అరుదైన గౌరవం..

ABN , First Publish Date - 2021-01-16T06:53:40+05:30 IST

రంగారెడ్డి జిల్లా నార్సింగ్‌ గ్రామీణ ఆరోగ్య కేంద్రం అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది.

అరుదైన గౌరవం..
మొదటి వ్యాక్సిన్‌ తీసుకోనున్న జయమ్మ

నార్సింగ్‌ గ్రామీణ ఆరోగ్య కేంద్రానికి...

వ్యాక్సినేషన్‌ ప్రారంభించనున్న ప్రధాని మోదీ

నార్సింగ్‌, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా నార్సింగ్‌ గ్రామీణ ఆరోగ్య కేంద్రం అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. శనివారం దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానుండగా, ప్రధాని నరేంద్రమోదీ వర్చ్యువల్‌ విధానంలో నగరంలోని గాంధీ, నార్సింగ్‌ గ్రామీణ ఆర్యోగ కేంద్రంలో వాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్‌ పి. పద్మ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధాని ఇక్కడి వైద్యులు, వైద్య సిబ్బందితో  వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడనున్నారు. కొవిడ్‌ సమయంలో ఎదురైన ఇబ్బందులు, డాక్టర్లు తీసుకున్న జాగ్రత్తలు, వ్యాక్సినేషన్‌ ఏర్పాట్లు, తదతర విషయాలను అడిగి తెలుసుకోనున్నారు అని సమాచారం. మొదటి రోజు అదే ఆస్పత్రి సిబ్బందికి వ్యాక్సినేషన్‌ చేయనున్నారు. ఏఎన్‌ఎం జయమ్మకు మొదటి వాక్సిన్‌ ఇచ్చే అవకాశం ఉంది.  అయితే, మొదట తనకే వ్యాక్సినేషన్‌ చేస్తే సంతోషపడతానని, తనకు లభించిన అదృష్టంగా భావిస్తానని జయమ్మ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్‌కు తమ ఆస్పత్రిని ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉందని, తామంతా సిద్ధంగా ఉన్నామని నార్సింగ్‌ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యాధికారిణి పద్మ పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, ఇతర అధికారులు పాల్గొననున్నారు. 

గాంధీ మెడికల్‌ కళాశాల అధీనంలోని నార్సింగ్‌ గ్రామీణ ఆరోగ్య కేంద్రంలో స్థానికంగా రోగులకు వైద్య సేవలు అందించడంతో పాటు గాంధీ మెడికల్‌ కళాశాలలో చదివిన వారికి ఇక్కడే హౌస్‌సర్జన్‌గా శిక్షణ కూడా ఇస్తారు. మొదట్లో శిక్షణ కేంద్రంగానే ఉన్న ఈ ఆస్పత్రిని శిక్షణతోపాటు ఆరోగ్యకేంద్రంగా కూడా మార్చారు. అరవైఏళ్ల క్రితం ఏర్పడిన ఈ ఆస్పత్రిని వాక్సినేషన్‌ కోసం  ఎంపిక చేయడం విశేషం.

Updated Date - 2021-01-16T06:53:40+05:30 IST