అణువణువూ ఆధ్యాత్మికం

ABN , First Publish Date - 2021-04-14T06:32:03+05:30 IST

పాంచనరసింహుల దివ్యక్షేత్రం యాదాద్రీశుడి సన్నిధి అణువణువు ఆధ్యాత్మికతను నింపుకొంటోంది. ఇప్పటికే దాదాపు ప్రధాన ఆలయ పనులు పూర్తికాగా, మిగతా పనుల్లో వేగం పెంచారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ కళాక్షేత్రంలో రూపొందిన దేవతా విగ్రహాలను సాలహారాల్లో అమర్చారు.

అణువణువూ ఆధ్యాత్మికం
ఉత్తర దిశలోని సాలాహారంలో పద్మ నిధి విగ్రహం

 సాలహారాల్లో దేవతా విగ్రహాల అమరిక

 ఆళ్లగడ్డ శిల్పకళా కేంద్రం నుంచి రాక 

 241 విగ్రహాలకు 221 అమర్చిన శిల్పులు 

యాదాద్రి టౌన్‌, ఏప్రిల్‌ 13: ప్రపంచ పర్యాటక క్షేత్రం రూపుదిద్దుకుంటున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయాన్ని పూర్తిగా కృష్ణరాతి శిలలతో అద్భుత శిల్ప కళారూపాలతో తీర్చిదిద్దుతున్నారు. స్వయంభువులు కొలువుదీరిన ప్రధానాలయ మొదటి ప్రాకారం, అష్టభుజి బాహ్య, అంతర్‌ ప్రాకార మండప సాలాహారాల్లో దేవతావిగ్రహాల అమరిక తుది దశకు చేరింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని శిల్ప కళాకేంద్రంలో సాలాహారాల దేవతా విగ్రహాలను తీర్చిదిద్దారు. దశలవారీగా సాలాహారాల్లోని దేవతావిగ్రహాలను యాదాద్రి చేర్చిన వైటీడీఏ అధికారులు అమర్చే పనులను శిల్పులతో  నిర్వహిస్తున్నారు. ప్రధానాలయ సాలాహారాల్లో సుమారు 241 దేవతా విగ్రహాలను అమర్చాల్సి ఉండగా, సుమారు 221 విగ్రహాలను అమర్చిన శిల్పులు మరో 20విగ్రహాలను అమర్చితే దేవతా విగ్రహాల అమరిక పనులు పూర్తవుతాయని పేర్కొంటున్నారు. ప్రధానాలయ సాలాహారాల్లో వివిధ దిశల్లో శ్రీమన్నారాయణుడి దశావతారాలు, ఆళ్వార్లు, జయ, విజయలు, నారాయణమూర్తులు, నవ నారసింహ విగ్రహాలు, అష్టలక్ష్మీ దేవతలు, క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి, పరమ భక్తాగ్రేసరుడు ప్రహ్లాదుడు, శంకు, చక్ర తిరునామాలతో పాటు పలు శ్రీవైష్ణవ సంప్రదాయ విగ్రహాలను అమర్చనున్నారు. అయితే ప్రధానాలయ ఉత్తర ద్వారానికి ఇరువైపులా శంక నిఽధి, పద్మనిధి విగ్రహాలను ప్రతిష్ఠించారు. స్వయంభువులు కొలువుదీరిన ప్రధానాలయ మొదటి ప్రాకారంలో 93 విగ్రహాలు, అష్టభుజి అంతర్‌ ప్రాకారంలో 54 విగ్రహాలను శిల్పులు అమర్చారు. అష్టభుజి బాహ్యప్రాకార మండపంలో సుమారు 94 దేవతా విగ్రహాలు అమర్చాల్సి ఉండగా, సుమారు 74విగ్రహాలను అమర్చారు. శిల్ప కళా కేంద్రం నుంచి యాదాద్రిక్షేత్రానికి మిగిలిన 20 దేవతా విగ్రహాలను తీసుకువచ్చినట్లు, త్వరలోనే విగ్రహాల అమరిక పూర్తి చేయనున్నట్లు శిల్పులు తెలిపారు. 




Updated Date - 2021-04-14T06:32:03+05:30 IST