చెర్నోబిల్ అణు విద్యుత్ ప్లాంట్‌ను స్వాధీనం చేసుకున్న రష్యా బలగాలు

ABN , First Publish Date - 2022-02-25T14:53:21+05:30 IST

మొత్తానికి రష్యా బలగాలు ఉక్రెయిన్‌పై యుద్ధంలో ఒక్కో అడుగు ముందుకేస్తున్నాయి. నిజానికి ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైనిక బలం కలిగిన దేశాల్లో ఒకటైన రష్యా ముందు ఉక్రెయిన్‌ నిలబడడమే కష్టం.

చెర్నోబిల్ అణు విద్యుత్ ప్లాంట్‌ను స్వాధీనం చేసుకున్న రష్యా బలగాలు

ఉక్రెయిన్ : మొత్తానికి రష్యా బలగాలు ఉక్రెయిన్‌పై యుద్ధంలో ఒక్కో అడుగు ముందుకేస్తున్నాయి. నిజానికి ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైనిక బలం కలిగిన దేశాల్లో ఒకటైన రష్యా ముందు ఉక్రెయిన్‌ నిలబడడమే కష్టం. రెండు దేశాల మిలటరీ బలాల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి యుద్ధమంటూ జరిగితే విజయమెవరిదనే దానిపై ప్రపంచ దేశాలకు పూర్తిగా క్లారిటీ ఉంది. అయినా కూడా ఉక్రెయిన్ ఏమీ వెనుకడుగు వేయడం లేదు. శక్తినంతా కూడగట్టుకుని పోరాడుతూనే ఉంది. అయినా అంతటి రష్యన్ సైన్యం ముందు నిలువలేకపోతోంది. ఈ క్రమంలోనే గురువారం ఉక్రెయిన్‌ ఉత్తర ప్రాంతంలోని చెర్నోబిల్ అణు విద్యుత్ ప్లాంట్‌ను రష్యా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయ సలహాదారు మైఖైలో పోడోల్యాక్ గురువారం తెలిపారు.




‘‘రష్యన్‌లు పూర్తి స్థాయిలో దాడికి పాల్పడిన తర్వాత చెర్నోబిల్ అణు విద్యుత్ ప్లాంట్ సురక్షితంగా ఉందని చెప్పడం అసాధ్యం. నేడు అత్యంత భయంకరమైన రోజులలో ఒకటి’’ అని పోడోల్యాక్ తెలిపారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూరోపియన్ దేశంపై భారీ స్థాయిలో త్రివిధ దళాలతో దాడి చేసి రష్యా దళాలు పవర్ ప్లాంట్‌ను స్వాధీనం చేసుకున్నాయి. నాటో సైనికంగా జోక్యం చేసుకోకూడదని సూచించడానికి రష్యా చెర్నోబిల్ అణు రియాక్టర్‌ను నియంత్రించాలని భావిస్తున్నట్టు సమాచారం. 1986లో అప్పటి సోవియట్ ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ విపత్తు, అణు కర్మాగారంలోని నాల్గవ రియాక్టర్‌లో విద్యుత్ కేంద్రం భద్రతను పరీక్షించేందుకు చేపట్టిన ప్రయోగం విఫలమవడంతో అత్యంత విధ్వంసకర అణు ప్రమాదం సంభవించింది.


దశాబ్దాల తరువాత.. ప్రస్తుతం ఇది పర్యాటక కేంద్రంగా మారింది. రష్యా దండయాత్రకు ఒక వారం ముందు చెర్నోబిల్ జోన్‌ను మూసి వేశారు. ‘‘1986 నాటి విషాదం పునరావృతం కాకుండా ఉండటానికి మా సైన్యం తమ ప్రాణాలను ఫణంగా పెడుతోంది’’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ.. రష్యా పవర్ ప్లాంట్‌ను స్వాధీనం చేసుకోవడానికి కొన్ని క్షణాల ముందు ట్వీట్ చేశారు.


Updated Date - 2022-02-25T14:53:21+05:30 IST