నిన్ను బతికించుకోలేకపోయాం..మన్నించు సాయి

ABN , First Publish Date - 2020-05-29T10:27:08+05:30 IST

ఎన్ని సంఘటనలు జరిగినా.. ఎంత అత్యాధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా బోరుబావుల్లో పడిపోతున్న పసివాళ్లను మాత్రం కాపాడుకోలేకపోతున్నాం.

నిన్ను బతికించుకోలేకపోయాం..మన్నించు సాయి

బోరుబావిలో పడిన బాలుడి మృతి 

11 గంటల పాటు శ్రమించినా దక్కని ప్రాణం

రాత్రంతా అక్కడే ఉండి సహాయక చర్యలు 

పర్యవేక్షించిన కలెక ్టర్‌, ఎస్పీ, ఎమ్మెల్యే


ఆంధ్రజ్యోతి ప్రతినిధి మెదక్‌/ పాపన్నపేట, మే 28: ఎన్ని సంఘటనలు జరిగినా.. ఎంత అత్యాధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా బోరుబావుల్లో పడిపోతున్న పసివాళ్లను మాత్రం కాపాడుకోలేకపోతున్నాం. ఈ సంఘటనలు తలుచుకుని బాధిత కుటుంబాలకు జీవితకాలం కన్నీరే మిగులుతోంది. ఇందుకు ఉమ్మడి మెదక్‌ జిల్లాలో జరిగిన రెండు ఘటనలే సజీవ సాక్ష్యాలు. గురువారం మెదక్‌ జిల్లా పొడ్చన్‌పల్లిలో జరిగిన ఘటనలో సాయివర్ధన్‌ ప్రాణాలు కోల్పోయాడు. అధికారులు, సహాయక సిబ్బంది ఎన్ని ప్రయత్నాలు చేసినా అతన్ని సజీవంగా తేలేకపోయాయి. 


తీవ్రంగా శ్రమించిన ‘ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ’ బృందాలు 

మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లికి చెందిన మంగళి భిక్షపతి లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు నవీన, భార్గవి. నవీనను సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన గోవర్దన్‌కు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ముగ్గురు కొడుకులు. లాక్‌డౌన్‌తో పనులు లేక గోవర్దన్‌ కొన్నాళ్ల క్రితం అత్తగారి ఊరు పొడ్చన్‌పల్లికి వచ్చాడు. భిక్షపతి పొలంలో నీటి వసతి కోసం బుధవారం మూడు బోర్లు తవ్వించాడు. మూడింటిలోనూ నీరు పడకపోవడంతో సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో గోవర్దన్‌ ముగ్గురు కొడుకుల్లో చిన్నవాడైన సాయివర్ధన్‌ (3) ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. అప్పటి వరకు తమతో ఉన్న చిన్నారి బోరుబావిలో పడడంతో కుటుంబీకుల రోధనలు మిన్నంటాయి. స్థానికులతో సహాయంతో బాలుడిని వెలికి తీసే ప్రయత్నం చేశారు.


విషయం తెలుసుకున్న మెదక్‌ కలెక్టర్‌ ధర్మారెడ్డి, ఎస్పీ చందనాదీప్తి, ఎమ్మెల్యే పద్మారెడ్డి ఘటనాస్థలానికి చేరకున్నారు. 120 ఫీట్ల లోతు ఉన్న బోరుబావిలో బాలుడు పడిపోగా సుమారు 17 అడుగుల వద్ద ఉన్నట్లు గుర్తించారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌, విజయవాడకు చెందిన రెండు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ (నేషనల్‌ డిజాస్టర్‌ రిలీఫ్‌ ఫోర్స్‌) బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. కెమెరాలు, ప్రత్యేక పరికరాలను బోరుబావిలోకి పంపి బాలుడిని గుర్తించి బోరుబావికి సమాంతరంగా గుంత తవ్వించారు. గురువారం తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో సాయివర్ధన్‌ను బోరుబావి నుంచి బయటకు తీశారు. అప్పటికే బాలుడు మృతిచెందాడు. శ్వాస ఆడకపోవడంతో చనిపోయి ఉంటాడని వైద్యులు నిర్ధారించారు. మట్టిపెళ్లలు పడడం వల్ల ఆక్సిజన్‌ పైపు వేసినా ఆ చిన్నారికి అందక, బావిలో పడ్డ 3, 4 గంటల్లోపే ప్రాణాలు కోల్పోయి ఉంటాడని భావిస్తున్నారు.


