అభివృద్ధిపై చర్చకు సిద్ధం

ABN , First Publish Date - 2021-10-23T06:34:06+05:30 IST

అభివృద్ధిపై చర్చకు సిద్ధం

అభివృద్ధిపై చర్చకు సిద్ధం
విలేకరులతో మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

ఎమ్మెల్యే వసంతకు కొండపల్లి ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదు

అభద్రతాభావంతోనే ఉమాపై అసత్య ప్రచారం: టీడీపీ కొండపల్లి అధ్యక్షుడు చుట్టుకుదురు శ్రీనివాసరావు

ఇబ్రహీంపట్నం, అక్టోబరు 22: కొండపల్లి, ఇబ్రహీంపట్నంలో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, అవినీతి చక్రవర్తి ఎమ్మెల్యే వసంతకు కొండపల్లి మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదని టీడీపీ కొండపల్లి మున్సిపాలిటీ అధ్యక్షుడు చుట్టుకుదురు శ్రీనివాసరావు అన్నారు. రెండున్నర సంవత్సరాలకే ఎమ్మెల్యే వసంత అభద్రాతాభావంతో కొట్టుమిట్టాడుతూ.. నిత్యం మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ నేతలు మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత మాత్రమే కొండపల్లి ప్రజలు గాలి పీల్చుకుని, నీళ్లు తాగుతున్నారనే భ్రమలో వసంత ఉన్నారని ఎద్దేవా చేశారు.  సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల వలన ప్రజలకు పెద్దగా ప్రయోజనం లేదని అవి వైసీపీ కార్యకర్తలు సేద తీరేందుకు మాత్రమే ఉపయోగపడతాయని వారు విమర్శించారు. మున్సిపల్‌ నిధులు, 14, 15 ఆర్థిక సంఘం నిధులతో సాధారణ పనులు జరుగుతున్నాయి తప్ప అభివృద్ధి కోసం ఎమ్మెల్యే నిధులు ఎన్ని ఖర్చుచేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ హయాంలో నియోజకవర్గ వ్యాప్తంగా 12వేలకు పైనే నివేశన స్థలాల పట్టాలు ఇచ్చామన్నారు. కొండపల్లిలో వైసీపీ నేతలు నిబంధనలు ఉల్లఘించి దగ్గర ఉండి మరీ మద్యాన్ని అమ్మకాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌ విచ్చలవిడిగా దొరుకుతున్నాయని వాటిని ప్రశ్నించినందుకు భౌతిక దాడులు చేయటం సిగ్గుచేటు అన్నారు. పేదల ఇళ్ల మెరక పేరుతో కోట్ల రుపాయలు అక్రమార్జనకు పాల్పడలేదా అని ప్రశ్నించారు. చివరకు రైతులకు అందాల్సిన పంట బీమా సొమ్మును కూడ మీ అనుచరులు మింగేశారని విమర్శించారు. ఇసుక, మద్యం, గ్రావెల్‌, ఇళ్ల పట్టాల్లో డబ్బులు వసూలు చేయటం, భూముల కొనుగోలులో కమీషన్లు దండుకోవటం, పంట బీమా సొమ్మును తినేయడం మీకు తెలిసే జరుగుతున్నాయి కదా అని ఎమ్మెల్యేని ప్రశ్నించారు. ధరణికోట విజయలక్ష్మి, రావి మణిరాజ్‌(ఫణి), కొత్తపల్లి ప్రకాశ్‌, ఎం.ఎ.హైదర్‌, కూచిపూడి దిలీప్‌ కుమార్‌, నల్లమోతు సుందరం, కోయ వెంకట్రావు, మైలా సైదులు, కూరేటి చక్రవర్తి, కొరటా శ్రీనివాసరావు పాల్గొన్నారు.



Updated Date - 2021-10-23T06:34:06+05:30 IST