ఉపాధ్యాయులను అడ్డుకోవడం సరికాదు

ABN , First Publish Date - 2022-01-21T05:09:44+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్‌సీ అసంబద్ధత జీవోలకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులందరూ నెల్లూరు కలెక్టరేట్‌ ముందు స్వచ్ఛందంగా ధర్నా చేసేందుకు

ఉపాధ్యాయులను అడ్డుకోవడం సరికాదు
మనుబోలు: బస్సులో ప్రయాణికుల నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు

వెంకటాచలం, జనవరి 20 : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్‌సీ అసంబద్ధత జీవోలకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులందరూ నెల్లూరు కలెక్టరేట్‌ ముందు స్వచ్ఛందంగా ధర్నా చేసేందుకు వెళ్తుంటే పోలీసులు ఉపాధ్యాయులను అమానుషంగా అడ్డుకుని అరెస్టులు చేయడం సరికాదని ఫ్యాప్టో నాయకులు, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ చేవూరు సుబ్బారావు, ఏపీటీఎఫ్‌ మండలాధ్యక్షుడు డీ శ్రీనివాసులురెడ్డి, యూటీఎఫ్‌ మండలాధ్యక్షుడు విజయ్‌, ఏపీటీఫ్‌ 1938 మండలాధ్యక్షుడు ఆర్‌.సుధాకర్‌ గురువారం ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. తమకు రావాల్సిన రాయితీలు, హక్కులను అడిగే స్వేచ్ఛ ఉపాధ్యాయులకు లేదా అని ప్రశ్నించారు.  ఉపాధ్యాయుల పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించడం, పోలీసు స్టేషన్లకు తరలించడం సరికాదన్నారు.   ఇప్పటికైనా ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఉద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు.


పోలీసుల అదుపులో 12మంది ఉపాధ్యాయులు

మనుబోలు, జనవరి 20: జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో జాతీయ రహదారిపై గురువారం కాగితాలపూరు క్రాస్‌ రోడ్డు వద్ద గూడూరు రూరల్‌ సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఐ ముత్యాలరావు ఆధ్వర్యంలో మనుబోలు పోలీసులు గూడూరు-నుంచి నెల్లూరు వెళుతున్న బస్సుల్లో తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సులు నిలిపి ప్రయాణికుల నుంచి మీలో ఎవరైనా ఉపాధ్యాయులు ఉన్నారా, ఎక్కడ నుంచి వస్తున్నారు. ఎక్కడికి వెళుతున్నారు. ఎందుకోసం వెళుతున్నారంటూ ఆరా తీశారు. ఈ క్రమంలో నెల్లూరులో కలెక్టరేట్‌ వద్ద ధర్నాకు వెళుతున్న 12మంది ఉపాధ్యాయులను గుర్తించి దింపేశారు. వారిని మనుబోలు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారితో సీఐ చర్చించారు. బైండోవర్‌ చేసుకుని సాయంత్రం ఇళ్లకు పంపారు. దీనిపై ఉపాధ్యాయులు ఇదేమి చోద్యం అంటూ మండిపడుతున్నారు.


పీఆర్సీ సమ్మెపై పోలీసుల తనిఖీలు

బుచ్చిరెడ్డిపాళెం, జనవరి 20: పీఆర్సీ సమ్మెలో పాల్గొనేందుకు వెళ్లే ఉపాధ్యాయులను  గురువారం పోలీసులు అడ్డుకుని 10మంది ఉపాఽధ్యాయులను అదుపులోకి తీసుకున్నారు.   నెల్లూరు కలెక్టరేట్‌ ముందు స్వచ్ఛందంగా ధర్నాలో పాల్గొనేందుకు బుచ్చి, సంగం, ఆత్మకూరు తదితర మండలాల నుంచి  బుచ్చి- జొన్నవాడ మార్గం మీదుగా నెల్లూరుకు వెళ్లే ఉపాధ్యాయులను జొన్నవాడ బ్రిడ్జి వద్ద బుచ్చి సీఐ సీహెచ్‌. కోటేశ్వరరావు, ఎస్‌ఐ ప్రసాద్‌రెడ్డి, సిబ్బంది తనిఖీలు చేపట్టారు. అలాగే నెల్లూరు వెళ్లే కార్లు, ఆటోలు, బైక్‌లను ఆపి ఆ వాహనాల్లో పీఆర్సీ సమ్మెకు వెళ్లే ఉపాధ్యాయుల గురించి ఆరా తీశారు. ఈ క్రమంలో వారి గుర్తింపు కార్డులను పరిశీలించి సమ్మెలోకి వెళ్తున్న 10మంది ఉపాఽధ్యాయులను అదుపులోకి తీసుకున్నారు.




Updated Date - 2022-01-21T05:09:44+05:30 IST