సుప్రీంలో తెలుగు.. ఇరు జీవితాలకు వెలుగు

ABN , First Publish Date - 2021-07-29T06:26:19+05:30 IST

దేశ అత్యున్నత న్యాయస్థానంలో తెలుగు గుబాళించింది. 21ఏళ్లుగా నానుతున్న

సుప్రీంలో తెలుగు.. ఇరు జీవితాలకు వెలుగు

  • ‘సీజేఐ’ ముందుకు విడాకుల కేసు 
  • దంపతులు తెలుగువారే..
  • వారితో మాతృభాషలో మాట్లాడిన చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ
  • నచ్చజెప్పి కలిపేందుకు ప్రయత్నం
  • అంగీకరించిన దంపతులు
  •  

న్యూఢిల్లీ, జూలై 28(ఆంధ్రజ్యోతి): దేశ అత్యున్నత న్యాయస్థానంలో తెలుగు గుబాళించింది. 21ఏళ్లుగా నానుతున్న తెలుగు దంపతుల విడాకుల కేసు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ చొరవతో సుఖాంతమైంది. ఆ జంటకు చక్కటి తెలుగులో నచ్చజెప్పిన జస్టిస్‌ రమణ.. ఇద్దరూ కలిసి ఉండేందుకు ఒప్పించారు. గుంటూరు జిల్లాకు చెందిన కళ్లెం శ్రీనివాస శర్మ(49), శాంతి(46) 1998లో పెళ్లి చేసుకున్నారు. ఒక కుమారుడు పుట్టాక వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. భర్తపై శాంతి వరకట్న వేధింపుల కేసు దాఖలు చేసింది. ఆ కేసు కింది కోర్టు, హైకోర్టును దాటి 2013లో సుప్రీంకోర్టుకు వచ్చింది. సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వం చేసుకోవాల్సిందిగా సూచించి మళ్లీ హైకోర్టుకు పంపింది.


మళ్లీ 2020 ఫిబ్రవరిలో నాటి సుప్రీం న్యాయమూర్తి జస్టిస్‌ రమణ బెంచ్‌ వద్దకు ఈ కేసు వచ్చింది. అప్పట్లో ఆయన కూడా రాజీ చేసుకోవాలని సూచించారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. జస్టిస్‌ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మళ్లీ ఈ కేసు ఆయన నేతృత్వంలోని బెంచ్‌ వద్దకే వచ్చింది. ఆయన బుధవారం వారిద్దరినీ వీడియోకాన్పరెన్స్‌ ద్వారా విచారణ జరిపారు. వారిద్దరికీ తెలుగులోనే నచ్చజెప్పారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి తన రాష్ట్రానికి చెందిన భార్యాభర్తలను కలిపేందుకు, తన మాతృభాషలో ఓపికగా చేస్తున్న కృషి చూసి న్యాయస్థానంలో పలువురు ఆశ్చర్యపోయారు.



సీజేఐ ఏమన్నారంటే..

‘‘1998లో మీకు పెళ్లైంది. 99లో అబ్బాయి పుట్టాడు. అప్పటి నుంచి తగాదా మొదలైంది. 21 ఏళ్ల నుంచి మీరిద్దరూ తగువులాడుకుంటున్నారు. ఇప్పుడు మీ ఆయన జైలుకు వెళ్తే మీకు వచ్చే లాభం ఏమీ ఉండదు. వచ్చే భరణం కూడా రాదు. మీ ఆయనను జైలుకు పంపించమంటే పంపుతాను. రెండో, మూడో నెలలు జైల్లో ఉంటారు. ఆయన ఉద్యోగం పోతుంది. మీకు భరణం కావాలా, ఆయన జైలుకు పోవాలా.. ఏం కావాలో చెప్పండి’’ అని జస్టిస్‌ రమణ.. శాంతిని అడిగారు.


ఆయన అడిగిన తీరుతో ఆలోచనలో పడ్డ శాంతి.. ‘‘నాకు డబ్బులు వద్దు. నేను కోల్పోయిన 21 ఏళ్ల జీవితాన్నిగానీ, నా కొడుకుకు తండ్రినిగానీ అది తెచ్చిపెట్టలేదు సార్‌. నాకు న్యాయం కావాలి’’ అన్నారు. ‘‘మరి ఆయనతో ఉంటారా.. విడాకులు తీసుకుంటారా.. మీ అప్పీలుపై ఆయనకు శిక్షపడే అవకాశం ఉంది’’ అని జస్టిస్‌ రమణ అడగ్గా.. ‘‘సార్‌, ఆయనతో కలిసే ఉంటాను, నాకు విడాకులు వద్దు. ఆయనలో మార్పు వచ్చి నన్ను పిలిపించాలనుకుంటే కేసు వెనక్కి తీసుకుంటా’’ అని శాంతి స్పష్టం చేశారు. దీంతో జస్టిస్‌ రమణ భర్త తరఫు న్యాయవాది రామకృష్ణా రెడ్డి అభిప్రాయం అడిగారు. తన క్లయింట్‌ కూడా ఆమెతో కలిసి ఉండాలనుకుంటున్నట్లు చెప్పారు. ఆ మేరకు అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు అంగీకరించారు. అప్పుడు జస్టిస్‌ రమణ.. ‘‘మీ భర్త దగ్గరకు వెళ్తారు కదా’’ అని శాంతిని మళ్లీ అడిగారు. దానికామె.. ‘‘నన్ను, నా బిడ్డను సరిగ్గా చూసుకుంటానంటే వెళ్తాను’’ అన్నారు. ఈ మాటకు సీజేఐ.. ‘‘ఆయనే కాదు మీరు కూడా సహకరించాలి. ప్రతి చిన్న విషయానికీ ఆయనను ఇబ్బంది పెట్టొద్దు’’ అని చెప్పారు. అలా జరగదని, సరిగ్గానే ఉంటానని ఆమె బదులిచ్చారు. ఈ మేరకు అఫిడవిట్‌ దాఖలు చేయాల్సిందిగా సీజేఐ ఆమెకు సూచించారు.


‘‘అమ్మా శాంతీ, మీ పేరుకు తగ్గట్లు మీరు శాంతిగా ఉండాలి. 20 ఏళ్ల పాటు కష్టపడ్డారు. కుమారుడిని చదివించుకున్నారు. ఇకనైనా ఇద్దరూ బాగా ఉండండి. శర్మగారూ మీరు కూడా అనవసరంగా ఇబ్బందులు ఏర్పరచుకోకండి’’ అని ఆయన భార్యాభర్తలిద్దరికీ  నచ్చజెప్పారు. అఫిడవిట్ల దాఖలుకు ఇద్దరికీ 2 వారాల గడువిచ్చారు. ‘‘21 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్య సీజేఐ చొరవ వల్లే పరిష్కారమైంది. ఆయన తెలుగులో మాట్లాడడం మా అందరికీ ఎంతో సంతోషం కలిగించింది’’ అని న్యాయవాది రామకృష్ణా రెడ్డి అన్నారు.


Updated Date - 2021-07-29T06:26:19+05:30 IST