంది సీనియర్‌ నాయకులతో టీడీపీ అధినేత చంద్రబాబు నియమించిన నిజనిర్ధారణ కమిటీలో జిల్లాకు చెందిన పొలిట్‌బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, మాజీమంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు. ఈ ముగ్గురు నాయకులను శుక్రవారం సాయంత్రం నుంచే పోలీసులు గృహనిర్బంధం చేశారు. గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనందబాబును హౌస్‌ అరెస్టు చేశారు. ఈ నాయకుల ఇళ్ల చుట్టూ పోలీసు పహారా ఏర్పాటు చేశారు. 


ఏ చట్టం కింద నిర్బంధిస్తారు? : బొండా ఉమ 

తమను ఏ చట్టంలోని ఏ సెక్షన్‌ కింద హౌస్‌ అరెస్టులు చేస్తారో పోలీసులు చెప్పాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు. తన ఇంటి చుట్టూ పోలీసులను కాపలా ఉంచి బయటకు వస్తే అరెస్టు చేస్తామంటూ పోలీసుల అధికారులు శుక్రవారం సాయంత్రం నోటీసులు ఇవ్వడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. వైసీపీ నాయకుల అక్రమాలను వెలుగులోకి తెస్తున్న టీడీపీ నేతల నోరు నొక్కేందుకు ప్రభుత్వం పోలీసులను, అధికారులను వాడుకుంటోందని విమర్శించారు. ప్రభుత్వ అక్రమాలు, అన్యాయాలు వెలుగులోకి వస్తాయనే భయంతోనే టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులను హౌస్‌ అరెస్టులు చేశారని, టీడీపీని చూసి ప్రభుత్వం భయపడుతోందని పేర్కొన్నారు. పోలీసుల నిర్బంధాన్ని ఛేదించుకుని తాము కొండపల్లి వెళ్లి తీరతామని స్పష్టం చేశారు.  


ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మైనింగ్‌ పరిశీలనకు అంగీకరించాలి : కొల్లు రవీంద్ర

ముఖ్యమంత్రి జగన్‌ పోలీసులను అడ్డం పెట్టుకుని పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. తనను హౌస్‌ అరెస్టు చేయడంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ కొండపల్లిలో అక్రమ మైనింగ్‌ జరగకపోతే టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యుల పర్యటనను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. కొండపల్లి రిజర్వ్‌ ఫారెస్టులో అక్రమ మైనింగ్‌ జరుగుతోందని, అది బయటపడుతుందనే మాజీ మంత్రి దేవినేని ఉమాపై వైసీపీ దుండగులు దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు అక్రమ మైనింగ్‌ చేయాల్సిన అవసరం లేదని చిలకపలుకులు పలికిన మంత్రులు తమను హౌస్‌ అరెస్టులు చేయడంపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పోలీసులను ఉపయోగించుకుంటూ ప్రశ్నిస్తున్న తమ గొంతులను నొక్కాలని చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులను కొండపల్లిలో మైనింగ్‌ ప్రాంత పరిశీలనకు అంగీకరించాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు ఎన్ని నిర్బంధాలు విధించినా శనివారం కొండపల్లి మైనింగ్‌ ప్రాంతానికి వెళ్లి తీరతామన్నారు.

Updated Date - 2021-07-31T05:52:00+05:30 IST