Abn logo
Aug 1 2021 @ 02:15AM

కోర్టుల్లో మాతృభాషలో సమస్య చెప్పే అవకాశమివ్వాలి!

  • భార్యభర్తల కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అదే చేశారు 
  • ప్రజలు చైతన్యవంతులైతే భాషా పరిరక్షణకు ప్రభుత్వాలు ముందుకొస్తాయి
  • ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు


హైదరాబాద్‌ సిటీ, జూలై31(ఆంధ్రజ్యోతి): న్యాయస్థానాల్లో తమ సమస్యలను మాతృభాషలో చెప్పుకొనే అవకాశం అర్జీదారులకు ఉండాలని, న్యాయమూర్తుల తీర్పులూ ప్రాంతీయ భాషల్లోనే ఉండాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, 21 ఏళ్లుగా దంపతుల మధ్య కొనసాగుతున్న కేసును సామరస్యపూర్వకమైన రీతిలో పరిష్కరించారని గుర్తు చేశారు.  ఆ కేసులో బాధితురాలు ఆంగ్లంలో తన సమస్యను చెప్పేందుకు ఇబ్బందులు పడుతుంటే మాతృభాష అయిన తెలుగులో చెప్పుకొనేందుకు అవకాశం కల్పించారని కొనియాడారు. ప్రజలకు సరైన న్యాయం అందాలంటే వారికి తమ సమస్యలను మాతృభాషలో వ్యక్తీకరించే అవకాశం ఇవ్వాలనేందుకు ఈ ఘటన రుజువు చేసిందని పేర్కొన్నారు. అమ్మభాషంటేనే ఘనమైన వారసత్వం అని, యునెస్కో తీర్మానానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన భాషా విధానాన్ని ప్రకటించడంతో పాటు అమలుచేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. శనివారం ‘తెలుగు కూటమి’ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ వేదికగా తెలుగు భాషాభిమానల సదస్సు జరిగింది. ఇందులో ప్రధానవక్తగా వెంకయ్య పాల్గొన్నారు. 


మాతృభాషను కోల్పోతే మన అస్తిత్వాన్ని కోల్పోయినట్లే అని, మాతృభాషను కాపాడుకునేందుకు సృజనాత్మక విధానాలమీద దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని వెంకయ్య అన్నారు.  ప్రాథమిక విద్యను మాతృభాషలో అందేలా చూడాలని, పరిపాలనా భాషగా స్థానిక భాషకు ప్రాధాన్యం ఇవ్వాలని, సాంకేతిక విద్యలో మాతృభాషల వినియోగం పెంచాలని, ప్రతి ఒక్కరూ ఇంట్లో మాతృభాషలోనే మాట్లాడాలని సూచించారు. ప్రతి గ్రామంలో రాజకీయాలకు అతీతంగా మాతృభాషను పరిరక్షించుకునేందుకు స్థానికులంతా కలిసి తెలుగు కూటమి వంటి బృందాలుగా ఏర్పడాలని పిలుపునిచ్చారు. మాతృభాష పరిరక్షణ కోసం వివిధ దేశాలు అనుసరిస్తున్న విధానాల నుంచి స్ఫూర్తి పొందాలన్నారు. తమ సొంత భాషల్లోనే విద్యను అందిస్తున్న ఫ్రాన్స్‌, జర్మనీ, స్వీడన్‌, రష్యా, జపాన్‌, చైనా, ఇటలీ, బ్రెజిల్‌  దేశాలు అభివృద్ధి చెందిన ఆంగ్ల దేశాలతో పోటీపడుతున్నాయని పేర్కొన్నారు. ఏ భాషైనా విశ్వవ్యాప్తం కావడానికి, పరిపుష్టి చెందడానికి అనువాదాలు ఎంతో అవసరమని అన్నారు. ఇతర భాషల సాహిత్యం తెలుగులోకి అనువాదమవుతున్నంతగా తెలుగు సాహి త్యం ఇతర భాషల్లోకి వెళ్లడంలేదని విచారం వ్యక్తం చేశారు. ప్రాచీన సాహిత్యాన్ని సరళభాషలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరగాలని అభిలషించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, విశ్రాంత ఐఏఎస్‌ నందివెలుగు ముక్తేశ్వరరావు, తెలంగాణ తొలి సాహిత్యఅకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, భారత భాషాశాస్త్రవేత్తల సంఘం అధ్యక్షుడు గారపాటి ఉమామహేశ్వరరావు, విశ్రాంత ఐపీఎస్‌ చెన్నూరు ఆంజనేయరెడ్డి, తాజా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్‌, ద్రవిడ విశ్వవిద్యాలయ డీన్‌ పులికొండ సుబ్బాచారి, తెలుగు కూటమి అధ్యక్షుడు పారుపల్లి కోదండరామయ్య తదితరులు పాల్గొన్నారు.


కేసీఆర్‌ చొరవతోనే తెలంగాణలో భాషా వికాసం 

మాతృభాష పరిరక్షణ కోసం సాంకేతికంగా భాషావినియోగం విస్తృతం కావాలని వెంకయ్య ఆకాంక్షించారు. గ్రామీణ భాషాపదజాలాన్ని సమీకరించాలని, అంతరిస్తున్న పదాలను వెలికితీయాలని, వృత్తిపదకోశాలు, మాండలిక పదకోశాలు రూపొందించాలని పేర్కొన్నారు. ప్రజలు చైతన్యంతో ముందుకొస్తే, భాషా పరిరక్షణకు ప్రభుత్వాలు ప్రోత్సహిస్తాయని పేర్కొన్నారు.  ఉన్నతస్థానాల్లోని వ్యక్తులు తమ మాతృభాషకు ప్రాధాన్యమిస్తే, సామాన్యులూ అందిపుచ్చుకుంటారని వ్యాఖ్యానించారు. తెలుగు భాషాఽభివృద్ధిపై సానుకూల దృక్పథం కలిగిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ చొరవ వల్లే ఆ రాష్ట్రంలో భాషావికాసానికి బాటలు పడుతున్నాయని కొనియాడారు.