లక్ష్యానికి అడుగు దూరంలో.. సియోల్‌లో కాలుమోపిన యువ పైలట్ జారా

ABN , First Publish Date - 2021-12-11T22:38:14+05:30 IST

జారా రూథర్‌ఫర్డ్.. మరికొన్ని రోజుల్లో ఈ పేరు చరిత్ర పుటల్లో చోటు సంపాదించుకోబోతోంది.

లక్ష్యానికి అడుగు దూరంలో.. సియోల్‌లో కాలుమోపిన యువ పైలట్ జారా

న్యూఢిల్లీ: జారా రూథర్‌ఫర్డ్.. మరికొన్ని రోజుల్లో ఈ పేరు చరిత్ర పుటల్లో చోటు సంపాదించుకోబోతోంది. చిన్న వయసులోనే విమానంలో ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టేయాలన్న ఆమె కల నెరవేరబోతోంది. ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్న జారా.. ఆసియాలో తొలి స్టాప్ అయిన దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ల్యాండ్ అయింది. 19 ఏళ్ల బ్రిటిష్-బెల్జియన్ అయిన ఈ యువ పైలట్ 51 వేల కిలోమీటర్ల ప్రపంచయాత్రను చేపట్టింది. యాత్రలో భాగంగా అమెరికా, గ్రీన్‌ల్యాండ్, రష్యా, కొలంబియా సహా ఐదు ఖండాల్లోని 52 దేశాలను చుట్టేయనుంది.


పశ్చిమ బెల్జియంలోని కోట్రిజ్క్-వెవెల్జెమ్ విమానాశ్రయం నుంచి ఈ ఏడాది ఆగస్టులో విమానంలో పైకి ఎగిరింది. రష్యాలోని వ్లాడివోస్టోక్ విమానాశ్రయం నుంచి తన బెస్పోక్ షార్క్ అల్ట్రాలైట్ విమానంలో బయలుదేరిన జారా నేడు సియోల్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది. అనంతరం ఈ యువ పైలట్ మాట్లాడుతూ.. ‘‘ఇది చాలా సవాలుతో కూడుకున్నది’’ అని పేర్కొంది. బెస్పోక్ షార్క్ అల్ట్రాలైట్ విమానం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్.


వీసా, వాతావరణ కారణాలతో అలస్కా, రష్యాలలో నెలేసి రోజుల చొప్పున చిక్కుకుపోయినట్టు జారా తెలిపింది. ఈ క్రిస్‌మస్ నాటికే తన యాత్రను పూర్తిచేయాలనుకున్నాను కానీ, ఇప్పుడది సాధ్యమయ్యేలా కనిపించడం లేదని పేర్కొంది. అయినప్పటికీ ఇదో సాహసమేనని పేర్కొంది.


సియోల్ నుంచి సోమవారం తైవాన్ చేరుకోనుంది. జనవరి మధ్య నాటికి తన యాత్ర ముగుస్తుందని భావిస్తున్నట్టు చెప్పింది. వివిధ దేశాల్లో తాను ల్యాండ్ అయిన తర్వాత స్థానిక ప్రదేశాలను చూడాలన్న ఉత్సాహం ఉన్నప్పటికీ కరోనా ఆంక్షల కారణంగా అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే, ఈ ప్రదేశాలను తాను విమానం నుంచి చూస్తుండడం గమ్మత్తైన విషయమని సంతోషంగా పేర్కొంది.


రికార్డు పుస్తకాల్లోకి ఎక్కడాన్ని పక్కన పెడితే తన యాత్ర మరింతో మంది యువతులు ‘స్టెమ్’ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ అండ్ మ్యాథమేటిక్స్) చదివేందుకు ప్రేరణ కాబోతోందని జారా ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా, 2017లో షాయెస్తా వెయస్ 30 ఏళ్ల వయసులో ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టేసింది. ఇప్పుడా రికార్డును జారా రూథర్‌ఫర్డ్ చెరిపేయనుంది. ఇక, అత్యంత పిన్న వయసులో ప్రపంచాన్ని చుట్టేసిన పురుషుడిగా మాసన్ ఆండ్రూస్ రికార్డులకెక్కాడు. 2018లో 18 ఏళ్ల వయసులోనే అతడా ఘనత సాధించాడు. 

Updated Date - 2021-12-11T22:38:14+05:30 IST