తేజస్వినీ.. తండ్రి దుఃఖం ఆగేదెలా..?

ABN , First Publish Date - 2020-09-21T07:40:14+05:30 IST

బిడ్డకు పుట్టుకతోనే పోలియో. రెండు కాళ్లూ పని చేయవు. దీంతో చిన్నతనంలోనే కాదు.. 25 ఏళ్ల వయస్సులోనూ

తేజస్వినీ.. తండ్రి దుఃఖం ఆగేదెలా..?

25 ఏళ్లుగా తండ్రి చేతుల్లో పెరిగిన కుమార్తె

పోలియో బారిన పడ్డ బిడ్డకు ఆలనా.. పాలనా ఆయనే

అనారోగ్యంతో కుమార్తె మృతి

తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు


ముషీరాబాద్‌, సెప్టెంబర్‌ 20 (ఆంధ్రజ్యోతి): బిడ్డకు పుట్టుకతోనే పోలియో. రెండు కాళ్లూ పని చేయవు. దీంతో చిన్నతనంలోనే కాదు.. 25 ఏళ్ల వయస్సులోనూ ఆమెను ఎక్కడికైనా తండ్రే ఎత్తుకుని తీసుకెళ్లేవాడు. స్కూలుకే కాదు.. కాలేజీకి కూడా అంతే. ఆటో నడుపుతూ వచ్చే సంపాదనతోనే కూతురుని ఎంబీఏ వరకూ చదివించాడు. ఆమె కూడా తండ్రి కష్టాన్ని గుర్తించి బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేసి బాగా చూసుకుంటూ రుణం తీర్చుకుంటానని పదే పదే చెప్పేది. ఆ కోరిక తీరకుండానే విధి ఆమెను తండ్రికి దూరం చేసింది. అనారోగ్యంతో మృతి చెందింది. ఆ విషాద గాథ వివరాలు ఇలా ఉన్నాయి... ముషీరాబాద్‌ రాంనగర్‌ బాప్టిస్ట్‌ చర్చి వీధిలో ఉండే వెంకటేశ్వరరావు, రమాదేవి దంపతుల ఏకైక కుమార్తె తేజస్విని. వెంకటేశ్వరరావు ఆటో నడిపిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. పోలియో కారణంగా రెండు కాళ్లూ పని చేయకపోయినా ఆమెకు చదువుపై ఎంతో ఆసక్తి ఉండేది. పదవ తరగతి రాంనగర్‌ హైస్కూల్‌లో అభ్యసించగా, ఇంటర్మీడియట్‌ సెయింట్‌పాయిస్‌ స్కూల్‌లో చదువుకుంది. మారేడ్‌పల్లిలోని కస్తూర్బా కాలేజీలో ఎంబీఏ పూర్తి చేసింది. పీజీ ఎంట్రన్స్‌ రాసేందుకు సిద్ధమవుతోంది. వెంకటేశ్వరరావు ఆమెను కాలేజీకి ఎత్తుకొని తీసుకెళ్లేవాడు.


తన తండ్రి కష్టాన్ని తీర్చాలని భావించిన తేజస్విని ఎలాగైనా ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులను బాగా చూసుకుంటానని చెప్పేది. గత నెల 24న తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో విద్యానగర్‌లోని ఆంధ్ర మహిళా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. చికిత్స అనంతరం ఈ నెల 9న డిశ్చార్జి అయి ఇంటికి చేరుకుంది. మళ్లీ ఆమె అనారోగ్యానికి గురైంది. శనివారం అర్ధరాత్రి ‘‘ నాన్నా.. నా ఆరోగ్యం బాగా లేదు. నాకు ఐస్‌క్రీం తినాలని ఉంది. నన్ను ఎత్తుకొని తినిపించు’’ అంటూ ఏడుస్తూ తండ్రికి చెప్పింది. ఆయన ఆమెను ఎత్తుకుని ఐస్‌క్రీం తినిపించిన కొద్ది సేపటికే తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆంధ్ర మహిళా సభ ఆసుపత్రికి తీసుకెళ్లగా డాక్టర్‌లు పరిశీలించి అప్పటికే మృతి చెందిందని చెప్పారు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. ఆమె అంత్యక్రియలు ముషీరాబాద్‌ బాపూజీనగర్‌లోని శ్మశాన వాటికలో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించారు. అంతకు ముందు ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠాగోపాల్‌ తేజస్విని తల్లిదండ్రులను పరామర్శించారు. తేజస్వినికి నివాళులు అర్పించారు. 

Updated Date - 2020-09-21T07:40:14+05:30 IST