ప్రధాన ఆసుపత్రుల్లో ఏర్పాట్లు

ABN , First Publish Date - 2021-01-16T06:52:27+05:30 IST

నగరంలోని ప్రధాన ఆసుపత్రులైన ఉస్మానియా, ఈఎన్‌టీ, కింగ్‌కోఠి, నాంపల్లి ఏరియా ఆసుపత్రులలో హెల్త్‌ వర్కర్లకు కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ప్రధాన ఆసుపత్రుల్లో ఏర్పాట్లు

మంగళ్‌హాట్‌, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): నగరంలోని ప్రధాన ఆసుపత్రులైన ఉస్మానియా, ఈఎన్‌టీ, కింగ్‌కోఠి, నాంపల్లి ఏరియా ఆసుపత్రులలో హెల్త్‌ వర్కర్లకు కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం డీఎంఈ రమేష్‌రెడ్డి కింగ్‌ కోఠి వ్యాక్సినేషన్‌ సెంటర్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 

ఉస్మానియాలో 450 మందికి.. 

ఉస్మానియా ఆసుపత్రిలో మొత్తం మూడు వేల మందికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. ఈనెల 18 నుంచి మూడు దఫాలుగా ఆరు సెంటర్లలో రోజూ 450 మందికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌ తెలిపారు.  

కింగ్‌కోఠిలో 790 మందికి.. 

కింగ్‌కోఠి ఆసుపత్రిలో మొత్తం 790 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు కింగ్‌కోఠి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజేంద్రనాథ్‌ తెలిపారు. బొగ్గుల కుంటలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, సిబ్బంది ద్వారా వ్యాక్సినేషన్‌  ఉంటుందని తెలిపారు. 

కోఠి ఈఎన్‌టీ, నాంపల్లి ఏరియా ఆసుపత్రుల్లో...

కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రిలో మొత్తం 220 మందిని వాక్సినేషన్‌ కోసం గుర్తించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శంకర్‌ పేర్కొన్నారు. ఇసామియాబజార్‌ యూపీహెచ్‌సీ వైద్య సిబ్బంది ద్వారా వ్యాక్సినేషన్‌ జరుగుతుందన్నారు. నాంపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొత్తం 287 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సునీత తెలిపారు. 

ప్రభుత్వ ఆస్పత్రికి వాక్సిన్‌ 

గచ్చిబౌలి: శేరిలింగంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి 150 డోసుల కరోనా వ్యాక్సిన్‌ అందినట్లు కొండాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ దశరథ్‌ తెలిపారు. శనివారం జరిగే వాక్సినేషన్‌ ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్‌ హమీద్‌పటేల్‌, జిల్లా వైద్యాధికారులు పాల్గొంటారని వివరించారు.  

గాంధీలో ప్రారంభించనున్న ఈటల 

అడ్డగుట్ట : కొవిడ్‌ నోడల్‌ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రిలో కరోనా టీకా కార్యక్రమాన్ని మంత్రి ఈటల రాజేందర్‌ శనివారం ప్రారంభించనున్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్‌ శ్వేతా మహంతి, డీఎంఈ డాక్టర్‌ రమే్‌షరెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. శనివారం ఉదయం 9 గంటలకు  వ్యాక్సినేషన్‌ ప్రారంభిస్తారు. రోజూ ఐదు వందల మంది చొప్పున మొత్తం మూడు వేల మంది గాంధీ ఆస్పత్రి, మెడికల్‌ కాలేజీ వైద్యులు, సిబ్బందికి టీకా ఇవ్వనున్నారు. శనివారం నుంచి ఈ నెల 22 వరకు వ్యాక్సినేషన్‌ జరగనుంది. 17న సెలవు దినంగా ప్రకటించారు. ఆసుపత్రిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సూపరిటెండెంట్‌ ప్రొఫెసర్‌ రాజారావు చెప్పారు.  ప్రధాని మోదీ శనివారం గాంధీ ఆసుపత్రి వైద్యులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడతారని తెలిపారు.  


Updated Date - 2021-01-16T06:52:27+05:30 IST