పది పరీక్షలకు..కసరత్తు

ABN , First Publish Date - 2020-05-23T08:29:52+05:30 IST

పదో తరగతి పరీక్షలను జూలై పదో తేదీ నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో జిల్లా విద్యా శాఖ అధికారులు ఏర్పాట్లలో

పది పరీక్షలకు..కసరత్తు

ఒక్కో గదిలో 10 నుంచి 12 మంది విద్యార్థులు

గతంలో ఎంపిక చేసిన 252 కేంద్రాలతోపాటు మరో 92 సెంటర్లు గుర్తింపు

అదనంగా ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బంది

త్వరితగతిన ఫలితాల కోసం మూడు చోట్ల మూల్యాంకనం


విశాఖపట్నం, మే 22 (ఆంధ్రజ్యోతి):

పదో తరగతి పరీక్షలను జూలై పదో తేదీ నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో జిల్లా విద్యా శాఖ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి పరీక్షా కేంద్రాల్లో భౌతిక దూరం పాటించాల్సి రావడంతో మరిన్ని కేంద్రాలను ఎంపిక చేశారు. దీనిప్రకారం జిల్లాలో 344 కేంద్రాలు అవసరమని గుర్తించారు. ప్రతి కేంద్రంలో గదికి 10 నుంచి 12 మంది విద్యార్థులు మాత్రమే ఉంటారు.


ఈ ఏడాది మార్చి 27వ తేదీ నుంచి పదో పరీక్షల నిర్వహణకు విద్యా శాఖ అధికారులు జిల్లాలో 252 కేంద్రాలను గుర్తించి అందుకు అవసరమైన ఏర్పాట్లుచేశారు. డిపార్టుమెంటల్‌ అధికారులు, చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిప్యూటీ చీఫ్‌ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లను నియమించారు. కరోనా వైరస్‌ కారణంగా విద్యా సంస్థలను నిరవధికంగా మూసివేయడంతో పరీక్షలు వాయిదాపడిన విషయం విదితమే. కేంద్ర ప్రభుత్వం నాలుగో విడత లాక్‌డౌన్‌లో పలు రంగాలకు సడలింపులు ఇచ్చింది. ఇప్పటికే ప్రైవేటు వాహనాలతోపాటు ఆర్టీసీ బస్సులు నడుస్తుండగా, వచ్చే నెల ఒకటి నుంచి రైళ్లు నడవనున్నాయి. దీంతో జూలైలో టెన్త్‌ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం షెడ్యూల్‌ విడుదల చేసింది.


భౌతికదూరం పాటించాలన్న నిబంధనల మేరకు అదనంగా పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేయాలన్న ఆదేశాలతో కొత్తగా మరో 92 కేంద్రాలు గుర్తించారు. ఈ కేంద్రాల్లో విధుల నిర్వహణకు ఇన్విజిలేటర్లు, ఇతర అధికారులను నియమించనున్నారు. త్వరలో వీరికి శిక్షణ ఇవ్వాలని ప్రతిపాదించారు. జవాబు పత్రాల మూల్యాంకనం కూడా త్వరితగతిన పూర్తిచేస్తారు. ఇందుకుగాను జిల్లాలో మూడు కేంద్రాలు ఏర్పాటుచేస్తారు. ఇప్పటివరకు క్వీన్‌ మేరీస్‌ ఉన్నత పాఠశాలలో మాత్రమే మూల్యాంకనం నిర్వహించేవారు.


ఈ పర్యాయం మరో రెండు కేంద్రాలు ఏర్పాటుచేస్తామని డీఈవో బి.లింగేశ్వరరెడ్డి తెలిపారు. చంద్రంపాలెం ఉన్నత పాఠశాల, సీతమ్మధారంలో నెహ్రూ మునిసిపల్‌ ఉన్నతపాఠశాలతోపాటు మరికొన్ని పాఠశాలలు పరిశీలిస్తున్నామన్నారు. ప్రతి కేంద్రంలో రెండేసి సబ్జక్టులకు సంబంధించి జవాబు పత్రాల మూల్యాంకనం నిర్వహిస్తామన్నారు. 

Updated Date - 2020-05-23T08:29:52+05:30 IST