అమెరికా ప్రత్యక్ష యుద్ధానికి దిగదు

ABN , First Publish Date - 2022-02-25T09:02:34+05:30 IST

ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తీవ్రంగా ఖండించారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా దళాలు ప్రత్యక్ష యుద్ధానికి దిగబోవని చెబుతూనే.. రష్యాపై కఠిన ఆంక్షలు విధించామన్నారు.

అమెరికా ప్రత్యక్ష యుద్ధానికి దిగదు

  • జర్మనీకి అదనపు బలగాలను పంపుతున్నాం: బైడెన్‌ వెల్లడి
  •  రష్యాపై ప్రపంచదేశాల భగ్గు.. దురాక్రమణ కాదన్న చైనా


వాషింగ్టన్‌, ఐక్యరాజ్య సమితి/బ్రస్సెల్స్‌, ఫిబ్రవరి 24: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తీవ్రంగా ఖండించారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా దళాలు ప్రత్యక్ష యుద్ధానికి దిగబోవని చెబుతూనే.. రష్యాపై కఠిన ఆంక్షలు విధించామన్నారు. గురువారం ఆయన అమెరికా జాతీయ భద్రత మండలి, జీ7 దేశాల ప్రతినిధులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. రష్యాకు చెందిన నాలుగు బ్యాంకులను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. ‘‘రష్యా ఆర్థిక వ్యవస్థపై పోరు ప్రారంభిస్తున్నాం’’ అని వ్యాఖ్యానించారు. అనివార్య యుద్ధానికి తెరతీసిన రష్యా.. తదనంతర పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. నాటో దేశాల భద్రత కోసం జర్మనీకి అదనపు బలగాలను తరలిస్తున్నట్లు ప్రకటించారు. కాగా.. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ, కఠినమైన ఆంక్షలను రష్యాపై విధిస్తామని ఐరోపా సమాఖ్య ప్రకటించింది.


స్వతంత్ర దేశంపై రష్యా అనాగరికంగా దాడి చేసిందని ఐరోపా కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌ డెర్‌లెయెన్‌ విమర్శించారు. రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీస్తామని, ఐరోపా సమాఖ్యలోని రష్యా ఆస్తులను స్తంభింపజేస్తామన్నారు. నాటో కూడా అత్యవసర సమావేశం నిర్వహించింది. ఉక్రెయిన్‌-రష్యా సరిహద్దుల్లో పదాతి, వైమానిక, నౌకాదళాలను మోహరించాలని నిర్ణయించారు. అయితే నాటో సభ్య దేశాలు ఉక్రెయిన్‌కు సాయంగా సైన్యాన్ని పంపుతామని హామీ ఇవ్వలేదు. చైనా, పాకిస్థాన్‌ మినహా దాదాపు ప్రపంచ దేశాలన్నీ ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండించాయి. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మాక్రాన్‌ రష్యా తన బలగాలను ఉపసంహరించుకోవాలని ట్విటర్‌లో కోరారు.


భద్రతా మండలిలో చర్చిస్తుండగానే దాడి..

ఉక్రెయిన్‌-రష్యా అంశంపై బుధవారం రాత్రి భద్రతా మండలిలో చర్చ జరుగుతున్న సమయంలోనే పుతిన్‌ ఉక్రెయిన్‌పై దాడికి ఆదేశించారు. ఉక్రెయిన్‌-రష్యా మధ్య ఉద్రిక్తతలు తగ్గించాలని భారత్‌ సహా సభ్య దేశాలు భద్రతా మండలిలో పిలుపునిచ్చిన సమయంలోనే ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతంలో భారీ పేలుళ్లు జరిగాయి. ఉక్రెయిన్‌ వ్యవహారంతో సంబంధం ఉన్న దేశాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలను పెంచే ఎలాంటి చర్యలూ తీసుకోరాదని చైనా పిలుపు ఇచ్చింది. యుద్ధం వల్ల తలెత్తే పరిణామాలకు రష్యాయే మండలి ముందు బాధ్యత వహించాలని ఫ్రాన్స్‌ వ్యాఖ్యానించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఉక్రెయిన్‌కు భయంకరమైన రోజని, యూర్‌పకు చీకటి రోజని జర్మనీ చాన్సలర్‌ ఓలాఫ్‌ స్కోల్జ్‌ అన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా తన మిలిటరీ ఆపరేషన్లను వెంటనే నిలిపివేయాలని ఉక్రెయిన్‌ రాయబారి సెర్గీ క్రిస్‌లిట్స్‌యా.. రష్యా రాయబారి వాసిలి నెబెంజియాను కోరారు. అయితే.. కీవ్‌లో అధికారంలో ఉన్న జుంటాకు మాత్రమే తాము వ్యతిరేకమని నెబెంజియా చెప్పారు. రక్తపాతం, విధ్వంస మార్గంలో రష్యా ఉందని, ఇది ఐరోపా ఖండానికే విపత్తు అని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ అన్నారు. రష్యాపై భద్రతామండలి ఆంక్షలను శుక్రవారం ప్రకటిస్తామని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మార్రిసన్‌ తెలిపారు. కాగా.. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఈ అంశంపై స్పందించారు.


ప్రపంచదేశాలు మానవతా దృక్పథంతో ఉక్రెయిన్‌కు సహాయంగా నిధులు ఇవ్వాలని కోరారు. కాగా, రష్యాపై ఆంక్షలను చైనా వ్యతిరేకించింది. అమెరికా, దాని మిత్రపక్ష దేశాలే ఈ సంక్షోభాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్లాయని, రష్యాను అవి రెచ్చగొట్టాయని ఆరోపించింది. ఉక్రెయిన్‌పై రష్యాది దురాక్రమణ కాదని చైనా విదేశాంగ ప్రతినిధి హర్యా చున్‌యింగ్‌ అన్నారు. ఉక్రెయిన్‌ మీదుగా పౌర విమానాలు ప్రయాణించడం అత్యంత ప్రమాదకరమని ఐరోపా సమాఖ్య విమానయాన భద్రత సంస్థ(ఈఏఎ్‌సఏ) హెచ్చరించింది. 


రష్యాకు మా నైతిక మద్దతు: సీపీఐ

అనంతపురం, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): ఈ యుద్ధం ఉక్రెయిన్‌, రష్యాకు జరుగుతున్నది కాదని, అమెరికా సామ్రాజ్యవాదానికి, రష్యాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంగానే తాము చూస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్పారు. అనంతపురంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రష్యా అధ్యక్షుడికి తమ నైతిక మద్దతు ఉంటుందని చెప్పారు. 

Updated Date - 2022-02-25T09:02:34+05:30 IST