కన్నీటి సంద్రమైన పొడ్చన్‌పల్లి

గురువారం తెల్లవారుజామున సహాయక చర్యలు చివరిదశకు చేరడంతో తమ కుమారుడు ఎలాగైనా బయటకు వస్తాడని వేయి కళ్లతో ఎదురుచూసిన ఆ కుటుంబానికి తీరని శోకమే మిగిలింది. విగతుడిగా ఉన్న సాయిని ఎత్తుకుని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది అంబులెన్స్‌ వద్దకు పరుగులు తీస్తుండగా ఆ దృశ్యాలను చూసి తల్లిదండ్రులు, బంధువులు బోరుమన్నారు. బావిలో పడ్డప్పటి నుంచి కంటికి మిన్నుగా ఏడుస్తున్న తల్లిదండ్రులు కొడుకును అలా చూసి కుప్పకూలారు. ‘నా కొడుకును ఇవ్వండంటూ’ తల్లి నవీన రోధించిన వైనం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. అప్పటికే పొడ్చన్‌పల్లి గ్రామస్థులు, చుట్టుపక్కల ప్రాంతాల వారు పెద్దఎత్తున ఘటనా స్థలిలో ఉన్నారు. బాలుడు చనిపోయాడని తెలిసి విలపించారు. మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి కూడా కన్నీరు పెట్టుకున్నారు.


రాత్రంతా ఘటనా స్థలంలోనే

బోరుబావిలో పడ్డ బాలుడిని రక్షించేందుకు అధికార యంత్రాంగం 11 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్‌ చేసింది. బుధవారం సాయంత్రం 5 గంటల నుంచే రెవెన్యూ, పోలీస్‌, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించగా రాత్రి 9:30 గంటలకు ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బృందం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేసింది. వారికి విజయవాడ నుంచి వచ్చిన మరో ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బృందం తోడైంది. సుమారు 35 మంది ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఘటనా సమాచారం తెలియగానే బుధవారం సాయంత్రం నుంచే కలెక్టర్‌ ధర్మారెడ్డి, ఎస్పీ చందనాదీప్తి అక్కడికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. బుధవారం రాత్రి ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ‘ఇఫ్కో’ డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి ఘటనా స్థలానికి వచ్చి అధికారులను అప్రమత్తం చేశారు.


కలెక్టర్‌, ఎస్పీ, ఎమ్మెల్యే, అడిషనల్‌ కలెక్టర్‌, ఇతర సిబ్బంది గురువారం తెల్లవారుజామున రెస్క్యూ ఆపరేషన్‌ పూర్తయ్యేంత వరకు అక్కడే ఉన్నారు. తల్లిదండ్రులకు ధైర్యం చెబుతూ ఓదార్చారు. మంత్రి తన్నీరు హరీశ్‌రావు సహాయక చర్యలను ఎప్పటికప్పుడు ఫోన్‌ద్వారా తెలుసుకుని అధికారులకు సూచనలు చేశారు. మెదక్‌ ఆర్డీవో సాయిరాం, తహసీల్దార్‌ బలరాం, ఎంపీడీవో శ్రీనివాస్‌, డీఎస్పీ కృష్ణమూర్తి, సీఐ రాజశేఖర్‌, ఎంపీపీ చందన  ప్రశాంత్‌రెడ్డి తదితరులు ఘటనాస్థలం వద్దే ఉండి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. 


చిన్నపాటి అజాగ్రత్తకు భారీ మూల్యం

బోరుబావుల తవ్వకాలు నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్నాయి. వాటిని ఎలా తవ్వించాలి? ఎవరి నుంచి అనుమతి తీసుకోవాలి? నీరు పడకపోతే ఏం చేయాలి? అనే విషయాలపై గతంలోనే ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినా క్షేత్రస్థాయిలో అమలైన దాఖలాలు లేవు. చిన్నారులు బోరుబావుల గుంతల్లో పడిపోయినపుడు మాత్రం అటు ప్రభుత్వం, ఇటు అధికారులు నానా హడావుడి చేయడం, కేసులు పెట్టడం ఆ తర్వాత యథాలాపంగానే నిర్లక్ష్యం చేస్తుండటంతో ప్రమాదాలకు అడ్డుకట్ట పడటం లేదు. చిన్నపాటి నిర్లక్ష్యం.. విలువైన నిండుప్రాణాల్ని బలితీసుకుంటోంది.  


బోరు రిగ్గు యజమానిపై కేసు నమోదు

బోరు రిగ్గు యజమానిపై గురువారం కేసు నమోదు చేసినట్లు పాపన్నపేట ఎస్‌ఐ ఆంజనేయులు పేర్కొన్నారు. పొడ్చన్‌పల్లిలో బోరుబావిలో పడి మృతి చెందిన బాలుడి తండ్రి మంగలి గోవర్దన్‌ ఫిర్యాదు మేరకు వాహన యజమాని డొంతర జంగయ్యపై ఐపీసీ 304ఏ సెక్షన్‌  కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. డొంతర జంగయ్య, అతడి బోరుబండి ఏపీ29బీటీ0288 వాహనంపైనా కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 


పాశమైలారంలో అంత్యక్రియలు

పటాన్‌చెరు రూరల్‌ : సాయివర్ధన్‌ తండ్రి గోవర్దన్‌ స్వగ్రామం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారం. పటాన్‌చెరులో ఇల్లు నిర్మాణంలో ఉండగా పాశమైలారంలో ఉంటున్నారు. సాయివర్ధన్‌ మృతదేహాన్ని పాశమైలారం తీసుకొచ్చి అంత్యక్రియలను నిర్వహించారు. 

Updated Date - 2020-05-29T10:27:08+05:30 IST