గొల్లపూడిలో టెన్షన్‌ టెన్షన్‌

ABN , First Publish Date - 2021-08-01T06:29:44+05:30 IST

మాజీ మంత్రి దేవినేని ఉమ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు గొల్లపూడి వస్తున్న సందర్భంగా ఆయనకు వినతిపత్రం అందజేస్తామంటూ వైసీపీకి చెందిన కొందరు దళిత నాయకులు ప్రకటించడం, టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో గొల్లపూడి వన్‌సెంటరు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

గొల్లపూడిలో టెన్షన్‌ టెన్షన్‌
దేవినేని ఉమ సతీమణిని పరామర్శిస్తున్న చంద్రబాబు

విజయవాడ, జూలై 31 (ఆంధ్రజ్యోతి) : మాజీ మంత్రి దేవినేని ఉమ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు గొల్లపూడి వస్తున్న సందర్భంగా ఆయనకు వినతిపత్రం అందజేస్తామంటూ వైసీపీకి చెందిన కొందరు దళిత నాయకులు ప్రకటించడం, టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో గొల్లపూడి వన్‌సెంటరు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు భారీఎత్తున మోహరించి విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారి మినహా పక్కనున్న అన్ని దారులను బారికేడ్లతో మూసివేశారు. అటువైపు ఎవరినీ రానీయకుండా కట్టడి చేశారు. అయినప్పటికీ దళితులు గొల్లపూడి గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి ఊరేగింపుగా బయల్దేరి చంద్రబాబును కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దళితులను నిందించిన మాజీ మంత్రి దేవినేని ఉమా ఇంటికి చంద్రబాబు రావడాన్ని వ్యతిరేకిస్తూ వారు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఒకదశలో వారంతా ఒక్కసారిగా జాతీయ రహదారిపైకి రావడంతో పోలీసులు వారందరినీ దూరంగా చెదరగొట్టారు. చంద్రబాబు ఉమా కుటుంబ సభ్యులను పరామర్శించి వెళ్లే వరకు అటువైపు ఎవరినీ రానివ్వకుండా నిలిపివేశారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమే చంద్రబాబు ఉమ కుటుంబ సభ్యులను పరామర్శించి వెళ్లారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శ్రీనివాస్‌ (నాని), టీడీపీ జాతీయ క్రమశిక్షణ సంఘం చైౖర్మన్‌, గన్నవరం నియోజకవర్గ ఇన్‌చార్జి బచ్చుల అర్జునుడు, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌, వైవీబీ రాజేంద్రప్రసాద్‌, గద్దె అనురాధ తదితరులు చంద్రబాబు వెంట ఉన్నారు.



Updated Date - 2021-08-01T06:29:44+05:30 IST