ఆర్యవైశ్యులకు న్యాయం చేసింది టీడీపీనే

ABN , First Publish Date - 2020-11-23T06:15:39+05:30 IST

ఆర్యవైశ్యులకు న్యాయం చేసింది టీడీపీనే

ఆర్యవైశ్యులకు న్యాయం చేసింది టీడీపీనే
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్‌ తాతయ్య

టీడీపీ ఆర్యవైశ్య నాయకులు

విద్యాధరపురం, నవంబరు 22 : ఆర్యవైశ్యులకు తెలుగుదేశం పార్టీ ఒక్కటే న్యాయం చేసిందని, వైసీపీ ప్రభుత్వం వ్యాపారులను ఇబ్బందులు పెడుతోందని, చేతగాని మంత్రిగా వెలంపల్లి శ్రీనివాసరావు మిగిలిపోయారని టీడీపీ ఆర్యవైశ్య నాయకులు మండిపడ్డారు. టీడీపీ ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం భవానీపురంలోని ఓ హోటల్‌లో ఆదివారం నిర్వహించడానికి ప్రయత్నించగా, మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పోలీసులతో అడ్డుకట్ట వేయించారు. దీంతో ఈ సమ్మేళనాన్ని ఆటోనగర్‌లోని జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. టీడీపీ విజయవాడ నగర వాణిజ్య విభాగ అధ్యక్షుడు డూండీ రాకేశ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా టీడీపీ జాతీయ కోశాధికారి శ్రీరామ్‌ రాజగోపాల్‌ (తాతయ్య), కర్నూలు జిల్లా పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్‌ చిత్రపటాలు, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భవానీపురంలో ఏర్పాటుచేసిన ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశాన్ని మంత్రి పోలీసులతో అడ్డగించడం పిరికిపంద చర్యగా అభివర్ణించారు. వైశ్యులంతా టీడీపీకి మద్దతుగా ఉన్నారని తెలిపారు. టీడీపీ జాతీయ కోశాధికారి శ్రీరామ్‌ తాతయ్య మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఆర్యవైశ్యులను ఓటుబ్యాంకుగా ఉపయోగించుకుని, ఎలాంటి పదవులు ఇవ్వకుండా అణగదొక్కుతోందన్నారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు తూనుగుంట్ల సాయిబాబు, నాగేంద్ర, డోన్‌ మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఫణికుమార్‌, తెనాలి మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ పెండ్యాల వెంకట్రావు, ఆర్యవైశ్య కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్లు పేర్ల రవి, ఐ.రాధ, నారాయణరావు, శ్రీరామ్‌ చంద్రమూర్తి, నాయకులు ఎం.బాబాప్రసాద్‌, జయం పురుషోత్తం, పి.రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-23T06:15:39+05:30 IST