అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా వీణారెడ్డి
ABN , First Publish Date - 2021-07-27T22:37:18+05:30 IST
అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ’ మిషన్ డైరెక్టర్‌గా తెలుగు సంతతి మహిళ వీణారెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
హైదరాబాద్ : ‘అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ’ మిషన్ డైరెక్టర్‌గా తెలుగు సంతతి మహిళ వీణారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ట్విటర్ పేజీ ద్వారా సంస్థ ఇందుకు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించింది. కాగా, యూఎస్‌ఏఐడీ మిషన్ డైరెక్టర్‌గా ఎంపికైన తొలి ఇండో-అమెరికన్ వీణారెడ్డి కావడం విశేషం. ఈ నియామకంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సందూ... వీణారెడ్డికి శుభాకాంక్షలందజేశారు. కాగా... ఆమె ఇదే ఏజెన్సీలో ఫారిన్ సర్వీస్ ఆఫీసర్‌గా పని చేశారు. కంబోడియా మిషన్ డైరెక్టర్‌గా 2017 ఆగష్టు నుంచి ఆమె బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. హైతి భూకంప సమయంలో రక్షణ, అభివృద్ధి చర్యల పర్యవేక్షకురాలిగా ఆమె తన సత్తా చాటారు.
అంతకుముందు వాషింగ్టన్‌లో అసిస్టెంట్ జనరల్ కౌన్సెల్‌గా ఆసియా దేశాల సమస్యలపై ప్రభుత్వ న్యాయ సలహాదారుగా కూడా వీణారెడ్డి పని చేశారు. ప్రభుత్వ సర్వీసుల కంటే ముందు న్యూయార్క్, లాస్ ఏంజెల్స్, లండన్‌లలో కార్పొరేట్ కంపెనీలకు అటార్నీగా వ్యవహరించిన అనుభవం వీణారెడ్డికి ఉంది. చికాగో విశ్వవిద్యాలయం నుంచి బీఏ, ఎంఏ, లా కోర్సుల్లో ఉత్తీర్ణురాలైన వీణారెడ్డి... కొలంబియా యూనివర్సిటీ నుంచి ‘జురిస్ డాక్టరేట్(జేడీ)’ను అందుకోవడం విశేషం. న్యూయార్క్, కాలిఫోర్నియా బార్ అసోషియేషన్‌లో వీణకు సభ్యత్వముంది. కాగా... అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా పదవీబాధ్యతలను స్వీకరించిన వీణారెడ్డికి అభినందనలు వెల్లువెత్తాయి.