ఒకరికి పోస్టు కోసం ఇద్దరిపై వేటు!

ABN , First Publish Date - 2021-10-12T06:45:16+05:30 IST

రిజిస్ర్టేషన్‌ శాఖలో చలానా ఆర్థిక అవకతవకల వ్యవహారంలో ఇద్దరు సబ్‌ రిజిస్ర్టార్లపై వేటు పడడం వెనక పెద్ద తలలున్నాయా?

ఒకరికి పోస్టు కోసం ఇద్దరిపై వేటు!

సబ్‌ రిజిస్ర్టార్ల సస్పెన్షన్‌ మాటున ‘పెద్ద’ వ్యూహం!

పటమట, మండవల్లి సబ్‌ రిజిస్ర్టార్ల సస్పెన్షన్‌ వెనుక పెద్దల మంత్రాంగం

‘పటమట’లో పాగా వేసేందుకే సస్పెన్షన్‌ అస్త్రం

సందేహం రాకుండా ఉండేందుకు ఇద్దరిపై చర్యలు


రిజిస్ర్టేషన్‌ శాఖలో చలానా ఆర్థిక అవకతవకల వ్యవహారంలో ఇద్దరు సబ్‌ రిజిస్ర్టార్లపై వేటు పడడం వెనక పెద్ద తలలున్నాయా? అయిన వారిని అందలం ఎక్కించేందుకు వారిద్దరినీ బలి చేశారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తోంది. చలానా అవకతవకల వ్యవహారంలో సబ్‌ రిజిస్ర్టార్ల ఉద్దేశపూర్వక పాత్ర లేనప్పటికీ.. ఇద్దరిపై వేటు పడిన విషయం తెలిసిందే.  


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చలానా స్కామ్‌ వ్యవహారంలో ఈ ఏడాది ఆగస్టులో పటమట, మండవల్లి సబ్‌ రిజిస్ర్టార్‌లపై వేటు పడిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ వేటు పడింది స్టాంపుల నిధులను సరిగా పర్యవేక్షణ చేయలేదన్న కారణంతోనే. చలానాల మాదిరిగానే స్టాంపుల నిధుల్లోనూ అవకతవకలు చోటు చేసుకున్నాయి. చలానాల వ్యవహారాలు రాష్ట్రవ్యాప్తంగా 45 చోట్ల వెలుగులోకి రాగా, స్టాంపుల అవకతవకలు ఎక్కడా వెలుగు చూడలేదు. చలానాల అవకతవకలను వెంటనే గుర్తించి, రికవరీ చేస్తే చర్యలు తీసుకోవటానికి అవకాశం లేదు. జిల్లాలో పటమట, గాంధీనగర్‌, గుణదల, మండవల్లి సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల పరిధిలో చలానా అవకతవకలను గుర్తించగా, మండవల్లి మినహా మూడు కార్యాలయాల పరిధిలో నూరు శాతం రికవరీ చేశారు. అయినా చర్యలు తీసుకోవాలంటే, నలుగురిపైనా తీసుకోవాలి. అందుకు భిన్నంగా పటమట, మండవల్లి సబ్‌ రిజిస్ర్టార్లపై మాత్రమే వేటు వేశారు. వీరిద్దరిపై వేటుకు కారణం కూడా స్టాంపుల లావాదేవీల పర్యవేక్షణ సరిగా లేదన్నదే. ఈ కారణంతో సస్పెన్షన్‌ చేయాల్సి వస్తే ఒక్క విజయవాడలోనే పది మంది సబ్‌ రిజిస్ర్టార్లను సస్పెన్షన్‌ చేయాలి. అలా జరగలేదు. ఇదంతా చూస్తే సందేహాలు తలెత్తక మానవు. 


ఆ పోస్టు కోసమేనా?

పటమట సబ్‌ రిజిస్ర్టార్‌ పోస్టు కోసం ప్రయత్నిస్తున్న ఓ పెద్ద తల పన్నిన వ్యూహమే ఇద్దరి సస్పెన్షన్‌కు కారణమని తెలుస్తోంది. పటమట పోస్టుకు డిమాండ్‌ ఎక్కువ. ఇది అక్రమ ఆదాయాన్నిచ్చే కేంద్రంగా మారిపోయింది. ఆ ఆదాయం కోసమే ఈ సీటు మీద కన్ను వేసిన కొందరు పెద్దలు చలానాల ఆర్థిక అవకతవకల అంశాన్ని తెలివిగా ఉపయోగించు కునే ప్రయత్నం చేశారని, ఈ సస్పెన్షన్లు కూడా అందులో భాగమేనని తెలుస్తోంది. ఒక్క పటమట సబ్‌ రిజిస్ర్టార్‌ను మాత్రమే తప్పిస్తే సందేహాలొస్తాయనే తెలివిగా మండవల్లి సబ్‌ రిజిస్ర్టార్‌పైనా వేటు వేయించినట్టు రిజిస్ర్టేషన్‌ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. 


పటమట పోస్టు రేసులో ఇద్దరు  

పటమట సబ్‌ రిజిస్ట్రార్‌ పోస్టు కోసం అడిషనల్‌ డీఐజీ కార్యాలయంలో పని చేసే ఒక అధికారి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. విజయవాడ శివారు ప్రాంత సబ్‌ రిజిస్ర్టార్‌ ఒకరు అంతకంటే గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈయనకు పోస్టింగ్‌ ఇప్పించేందుకు ఓ పెద్ద తల గట్టిగా కృషి చేస్తోంది. ఆ పెద్దాయన పన్నిన వ్యూహంలో భాగంగానే ఇద్దరిపై వేటు పడినట్టు తెలుస్తోంది. 

Updated Date - 2021-10-12T06:45:16+05:30 IST