తల్లిపాలు పిల్లలకు శ్రేష్ఠం

ABN , First Publish Date - 2021-08-04T05:00:17+05:30 IST

తల్లిపాలు పిల్లలకు ఎంతో శ్రేష్ఠమని సీవీఆర్‌ వైద్యులు శివప్రియ పేర్కొన్నారు. స్థానిక ఆర్‌ఆర్‌ కాలనీలోని సీవీఆర్‌ మాధవ చికిత్సాలయంలో మంగళవారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు.

తల్లిపాలు పిల్లలకు శ్రేష్ఠం
సమావేశంలో మాట్లాడుతున్న వైద్యులు

ముత్తుకూరు, ఆగస్టు 3 : తల్లిపాలు పిల్లలకు ఎంతో శ్రేష్ఠమని సీవీఆర్‌ వైద్యులు శివప్రియ పేర్కొన్నారు. స్థానిక ఆర్‌ఆర్‌ కాలనీలోని సీవీఆర్‌ మాధవ చికిత్సాలయంలో మంగళవారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేందుకు తల్లిపాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. సరైన పోషకాహారం తీసుకుంటే పాల ఉత్పత్తి పెరుగుతుందన్నారు. పిల్లలకు పోతపాలు పట్టే దానికంటే తల్లిపాలు ఇవ్వడమే మంచిదన్నారు. పిల్లల సంరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే బాలింతలు ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషకాహార సూచనలు, ఇతర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైద్యులు సుదర్శన్‌, సిబ్బంది మడోనా, హిమబిందు, సలోమి, రాణి, సమన్వయకర్తలు రమేష్‌బాబు, తాతారావు, అంగన్‌వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.   

పొదలకూరు : బిడ్డకు అమ్మపాలను మించిన ఔషధం లేదని పొదలకూరు సీహెచ్‌సీ వైద్యురాలు డాక్టర్‌ ఎస్‌.పద్మావతి అన్నారు. మంగళవారం స్థానిక సీహెచ్‌సీలో తల్లిపాల వారోత్సవాలు, తల్లులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ పద్మావతి, డాక్టర్‌ పూజితలు మాట్లాడుతూ ఆగస్టు 7 వరకు జరిగే తల్లిపాల వారోత్సవాల్లో తల్లి పాలు ప్రాధాన్యతను వివరించడం జరుగుతుందన్నారు. అమ్మపాలు బిడ్డకు ఓ వరం, అత్యంత సురక్షితం, వీటిని మించిన పౌష్టికాహారం బిడ్డకు లేనేలేదన్నారు. అదేవిధంగా మర్రిపల్లి, దుగ్గుంట, రాజుపాళెంలో కూడా ఈ తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో స్టాఫ్‌ నర్సులు రాజా, తులసి, సుజిత, హెల్త్‌ సూపర్‌ వైజర్‌ అనురాధ, ఆరోగ్య కార్యకర్త కామాక్షి, ఫార్మాసిస్ట్‌ పి.నరసింహులు, తదితరులు పాల్గొన్నారు. 

తోటపల్లిగూడూరు : తల్లిపాలలో బిడ్డకు సంపూర్ణ పౌష్టికాహారం లభిస్తుందని ఐసీడీఎస్‌ తోటపల్లిగూడూరు సెక్టార్‌ సూపర్‌వైజర్‌ లక్ష్మీరాజ్యం తెలిపారు. మంగళవారం మండలంలోని మండపం పంచాయతీలో తల్లిపాల వారోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిడ్డకు తల్లిపాల నుంచి సంపూర్ణ పౌష్టికాహారం లభిస్తుందన్నారు. బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం తల్లికి కూడా ఆరోగ్యమేనని తెలిపారు. అంతేకాక తల్లిపాలు బిడ్డలో జీర్ణకోశ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందన్నారు. కార్యక్రమంలో టీపీగూడూరు సెక్టర్‌ పరిధిలోని అంగన్‌వాడీ కార్యకర్తలు, మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు, తదితరులు పాల్గొన్నారు.  

మనుబోలు : గర్బిణులు కాన్పు అయ్యే వరకు పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ మహబూబీ అన్నారు. మండలంలోని పిడూరు మిక్సిడ్‌ కాలనీలోని  అంగన్‌వాడీ కేంద్రంలో మంగళవారం తల్లిపాల వారోత్సవాలను   నిర్వహించారు. పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యకరమైన శిశువు జన్మిస్తారని, తద్వారా తల్లిపాలు అందుబాటులో ఉంటాయని మహబూబీ గర్భిణులకు అవగాహన కల్పించారు. అనంతరం వారికి సామూహిక శ్రీమంతాలు నిర్వహించి టీహెచ్‌ఆర్‌ ప్యాకెట్లు అందజేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు మహాలక్ష్మీ, కృష్ణవేణి, మహిళా పోలీసు పవిత్ర తదితరులు పాల్గొన్నారు.    

 వెంకటాచలం : పుట్టిన బిడ్డకు కనీసం ఏడాది పాటు తప్పనిసరిగా తల్లిపాలు తాగించాలని, దీనిద్వారా చిన్నారికి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ ఎం.అన్నపూర్ణ తెలిపారు. మండలంలోని కసుమూరు, చవటపాళెం, కురిచెర్లపాడు, కనుపూరు, వెంకటాచలం తదితర గ్రామాల్లో మంగళవారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిపాల విశిష్టతను బాలింతలు, గర్భిణులకు వివరించారు. చిరు ధాన్యాలు, పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమాల్లో మహిళా కార్యదర్శి జయలలిత, అంగన్‌వాడీ సిబ్బంది మస్తానమ్మ, మాధవీ, అయిషా, శైలజ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-08-04T05:00:17+05:30 IST