Advertisement
Advertisement
Abn logo
Advertisement

నిబంధనలు తూచ్‌

అనుమతులు లేకుండా బాణాసంచా విక్రయాలు

సిండికేట్‌గా ఏర్పడిన దుకాణదారులు

ప్రజలపై ఆర్థిక భారం


నల్లగొండ క్రైం: దీపావళి పండుగకు ప్రజలు టపాసులు కాల్చడం సంప్రదాయంగా వస్తోంది. ఈ క్రమంలో టపాసుల దుకాణాలు ఏర్పాటు చేసేందుకు వ్యాపారులు నిబంధనలను అతిక్రమిస్తుండగా, ఇదే అదునుగా అధికారులు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. దుకాణాల ఏర్పాటుకు అనుమతుల కోసం పోలీస్‌, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ అధికారులకు  కనీసంగా రూ.15 నుంచి రూ.30వేల వరకు చెల్లించినట్లు పలువురు తెలిపారు. అయితే కొందరు వ్యాపారులు క్షేత్రస్థాయిలో ఉండే అధికారులకు డబ్బు ముట్టజెప్పి అనుమతులు లేకుండానే దుకాణాలు ప్రారంభించారు. అంతేగాక నిబంధనలు అతిక్రమించి అమ్మకాలు చేస్తున్నారు. దీపావళికి పిల్లలు మొదలు పెద్దల వరకు బాణాసంచా కాలుస్తుంటారు. వీటిని విక్రయించే దుకాణాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే జనసంచారం ఉండే ప్రాంతాల్లో టపాసుల దుకాణాలు ఏర్పాటు చేయకూడదు. ఏదైనా ప్రమాదం చోటుచేసుకుంటే భారీగా ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లే అవకాశాలు ఉంటాయి. దీంతో బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటుచేయాలని అధికారులు చెబుతున్నా, వ్యాపారులు మాత్రం నిబంధనలకు పాతరవేస్తున్నారు. దుకాణాల షెడ్డులకు ఇనుపరేకులు ఉపయోగించాల్సి ఉండగా, డెకరేషన్‌ క్లాత్‌ వినియోగిస్తున్నారు. ఎలాంటి అగ్రిమాపక పరికరాలు దుకాణాల వద్ద అందుబాటులో ఉండటం లేదు. నీటి డ్రమ్ములు, ఇసుక బస్తా లు, ఫైర్‌శక్తి పరికరాలు ప్రతి దుకాణం వద్ద ఉండాలి. కానీ నిబంధనలు అతిక్రమించి దుకాణాలు ఏర్పాటు చేస్తున్నా మామూళ్లు తీసుకున్న అధికారులు చోద్యం చూస్తున్నారు. దీపావళి పర్వదినానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.15కోట్ల మేర బాణాసంచా విక్రయాలుంటాయని అంచనా. గత ఏడాది కరోనాతో విక్రయాలు గణనీయంగా తగ్గాయి. ఈ పర్యాయం పండుగను ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రజలు సైతం సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో టపాసుల దుకాణాలను ఎక్కువ సంఖ్యలో వెలస్తున్నాయి.


ఉమ్మడి జిల్లాలో 235 దుకాణాలు

ఉమ్మడి జిల్లాలో 235 టపాసుల దుకాణాలకు అధికారులు అనుమతి ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 128 దరఖాస్తులు రాగా, వాటిని పరిశీలించిన అధికారులు అనుమతులు ఇచ్చారు. ఒక్క నల్లగొండ పట్టణంలోనే 21 దుకాణాలు వెలిశాయి. గత ఏడాది జిల్లాలో సుమారు రూ.6కోట్లకు పైగా బాణా సంచా విక్రయాలు నిర్వహించగా, ఈ ఏడాది సుమారు రూ.8కోట్ల వరకు విక్రయాలు కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం స్వదేశీ బాణాసంచానే అధికంగా వినియోగించే అవకాశం ఉంది. అంతేగాక దుకాణాల సంఖ్య, విక్రయాలు కూడా పెరిగే అవకాశం ఉంది.

 సూర్యాపేట జిల్లాలో 82 బాణాసంచా దుకాణాల కోసం పోలీస్‌, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ అధికారులు తాత్కాలిక అనుమతులు జారీ చేశారు. జిల్లా కేంద్రంలో 40, కోదాడలో 33, హుజుర్‌నగర్‌లో 9 దుకాణాలకు మాత్రమే అనుమతులు ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా రూ.7కోట్ల మేర బాణాసంచా విక్రయాలు కొనసాగే అవకాశం ఉంది.

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఐదు శాశ్వత లైసెన్స్‌ ఉన్న బాణాసంచా విక్రయ దుకాణాలు ఉండగా, మరో 20వరకు తాత్కాలిక లైసెన్స్‌ తీసుకున్న వ్యాపారులు ఉన్నారు. భువనగిరి 4, చౌటుప్పల్‌లో ఒకటి శాశ్వత బాణాసంచా దుకాణాలు ఉన్నాయి. భువనగిరిలో మాస్‌కుంట ప్రాంతంలో దుకాణాలు ఏర్పాటుచేశారు. ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్‌, భూదాన్‌పోచంపల్లి, మోత్కురు, రామన్నపేట, తదితర ప్రాంతాల్లో 20మంది వ్యాపారులు తాత్కాలిక దుకాణాలు ఏర్పాటుచేసి, బాణాసంచా విక్రయించేందుకు సన్నద్ధం అవుతున్నారు. జిల్లాలో ఏటా రూ.5కోట్ల మేర విక్రయాలు అవుతుండగా, ఈ ఏడాది దీపావళి పండుగ సందర్భంగా విక్రయాలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. 


ప్రజలపై ఆర్థిక భారం..

బాణాసంచా విక్రయదారులు సిండికేట్‌ అవుతుండటంతో ప్రజలపై ఏటా ఆర్థికభారం పడుతోంది. రూ.10 ఉన్న టపాసులను వ్యాపారులు రూ.30కి విక్రయిస్తున్నారు. దుకాణాల అనుమతులు, దుకాణాల ఏర్పాటు కోసం భారీగా డబ్బులు చెల్లించడంతో ఆ భారాన్ని ప్రజలపై మోపుతున్నారు. ఈ ఏడాది కూడా అధిక ధరలకు విక్రయించేందుకు వ్యాపారులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.


అధికారుల తనిఖీ : రూ.60వేల జరిమానా

నల్లగొండ టౌన్‌: నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు నిర్వహిస్తున్న బాణాసంచ దుకాణాలపై తూనికల, కొలతలశాఖ అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఎన్జీ కళాశాల్లో ఏర్పాటు చేసిన పలు దుకాణాలను తనిఖీ చేసి టపాసుల ప్యాకింగ్‌పై తయారీ తేదీ, గడువు తేదీ వంటి వివరాలు లేకపోవడంతో వాటిని సీజ్‌ చేశారు. మొత్తం ఆరు దుకాణాల్లో ఇలాంటి టపాసులు ఉండటంతో వాటి నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. అదేవిధంగా లీగల్‌ మెట్రాలజీ యాక్ట్‌ ప్రకారం వారికి రూ.60వేలు జరిమానా విధించారు.


డబ్బులడిగితే ఫిర్యాదు చేయాలి : యజ్ఞనారాయణ, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి, నల్లగొండ

బాణాసంచా దుకాణాల అనుమతి కోసం ఎవరైనా డబ్బులడిగితే నేరుగా తమకు ఫిర్యాదు చేయాలి. అలాంటి వారిపై శాఖాపర చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నాం.


Advertisement
Advertisement