బీజేపీ, టీఆర్‌ఎస్‌ కలిసి రైతులను ఆగం చేస్తున్నాయి

ABN , First Publish Date - 2021-10-18T05:54:42+05:30 IST

బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు కలిసి తెలంగాణ రైతులను ఆగం చేస్తున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు.

బీజేపీ, టీఆర్‌ఎస్‌ కలిసి రైతులను ఆగం చేస్తున్నాయి
రెడ్డిపల్లిలో విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

- వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి

- ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

వీణవంక, అక్టోబరు 17: బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు కలిసి తెలంగాణ రైతులను ఆగం చేస్తున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. ఆదివారం వీణవంక మండలంలోని కొండపాక, పోతిరెడ్డిపల్లి, బేతిగల్‌, కనపర్తి, శ్రీరాములపేట గ్రామాల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డిపల్లి గ్రామంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో వరి పొలాలు కోతకు రావడంతో రైతులు రోడ్లుపై ధాన్యాన్ని ఆరబెట్టారన్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దవుతున్నాయన్నారు. ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని, మాయమాటలు చెప్పి రైతులను మోసం చేస్తోందన్నారు. వెంటనే ధాన్యం కొనుగోళు కేంద్రాలను ప్రారంభించి తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏడేళ్లుగా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామని చెప్పి ఒక్క ఇల్లు కూడా కట్టించలేదన్నారు. కాంగ్రెస్‌ హయాంలోనే  అభివృద్ధి జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు మద్దతుగా నిలిచి కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి గెలిపించాలన్నారు. కార్యక్రమంలో మండల ఇన్‌చార్జీలు ఆది శ్రీనివాస్‌, సింగీతం శ్రీనివాస్‌, మహిళా జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సత్యప్రసన్నదేవి, మేడ్చల్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌, టీపీసీసీ కార్యదర్శి కౌశిక్‌యాదవ్‌, నాయకులు భూపతిరెడ్డి, శ్యామ్‌గౌడ్‌, సుజాత, పద్మ, జ్యోతి, శ్యాంసుందర్‌రెడ్డి, యాదగిరి, సలీం, రహీం, జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-10-18T05:54:42+05:30 IST