Abn logo
Sep 16 2021 @ 00:00AM

ఆ ప్రజాప్రతినిధి మా పొలాన్ని ఆక్రమించుకుంటున్నారు

పట్టాదారు పాస్‌బుక్కులు, రికార్డులు చూపుతున్న రైతు దంపతులు

దౌర్జన్యంగా వరినాట్లు వేశారు

న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యం

రత్నాకర్‌రెడ్డి, సుజాతారెడ్డి దంపతులు

కడప, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి) : ‘‘నలభై ఏళ్లుగా మా అనుభవంలో ఉన్న పొలాన్ని ఓ ప్రజాప్రతినిధి ఆక్రమించుకోవాలని చూస్తున్నాడు. మా పొలంలో ఆయన మనుషులను పెట్టి దౌర్జన్యంగా వరి నాట్లు వేయించాడు’’ అని చాపాడు మండలం బూడిదపాడు గ్రామానికి చెందిన రైతు దంపతులు గడికోట రత్నాకర్‌రెడ్డి, సుజాతారెడ్డి ఆరోపించారు. గురువారం కడప ప్రెస్‌క్లబ్‌లో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బూడిదపాడు రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వే నె ం.58లో తమకు 21.35 ఎకరాల పొలం ఉందని అన్నారు. ఈ భూమి తండ్రి నుంచి తనకు వారసత్వంగా వచ్చిందని, 40 ఏళ్లుగా తమ అనుభవంలో ఉందన్నారు. 2017లో ఆ భూమిని భార్య గడికోట సుజాతారెడ్డి పేరున 7.11 ఎకరాలు, కూతురు లోహితారెడ్డికి 7.11 ఎకరాలు, శ్రీహిత రెడ్డికి 7.11 ఎకరాలు రిజిస్ట్రేషన్‌ చేయించి ఇచ్చానన్నారు. ఈ నెల 1వతేదీన పొలంలో నాట్లు వేసేందుకు పనులు చేస్తుండగా కొందరు వచ్చి ప్రజాప్రతినిధిని కలవాలని చెప్పారని, పెద్ద మనుషుల ద్వారా వెళ్లి ఆయనను కలిస్తే ఆ భూమి తాను కొన్నానని, భూమిలోకి వెళ్లవద్దని చెప్పాడని వివరించారు. అన్ని రికార్డులు తమ వద్ద ఉన్నాయని, రెవెన్యూ అధికారులు ఇచ్చిన పట్టాదారు పాసుబుక్కులు కూడా చూపించామన్నారు. ఆ మరుసటి రోజే సర్వే నెం.58లో ఉన్న తమ పొలం 21.35 ఎకరాలు రెడ్‌మార్క్‌ పెట్టారని వివరించారు. తహసీల్దారును కలిసి ఎందుకు రికార్డులు మార్చారని ప్రశ్నిస్తే టెక్నికల్‌ ప్రాబ్లమ్‌ వ ల్ల జరిగిందన్నారే తప్ప రెడ్‌మార్క్‌ తొలగించలేదని వివరించారు. పొలంలో పనులు చేస్తుండగా ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చి పనులు ఆపివేసి ఎస్‌ఐని కలవాలని సూచించారని వివరించారు. ఎస్‌ఐని కలిస్తే సీఐని కలవలన్నారన్నారు. బుధవారం తాము పొలంలో పనులు చేస్తుండగా ప్రజాప్రతినిధి మనుషులు వచ్చి అడ్డుకున్నారని, గురువారం ఆయన మనుషులే వెళ్లి తమ పొలంలో దౌర్జన్యంగా నాట్లు వేసి ఆక్రమించుకున్నారని ఆరోపించారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యనే శరణ్యమని కన్నీరుపెట్టారు. ఈ అన్యాయంపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తే డీఎస్పీని కలవమని సూచించారని, ప్రొద్దుటూరు డీఎస్పీని కలవగా ఇది సివిల్‌ మ్యాటర్‌, న్యాయస్థానంలో తేల్చుకోమని సూచించారని తెలిపారు. ఇప్పటికైనా జిల్లా రెవెన్యూ, పోలీసు అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని పేర్కొన్నారు.