Advertisement
Advertisement
Abn logo
Advertisement

పత్తి కొనుగోళ్లలో దళారుల హవా..!

రైతులను మచ్చిక చేసుకునేందుకు ఆరాటం

ప్రభుత్వ మద్దతు ధర కంటే అధికంగా చెల్లింపులు

పంట విక్రయం కోసం ప్రైవేట్‌ వైపే రైతుల మొగ్గు

మంచిర్యాల, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): పత్తి కొనుగోళ్ళలో మధ్య దళారుల హవా కొనసాగుతోంది. ఆరుగాలం శ్రమించి, కష్టనష్టాలకోర్చి సాగు చేసిన పంటకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ఆశాజనకంగా లేకపోవడంతో రైతన్నలు ప్రైవేటును ఆశ్రయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం లక్షా 63వేల పై చిలుకు ఎకరాల్లో పత్తి సాగు చేయగా 10 లక్షల క్వింటాళ్లు దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే పత్తి ఏరడం ప్రారంభం కాగా రైతులు రెండు, మూడు దఫాలుగా పంటను విక్రయించారు. ప్రైవేటు మార్కెట్లో పత్తి ధర జోరు మీదుండటంతో సీసీఐ తరుపున అధికారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో ట్రేడ్‌ లైసెన్సులు గల వ్యాపారులు నేరుగా రైతుల వద్ద పత్తి కొనుగోళ్లు చేపడుతున్నారు. ఈ క్రమంలో మధ్య దళారులు రంగ ప్రవేశం చేసి, తమ పబ్బం గడుపుకోవడానికి పత్తి చేలకు వెళ్లి తమకే పంట విక్రయించేలా రైతులను మచ్చిక చేసుకుంటున్నారు. 

ప్రైవేటులో ధర భేష్‌

ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే ప్రైవేటు మార్కెట్‌లో పత్తికి ఎక్కువ మొత్తంలో గిట్టుబాటు అవుతుండటంతో రైతులు తమ పంటను వ్యాపారులకు విక్రయిస్తున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం పత్తికి ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) పొడుగు పింజ రకం క్వింటాలుకు రూ.6025 ఉండగా, మధ్య రకం పింజ రూ. 5726 ఉంది. 2020-21తో పోల్చితే పొడుగు పింజ రకం రూ.5825 ఉండగా కేవలం రూ.200, మధ్య రకానికి రూ.211 మద్దతు ధరలను పెంచారు. అదే ప్రైవేటు మార్కెట్‌లో రూ.7 వేల నుంచి 7,500 ధర పలుకుతోంది. క్వింటాలుపై దాదాపు రూ.1000 నుంచి రూ.1500 అధి కంగా లభిస్తుండటంతో రైతులు ప్రైవేటు మార్కెట్‌ను ఆశ్రయిస్తున్నారు. పైగా పత్తి తూకం వేసిన వెంటనే డబ్బులు చెల్లిస్తుండటంతో రైతులు ప్రైవేటు వైపే మొగ్గు చూపుతున్నారు. అదే ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే ఆన్‌లైన్‌ విధానంలో కనీసం 15 రోజుల తరువాత రైతు ఖాతాలో డబ్బులు జమ అయ్యేవి. పైగా ప్రభుత్వ కేంద్రాలు దూర ప్రాంతాల్లో ఉండటం, రోజుల తరబడి వాహనాలను క్యూలో ఉంచాల్సిన పరిస్థితులు ఉండేవి. ప్రస్తుతం వ్యాపారులు పంట కోసం చేల వద్దకే వెళ్తుండటంతో విక్రయాలు సులభతరంగా మారాయి. 

అడ్వాన్సులతో ముందస్తు బుకింగ్‌

ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రైతులకు ఆశాజనకంగా ఉండకపోవడంతో వ్యాపారులు వారిని మచ్చిక చేసుకుంటూ తమ పనులు కానిస్తున్నారు. పిందె దశకు వచ్చిన పంట యజమానికి దగ్గరకు ముందుగానే వెళ్తున్న వ్యాపారులు వారి అవసరాల రీత్యా డబ్బులను అడ్వాన్సు రూపంలో చెల్లింపులు చేస్తున్నారు. పంట సాగుకు అవసరమైన సాయం కోసం రైతులు వ్యాపారులను ఆశ్రయించక తప్పని పరిస్థితులు ఉంటున్నాయి. దీంతో ముందుగానే రైతులతో అవగాహన కుదుర్చు కుంటూ పంట ఏరగానే వ్యాపారులు కొనుగోళ్లు జరుపుతున్నారు. ఎప్పటి కప్పుడు అవసరాలు తీరడం, పంట చేతికొచ్చిన తక్షణమే డబ్బులు అంద డంతో రైతులు సైతం ప్రైవేటు మార్కెట్‌ను ఆశ్రయిస్తున్నారు. 

ప్రైవేటులోనే విక్రయించాను

లగిసెట్టి రాజమౌళి, గుడిపేట

ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే ప్రైవేటు మార్కెట్‌లోనే లాభసాటిగా ఉండటంతో పత్తిని వ్యాపారులకు విక్రయించాను. క్వింటాలు ఒక్కంటికి దాదాపు రూ.1500 అధికంగా ధర గిట్టుబాటు అవుతోంది. నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేయగా పంట చేతికి రావడంతోనే వ్యాపారి డబ్బులు చెల్లించడంతో ఎదురుచూపులు తప్పాయి. 

సులువుగా పంటను అమ్ముకోగలిగాను

సుంకరి శేఖర్‌, చెన్నూరు మండలం చింతపల్లి

సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పంట అమ్ముకోవడం అంత తేలికైన పని కాదు. ఆరుగాలం శ్రమించి పత్తి సాగు చేయడం ఒకెత్తయితే దాన్ని అమ్ముకోవడం కోసం విపరీతమైన తంటాలు పడాల్సి వచ్చేది. రోజుల తరబడి క్యూలో ఉంటేగానీ పత్తి అమ్ముకొనే వీలుండేది కాదు. ప్రస్తుతం వ్యాపారులు చేల వద్దనే వచ్చి కొనుగోలు చేస్తుండటంతో ఇబ్బందులు తప్పినట్లయింది. 

ఎంఎస్‌పీ తక్కువగా ఉండటం వల్లనే

మార్కెటింగ్‌శాఖ ఏడీ గజానంద్‌

పత్తికి ఈ సంవత్సరం ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్‌పీ తక్కువగా ఉండటంతో రైతులు ప్రైవేటు మార్కెట్‌ను ఆశ్రయిస్తున్నారు. అధిక ధరలు లభించే చోట పంటను అమ్ముకోవడం తప్పుకాదు. సీసీఐ తరుపున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా రైతులు పంట విక్రయించే అవకాశం లేదు. దీంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. 

Advertisement
Advertisement