హర్యానాలో ఆసుపత్రులకు వెళ్ళలేనివారికి టెలీమెడిసిన్ సేవలు

ABN , First Publish Date - 2020-04-02T23:37:31+05:30 IST

హర్యానాలో గురువారం నుంచి టెలీమెడిసిన్ సేవలు ప్రారంభమయ్యాయి

హర్యానాలో ఆసుపత్రులకు వెళ్ళలేనివారికి టెలీమెడిసిన్ సేవలు

న్యూఢిల్లీ : హర్యానాలో గురువారం నుంచి టెలీమెడిసిన్ సేవలు ప్రారంభమయ్యాయి. ప్రజలకు ఆరోగ్య సంరక్షణ సేవలను మరింత మెరుగైన రీతిలో అందజేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ సేవలను ప్రారంభించింది. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టార్ మాట్లాడుతూ  ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందజేసేందుకు కృషి చేస్తున్నామని  చెప్పారు. ఆసుపత్రులకు వెళ్లే శక్తి లేనివారి కోసం రాష్ట్రంలో టెలీమెడిసిన్ సేవలను గురువారం నుంచి ప్రారంభించినట్లు తెలిపారు. 


కోవిడ్-19 మహమ్మారిని తిప్పికొట్టేందుకు 14 చోట్ల ఆసుపత్రులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటిలో 3,000 పడకలు ఉన్నట్లు తెలిపారు. పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ) కిట్లు ప్రస్తుతం తగిన సంఖ్యలో ఉన్నట్లు తెలిపారు. మరొక 2.50 లక్షల కిట్లకు ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపారు. పీపీఈ కిట్ల దిగుమతి అవకాశాలపై పరిశీలించాలని మోదీని కోరారు. కోవిడ్-19ను దీటుగా ఎదుర్కొనడం కోసం భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) టెస్టింగ్ ఫెసిలిటీస్‌ను పెంచాలని సలహా ఇచ్చారు. 


ఇతర రాష్ట్రాలతో పోల్చితే, హర్యానాలో కోవిడ్-19 నియంత్రణలో ఉందని చెప్పారు. నోవల్ కరోనా వైరస్‌తో పోరాటంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వేతర సంస్థలు, సామాజిక సంస్థలు, స్వచ్ఛంద కార్యకర్తలు, ప్రజలు సహకరిస్తున్నారని తెలిపారు. 


హర్యానాలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు 20 ఉన్నట్లు తెలిపారు. 13 మంది కోలుకోవడంతో ఆసుపత్రుల నుంచి పంపించినట్లు చెప్పారు.


అష్ట దిగ్బంధనం ప్రభావంతో బాధపడుతున్న పేదలకు, భవన నిర్మాణ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక  సహాయం అందిస్తోందన్నారు. 


ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో చండీగఢ్  నుంచి ముఖ్యమంత్రి ఖట్టార్‌తోపాటు ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా, ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ పాల్గొన్నారు.


Updated Date - 2020-04-02T23:37:31+05:30 IST